నన్ను చంపేందుకు కుట్ర : షర్మిల.. లోటస్ పాండ్ వద్ద ఉద్రిక్తత

తెలంగాణ ప్రభుత్వం తనను చంపేందుకు కుట్ర చేస్తోందని వైఎస్సార్ టీపీ చీఫ్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2022-12-09 16:21 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ ప్రభుత్వం తనను చంపేందుకు కుట్ర చేస్తోందని వైఎస్సార్ టీపీ చీఫ్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. లోటస్ పాండ్ వద్ద తమ పార్టీ నేతలపై పోలీసుల దురుసు ప్రవర్తన కారణంగా ఆమె రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆమెను అక్కడి నుంచి పోలీసులు బలవంతంగా లోటస్ పాండ్ కు తరలించారు. ఈ సందర్భంగా షర్మిల మీడియాతో మాట్లాడారు. తనను ఏం చేసినా సరే.. పచ్చి మంచినీళ్లు కూడా ముట్టబోనని షర్మిల తన దీక్షను కొనసాగిస్తున్నారు. పోలీసులు అరెస్ట్ చేసిన తమ కార్యకర్తలను విడిచిపెట్టడంతో పాటు తన పాదయాత్రకి వెంటనే అనుమతి ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. లోటస్ పాండ్ పరిసరాల్లో కర్ఫ్యూ ఎందుకు విధించారని ఆమె పోలీసులను ప్రశ్నించారు. పోలీసులు బలవంతంగా లాక్కెళ్లడంపై ఆమె ఆగ్రహం వ్యక్తంచేశారు.

మహాత్మ గాంధీ సైతం తన ఇంట్లో సత్యాగ్రహ దీక్ష చేశారని ఈ సందర్భంగా ఆమె గుర్తుచేశారు. తమ పార్టీ నేతలను విడిచిపెట్టేవరకు పచ్చి మంచి నీళ్ళు కూడా ముట్టనని భీష్మించుకున్నారు. మహిళలను 6 గంటలకు మించి పోలీస్ స్టేషన్ లో ఉంచకూడదని, అయినా నిబంధనలకు విరుద్ధంగా మహిళా నేతలను పోలీస్ స్టేషన్ లో ఉంచారని ఆరోపణలు చేశారు. పోలీసులు తమను మనుషుల్లా ఏమాత్రం చూడట్లేదని, వీరు బీఆర్ఎస్ నేతలకు ఏజెంట్లుగా మారరని ధ్వమజెత్తారు. ఇలా చేస్తున్నందుకు పోలీస్ శాఖపై కూడా కేసు వేయాలన్నారు. ఇదిలా ఉండగా తమ కార్యకర్తలపై దురుసుగా పోలీసులు ప్రవర్తించడంతో లోటస్ పాండ్ ఎదుట రోడ్డుపైనే షర్మిల దీక్షకు కూర్చున్నారు. కాగా ఆమెను, పార్టీ నేతలను అక్కడినుంచి లోటస్ పాండ్ దీక్ష ప్రాంగణం వరకు బలవంతంగా తరలించగా పలువురికి గాయాలైనట్లు పార్టీ నేతలు చెప్పారు.


విజయమ్మను అడ్డుకున్న పోలీసులు

లోటస్ పాండ్ ఎదుట దీక్ష చేస్తున్న షర్మిలకు సంఘీభావం తెలిపేందుకు విజయమ్మ తన ఇంటి నుంచి బయలుదేరగా రానివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీనిపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం పాదయాత్రలను ఆపింది లేదని గుర్తుచేశారు. షర్మిలకు తెలంగాణలో రోజురోజుకూ పెరుగుతున్న ఆదరణ చూసి తట్టుకోలేక ప్రభుత్వం ఇలాంటి దుశ్చర్యలకు దిగుతోందని ఫైరయ్యారు. పోలీసులు పైనుంచి వచ్చిన ఒత్తిడి వల్ల తనను అడ్డుకుంటున్నారని తెలిపారు. షర్మిల ఎవరి బాణం కాదని, వైఎస్సార్ బిడ్డ అన్నారు. రెండు వేల కిలోమీటర్లు దాటినప్పటి నుంచి టీఆర్ఎస్ దాడులు చేయడం ప్రారంభించిందని, నర్సంపేటలో తారాస్థాయికి చేరిందన్నారు. ప్రజలు ఇవన్నీ చూనస్తున్నారని, వారు ఈ సర్కారుకు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.

Similar News