బీఆర్ఎస్ పాలనలో నిత్యం కన్నీరే: మాజీ ఎమ్మెల్యే

బీఆర్ఎస్ పాలనలో రైతులకు నిత్యం కన్నీరే తప్ప ఏమీ లేదని మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాపరెడ్డి అన్నారు.

Update: 2023-06-02 15:16 GMT

దిశ,జనగామ: బీఆర్ఎస్ పాలనలో రైతులకు నిత్యం కన్నీరే తప్ప ఏమీ లేదని మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాపరెడ్డి అన్నారు. శుక్రవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జనగామ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రైతాంగానికి మేలు చేస్తామని చెప్తున్న ప్రభుత్వం ఏ ఒక్క మేలు చేయకపోగా ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు అకాల వర్షానికి ఐకెపి సెంటర్లో మొలకెత్తడం బాధాకరమన్నారు.

నష్ట నివారణ చర్యలు తీసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆచరణ సాధ్యం కానీ హామీలు ఇచ్చి, సబ్బండ వర్గాల కృషి ఫలితం వల్ల ఆనాడు కాంగ్రెస్ పార్టీ యూపీఎ చైర్ పర్సన్ సోనియా గాంధీ సాహసోపేతమైన నిర్ణయం వల్ల ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని రాబందుల్లా కేసీఆర్ కుటుంబం దోచుకొని దాచుకుంటుందన్నారు. దశాబ్ది పేరుతో శతాబ్ది వరకు సరిపోయేంత అక్రమ సంపాదన ఈరోజు దేశంలో ఏ రాజకీయ నాయకుని దగ్గర లేనంత అక్రమ సంపాదన కేసీఆర్ కుటుంబం దగ్గర ఉందంటే అతిశయోక్తి కాదని ఆయన తెలిపారు. ఉద్యమకారులను అణగదొక్కి ఉద్యమ ద్రోహులకు పదవులు కట్టబెట్టింది వాస్తవం కాదా అని ఆయన ప్రశ్నించారు.

ఎన్నో ఆశలు ఆశయాలతో తెలంగాణ రాష్ట్రం సిద్ధించే వరకు కృషిచేసిన నాయకులను అన్యాయంగా బయటకు పంపించి రాక్షసానందం పొందుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు సరియై న్యాయం చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని అన్నారు. రాష్ట్రంలో ప్రజల పన్నుల తోటి ఒకవైపు ప్రగతి భవన్ మరొకవైపు సచివాలయం నిర్మించుకొని ప్రతిపక్ష పార్టీ నాయకులను ప్రజలను రానీయకుండా అవి దేనికి ఉపయోగపడతాయో ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రజలు కోరుకున్న తెలంగాణ కాక అప్రజా స్వామిక తెలంగాణ రాజ్యమేలుతుందన్నారు.

ఎన్నో కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఈరోజు తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ఒక నియంతలాగా నిర్వహించడం ముఖ్యమంత్రి కేసీఆర్ ద్వంద్వ వైఖరి కి నిదర్శనం కాదా అని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పైన ఉన్నటువంటి భ్రమలు తొలగిపోయి, ఆయన నిజస్వరూపాన్ని ప్రజలు ఎప్పటికప్పుడు గమనిస్తున్న విషయాన్ని మర్చిపోవద్దు అన్నారు. ఎంతో చైతన్యవంతమైన తెలంగాణ ప్రజలు స్వరాష్ట్ర సాధన కోసం ఏ విధంగానైతే నడుం బిగించారో ఈ యొక్క బీఆర్ఎస్ బంధుప్రీతి కుటుంబ పాలన ఆశ్రిత పక్షపాతాన్ని రానున్న ఎన్నికల్లో ఓటు ద్వారా బుద్ధి చెబుతారన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీకి కృతజ్ఞతగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జనగామ జిల్లా నాయకులు జిల్లెల్ల సిద్దారెడ్డి, చారబుడ్ల దయాకర్ రెడ్డి, గంగం నర్సింహరెడ్డి,బనుక శివరాజ్ యాదవ్, వంగాల మల్లారెడ్డివంగాల కళ్యాణి, మోటే శ్రీనివాస్,లింగాల నర్సిరెడ్డి,ఆలేటి సిద్దిరాములు, బొట్ల నర్సింగరావు,నాగoపల్లి శ్రీనివాస్,విజయ లక్ష్మి,పిట్టల సతీష్,ఆకుల లక్ష్మయ్య, జాయ మల్లేష్,బండారు శ్రీనివాస్, కాలె ఉప్పలయ్య దాసరి క్రాంతి తదితరులు పాల్గొన్నారు.

Similar News