ఏసీడి పేరుతో అదనపు భారం వేయడం అమానుషం..

రాష్ట్ర ప్రభుత్వం అడ్వాన్స్ కంజక్షన్ డిపాజిట్ (ఎసీడీ) పేరుతో విద్యుత్ వినియోగ దారులపై అదనపు చార్జీలను వసూలు చేయడాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి దాసు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Update: 2023-02-02 09:22 GMT

దిశ, ఆర్మూర్ : రాష్ట్ర ప్రభుత్వం అడ్వాన్స్ కంజక్షన్ డిపాజిట్ (ఎసీడీ) పేరుతో విద్యుత్ వినియోగ దారులపై అదనపు చార్జీలను వసూలు చేయడాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి దాసు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆర్మూర్ పట్టణంలోని డివిజనల్ ఇంజనీరింగ్ ఆపరేషన్ ఆర్మూర్ కార్యాలయం వద్ద గురువారం నిరసన ప్రదర్శన నిర్వహించి, అనంతరం డీఈకి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా దాసు మాట్లాడుతూ తెలంగాణ ధనిక రాష్ట్రం అంటూ దేశానికి స్ఫూర్తి అంటూ మాటలు వల్లిస్తూ మరో దిక్కు ప్రజలపై భారం వేయడం భావ్యం కాదని ఆయన అన్నారు. ‌ వ్యవసాయ రంగానికి 24 గంటలు ఉచిత కరెంటు ఇస్తున్నామని ప్రచారం చేస్తున్న కేసీఆర్ ప్రభుత్వం కోతలతో ఏడు గంటలు కరెంటు ఇస్తూ, రైతుల్ని ఇబ్బందుల గురి చేయడం వాస్తవం కాదా? అని ఆయన ప్రశ్నించారు.

రైతులకు ఉచిత విద్యుత్తు అందిస్తున్నామని ప్రకటిస్తూ ప్రభుత్వం నేటికీ విద్యుత్ సంస్థలకు బకాయలు చెల్లించకపోగా ఏసీడి పేరుతో వసూలు చేయడం దుర్మార్గమని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమ సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా తప్పించుకోవడం సరికాదని ఆయన అన్నారు. ఏసీడీ చార్జీలు ఉపసంహరించకపోతే ప్రజల కోపాగ్నికి బలికాక తప్పదని రాష్ట్ర ప్రభుత్వాన్ని దాసు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ సబ్ డివిజన్ కార్యదర్శి బి. సూర్య శివాజీ, డివిజన్ నాయకులు వి బాలయ్య, ఐఎఫ్టీయూ నాయకులు ఎం పోశెట్టి, చిట్టిబాబు, ఎస్ శ్రీనివాస్, శివకుమార్ పాషా బాయ్ పీవైఎల్ ఆర్మూర్ మండల కమిటీ అధ్యక్షులు యస్ .వెంకటేష్, పీడీఎస్యు జిల్లా ఉపాధ్యక్షులు ప్రిన్స్ నాయకులు నదీమ్, శ్రీశాంత్ తదితరులు పాల్గొన్నారు.

Similar News