TSPSC పేపర్ లీక్ కేసులో కీలక మలుపు.. సిట్ దర్యాప్తులో బయటపడుతోన్న సంచలన విషయాలు!

టీఎస్పీఎస్సీ బోర్డు పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో తవ్వినా కొద్దీ సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి.

Update: 2023-06-05 06:18 GMT

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: టీఎస్పీఎస్సీ బోర్డు పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో తవ్వినా కొద్దీ సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా కోర్టు అనుమతితో కస్టడీకి తీసుకున్న విద్యుత్ శాఖ డీఈ రమేష్‌ను జరిపిన విచారణలో అతని ద్వారా ఓ మాజీ ఎంపీటీసీ కూతురు కూడా ఏఈఈ సివిల్, జనరల్ నాలెడ్జ్ పరీక్ష రాసినట్టు వెళ్ళడైనట్టు తెలిసింది.

సంచలనం సృష్టించిన ఈ కేసులో దర్యాప్తు వేగాన్ని పెంచిన సిట్ అధికారులు ఇటీవల వరంగల్ జిల్లా విద్యుత్ శాఖలో డీఈగా పని చేస్తున్న రమేష్‌ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. విచారణలో రమేష్ ఏఈఈ సివిల్, జనరల్ నాలెడ్జ్, డీఏఓ పరీక్షల ప్రశ్నాపత్రాలను 40 మందికి ఇవ్వటంతో పాటు హైటెక్ పద్దతిలో మాస్ కాపీయింగ్ చేయించినట్టు తేలింది.

ఈ క్రమంలోనే రమేష్ నుంచి మరిన్ని వివరాలు తెలుసుకోవాల్సి ఉందని సిట్ అధికారులు కోర్టు అనుమతితో అతన్ని ఆదివారం కస్టడీకి తీసుకున్నారు. విచారణలో కరీంనగర్ జిల్లా బొమ్మకల్ మండలానికి చెందిన మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ కూతురు రమేష్ ద్వారా ఏఈఈ సివిల్, జనరల్ నాలెడ్జ్ పరీక్ష రాసినట్టు తేలింది. శ్రీనివాస్‌ను కలిసిన రమేష్ 75 లక్షలకు ఒప్పందం చేసుకున్నట్టు వెళ్లడయ్యింది. ఈ క్రమంలో ఆ ఎంపీటీసీ కూతురు పరీక్ష రాయగా ఎలక్ట్రానిక్ డివైస్ ద్వారా ఆమెకు రమేష్ జవాబులు చేరవేసినట్టు తేలింది.

హైకోర్టులో పిటిషన్..

ఇదిలా ఉండగా, బోర్డు ఈనెల 11న నిర్వహించనున్న గ్రూప్1 ప్రిలిమ్స్ పరీక్షపై తాజాగా మరో పిటిషన్ హైకోర్టులో దాఖలయ్యింది. పరీక్షల ప్రశ్నాపత్రాలు లీకైన సమయంలో ఉన్న సిబ్బందితోనే బోర్డు గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించనుండటంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కొందరు ఈ పిటిషన్ వేశారు. పరీక్షను వాయిదా వేసేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోర్టును కోరారు. దీనిపై విచారణ జరగాల్సి ఉంది. మరోవైపు బోర్డు ఇప్పటికే గ్రూప్1 ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించి హాల్ టికెట్లను ఇప్పటికే జారీ చెయ్యటం గమనార్హం.

Tags:    

Similar News