'రాజగోపాల్ రెడ్డికి ఆ స్థాయి లేదు.. ప్రజలు అప్పుడే బుద్ది చెప్పారు..'

దిశ, మునుగోడు: సీఎం కేసీఆర్‌కు అత్యంత సన్నిహితంగా ఉంటూ మునుగోడు నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు పాటుపడుతున్న విద్యుత్ శాఖ..

Update: 2022-08-16 13:57 GMT

దిశ, మునుగోడు: సీఎం కేసీఆర్‌కు అత్యంత సన్నిహితంగా ఉంటూ మునుగోడు నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు పాటుపడుతున్న విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డిని విమర్శించే స్థాయి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి లేదని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. మునుగోడు మండలంలోని జమస్థాన్ పల్లి ఎక్స్ రోడ్డులోని ఆర్కే ఫంక్షన్ హాల్లో నిర్వహించిన మండల టీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమావేశానికి రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా లింగయ్య యాదవ్ మాట్లాడుతూ.. నమ్మి గెలిపించిన ఈ ప్రాంత ప్రజలను మోసం చేసి రూ. 21 వేల కోట్ల కాంట్రాక్టుల కోసం గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు పెంచి సామాన్యులపై భారం మోపుతున్న బీజేపీ పార్టీలో చేరడం రాజగోపాల్ రెడ్డికి సరికాదన్నారు.

సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ కృష్ణా జలాలు అందించి ఫ్లోరైడ్ రహిత మునుగోడు కోసం కృషి చేస్తున్నారన్నారు. గత పాలకులు మునుగోడు ప్రజలను అనేక సమస్యలు వెంటాడుతున్న పట్టించుకోలేదన్నారు. కుటుంబ పాలన కోసం కోమటిరెడ్డి బ్రదర్స్ ఆరాటపడ్డారని అందుకు రాజగోపాల్ రెడ్డి భార్యని ఎమ్మెల్సీగా నిలబెట్టినప్పుడే ప్రజలు బుద్ధి చెప్పారన్నారు. తెలంగాణలోని పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు బీజేపీ ప్రభుత్వం కృషి చేయాలన్నారు. పైసలతో మునుగోడు ప్రజలను కొనాలని రాజగోపాల్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడని ఈ ప్రయత్నాన్ని ప్రజలు తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు.

 

ఈ సందర్భంగా నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి మాట్లాడుతూ.. మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ జెండా ఎగరేయడమే లక్ష్యంగా పని చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రతి కార్యకర్త కష్టపడి ఇష్టంగా పని చేయాలని కోరారు. కోమటిరెడ్డి బ్రదర్స్ మాయమాటలు నమ్మి మరోసారి మోసపోవద్దని కోరారు. బడుగు,బలహీన వర్గాల నాయకులను అణిచివేయడమే కోమటిరెడ్డి లక్ష్యమని ఈ సందర్భంగా కార్యకర్తలకు వివరించారు. కోమటిరెడ్డి కపట నాటకాలకు ప్రజలు మోసపోవద్దని, తెలంగాణ సంక్షేమమే అజెండాగా పనిచేస్తున్న కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచాలంటే మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిని అధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు.

నల్లగొండను దత్తత తీసుకొని రూ. 1000 కోట్లతో సీఎం కేసీఆర్ అభివృద్ధి చేస్తున్నారని, ఈ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తే అదే స్థాయిలో అభివృద్ధి మునుగోడులో జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నారాయణ నారబోయిన రవి ముదిరాజ్, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు బండా పురుషోత్తం రెడ్డి, నాయకులు జాజుల అంజయ్య గౌడ్, అనంత స్వామి గౌడ్, దాడి శ్రీనివాస్ రెడ్డి, భవనం శ్రీనివాస్ రెడ్డి, ఎండి రఫీక్, గుర్రం సత్యం, వేమిరెడ్డి జితేందర్ రెడ్డి, బొడ్డు నాగరాజు గౌడ్, బొడ్డు నరసింహ బొల్గురి నరసింహ, చలమల్ల వెంకట్ రెడ్డి, జిడి బిక్షం, వై .వెంకటేష్, అబ్బనబోయిన రమేష్ , కరీం పాషా, సంపత్ రెడ్డి, బొల్గురి లింగయ్య, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Similar News