జీడీపీ గురించి కాదు కేసీఆర్!.. జీతాల గురించి మాట్లాడు.. మాజీ మంత్రి ఈటల

ఉద్యోగుల జీతాల గురించి మాట్లాడకుండా దేశ జీడీపీ గురించి మాట్లాడటం సిగ్గుచేటని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మండిపడ్డారు.

Update: 2023-01-29 15:12 GMT

దిశ, జనగామ: కేసీఆర్ రాష్ట్రంలో ఉద్యోగుల జీతాల గురించి మాట్లాడకుండా దేశ జీడీపీ గురించి మాట్లాడటం సిగ్గుచేటు అని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మండిపడ్డారు. ఆదివారం జనగామ పట్టణంలో నిర్వహించిన ముదిరాజ్ ఎంప్లాయీస్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ఈటల ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఉద్యోగులకు నెల నెలా సకాలంలో వేతనాలు చెల్లించలేని దౌర్భాగ్య స్థితిలో రాష్ట్రం పడిపోయిందని అన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారని, గ్రామాల్లో కేంద్రం ఇచ్చిన నిధులతోనే ఇప్పటికీ అభివృద్ధి పనులు చేపడుతున్నారని, రాష్ట్రంలో చిల్లి గవ్వ లేదని అన్నారు. సంక్షేమ పథకాలను పేరు చెప్పి రాష్ట్రంలో దోపిడీకి పాల్పడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో మత్స్యకారుల జనాభా పెద్దదని, కానీ వారు విద్యకు నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ జాతి రుణం తీర్చుకోవడానికి ఈ సంఘం ఏర్పడిందని, ఇంతకుముందు కులాలవారీగా మీటింగ్ పెట్టుకుంటే ఏ పార్టీ వారైనా నాయకులందరూ.. ఒకే వేదిక మీద వచ్చేవారని చెప్పారు. సభకు వెళ్లొద్దని ముదిరాజులను భయపెడుతున్నారని కానీ ఈ జాతి భయపడే జాతి కాదని అన్నారు. ముదిరాజుల జోలికి వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ముదిరాజ్ లకి ఇచ్చిన జీవోలని రాష్ట్ర ప్రభుత్వం అమలు చెయ్యాలని డిమాండ్ చేశారు. జీవో నంబర్ 6 అనేది మత్స్యకారులు బాగుండాలని ఇచ్చిందని, కానీ ఆ జీవోను అమలు చేయడం లేదని ఆరోపించారు.

రెండున్నర ఎకరాలు ఉండాలి అనే నిబంధన జ్ఞానంలేని నిబంధన అని, ప్రాజెక్ట్స్ కింద భూమికోల్పోయిన ప్రతి ఒక్కరికీ సభ్యత్వం ఉండాలని తాను చేగుంట వెళ్లి ఘర్జిస్తే వెంటనే సభ్యత్వాలు ఇస్తున్నారని అన్నారు. ఇలానే రాష్ట్రమంతా ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమ జాతిని చూసే తమకు అధికారం వచ్చిందని, జాతి ప్రజలకు అన్యాయం జరుగుతోంటే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. వార్డ్ మెంబర్ నుండి పార్లమెంట్ వరకు వచ్చే ఏ అవకాశాన్ని వదులుకోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా మండలాల ముదిరాజ్ సంఘం నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అంతకు ముందుగా ప్రధాని నరేంద్ర మోడీ నిర్వహించిన మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ఆయన జనగామ జిల్లా బీజేపీ నాయకులతో కలిసి వీక్షించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు దశమంత రెడ్డి, నాయకులు సౌడ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Similar News