ఫణిగిరిలో గుప్త నిధుల కోసం తవ్వకాల యత్నం

వివిధ రకాల ఆనవాళ్లతో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం నాగారం మండలం ఫణిగిరి గ్రామంలో గుప్తనిధుల తవ్వకాల సంఘటన కలకలం రేపింది.

Update: 2024-04-29 15:42 GMT

దిశ,తుంగతుర్తి: వివిధ రకాల ఆనవాళ్లతో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం నాగారం మండలం ఫణిగిరి గ్రామంలో గుప్తనిధుల తవ్వకాల సంఘటన కలకలం రేపింది. పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.  రాష్ట్ర స్థాయిలోనే ప్రసిద్ధిగాంచిన శ్రీ సీతారామ చంద్ర స్వామీ దేవస్థానం ఆవరణలో గుప్త నిధుల తవ్వకాల నిమిత్తం మహబూబాబాద్ జిల్లా పరిసర ప్రాంతాలకు చెందిన కొంతమంది ఉదయం 11 గంటలకు రహస్యంగా చేరుకున్నారు.

తవ్వకాల కార్యక్రమం అమలుకు ప్రయత్నాలు మొదలు పెట్టే సమయంలో కొంతమంది గమనించారు. నాగారం పోలీసులకు సమాచారం అందించడంతో ఈ మేరకు పోలీసులు రంగప్రవేశం చేశారు. వచ్చిన వారిలో 8 మందిని ఆలయ పూజారి కూరేశం, సంతోష్ కుమార్ ఆచార్యులు,దేవాలయం చైర్మన్ గట్టు లక్ష్మీనరసింహా రావుతో పాటు మాజీ చైర్మన్ సుభాష్ రెడ్డి సహకారంతో గ్రామస్తులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. దేవాలయ చైర్మన్ గట్టు లక్ష్మీనరసింహా రావు ఫిర్యాదు మేరకు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకట్ రెడ్డి తెలిపారు.

Similar News