ప్రజల అవసరాలకనుగుణంగా తాగునీటి సరఫరా

నారాయణపేట జిల్లాలో తాగునీటి సమస్య లేదని ప్రజల అవసరాలకు అనుగుణంగా తాగునీటి సరఫరా చేయడం జరుగుతుందని కలెక్టర్ శ్రీ హర్ష అన్నారు.

Update: 2024-03-27 14:39 GMT

దిశ, నారాయణపేట ప్రతినిధి: నారాయణపేట జిల్లాలో తాగునీటి సమస్య లేదని ప్రజల అవసరాలకు అనుగుణంగా తాగునీటి సరఫరా చేయడం జరుగుతుందని కలెక్టర్ శ్రీ హర్ష అన్నారు. మిషన్ భగీరథ ద్వారా జిల్లాలోని 172 గ్రామాలకు కోయిల్ సాగర్ ప్రాజెక్టు (రిజర్వాయర్) నుంచి చందాపూర్, కుసుమ పల్లి నీటి శుద్ధి కేంద్రం ద్వారా తాగునీటి సరఫరా జరుగుతోందని, కోయిల్ సాగర్ నుంచి సరఫరా అయ్యే తాగునీటికి ఎలాంటి కొరత ఉండదని కలెక్టర్ తెలిపారు. ఈ వేసవికి జూరాలలో నీళ్ళు తగ్గినా...సంగం బండ రిజర్వాయర్‌లో అందుబాటులో ఉన్న 0.7 టీఎంసీల నీళ్ల ల్లో 0.5 టీఎంసీలు తాగునీటికి వినియోగించుకునే అవకాశం ఉంటుందని, ఆయా పథకాల నుంచి కూడా తాగునీటి సరఫరాకు ఎలాంటి ఆటంకం ఉండదని పేర్కొన్నారు.

శ్రీశైలం రిజర్వాయర్ నుంచి మన్యం కొండ నీటి శుద్ధి కేంద్రం ద్వారా 180 గ్రామాలకు తాగునీటి సరఫరా నిత్యం జరుగుతోందని చెప్పారు. జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో పట్టణ వాసులకు ఈ వేసవిలో తాగునీటి ఇబ్బందులు ఉండవని తెలిపారు. నారాయణపేట జిల్లా కేంద్ర మున్సిపాలిటీ పరిధిలోని 24 వార్డుల జనాభా అవసరాలకు ప్రతినిత్యం 7.30 ఎం.ఎల్. డీ ల తాగునీరు అవసరం ఉండగా మిషన్ భగీరథ ద్వారా మన్యం కొండ నీటి శుద్ధి కేంద్రం నుంచి రోజు 7.30 తాగునీటి సరఫరా జరుగుతుందని చెప్పారు. ఒకవేళ భగీరథ తాగునీటి సరఫరాలో ఏదైనా ఆటంకం కలిగితే పట్టణంలోని 104 పవర్ బోర్‌ల ద్వారా ప్రత్యామ్నాయంగా అన్ని వార్డులకు తాగునీటి సరఫరా చేస్తారని తెలిపారు. అలాగే మొత్తం కోస్గిలో తాగునీటి ఇబ్బందులు రానివ్వకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలిపారు.

Similar News