ఒకే జిల్లా.. గంట తేడాలో పీఎం-సీఎం సభలు

ఎన్నికల ప్రచారాలలో చిత్ర.. విచిత్రాలు చోటు చేసుకోవడం సర్వసాధారణం.

Update: 2024-05-09 08:36 GMT

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో: ఎన్నికల ప్రచారాలలో చిత్ర.. విచిత్రాలు చోటు చేసుకోవడం సర్వసాధారణం.. ప్రముఖ నేతల సభలు జరిగిన ఉదయము ఒక పార్టీ.. సాయంత్రం మరో పార్టీ సభలు జరగడం సహజమే.. కానీ ఈనెల 10న ఒక్క గంట తేడాతో .. భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీల ఎన్నికల ప్రచార సభలు భారీ సభలను నిర్వహించేందుకు ఆయా పార్టీల నాయకులు సన్నద్ధం అవుతున్నారు. నారాయణపేట జిల్లా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ బహిరంగ సభను నిర్వహించేందుకు షెడ్యూలు ఖరారు అయ్యింది. ఈ సభకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరు కానుండడంతో సభను భారీ ఎత్తున నిర్వహించేందుకు పార్టీ అభ్యర్థి, బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ సారథ్యంలో ఆ పార్టీ నాయకులు సన్నద్ధం అయ్యారు.

ఇందుకోసం గత రెండు మూడు రోజుల నుండి ఏర్పాట్లలో నిమగ్నం అయ్యారు. ఇది ఇలా ఉంటే నారాయణపేట జిల్లాలోని మక్తల్ నియోజకవర్గ కేంద్రంలో కాంగ్రెస్ అభ్యర్థి వంశీ చందు రెడ్డికి మద్దతుగా బహిరంగ సభను నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారు అయ్యింది. ప్రధానమంత్రి సభ ఆరంభమైన గంట తర్వాత మధ్యాహ్న 3 గంటల నుండి కాంగ్రెస్ సభ జరగనుంది. ఈ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. ఒకేరోజు నారాయణపేట జిల్లాలో జరిగే రెండు బహిరంగ సభలకు ఇటు ప్రధాని, అటు ముఖ్యమంత్రి హాజరవుతుండడం తో శాంతిభద్రతలను కాపాడవలసిన పోలీసులు, జన సమీకరణ చేయవలసిన నాయకులు ఇబ్బంది కదా పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుందని పలువురు అంటున్నారు. మొత్తం పై పాలమూరు పార్లమెంటు ఎన్నికను రెండు జాతీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి అనడానికి ఈ కార్యక్రమాలు ఒక ఉదాహరణ అని రాజకీయ నాయకులలో అంటున్నారు.

Similar News