జాతీయ పార్టీ కోసం కేసీఆర్ మరో డెసిషన్..? కొత్తగా రెండు జాతీయ మీడియా ఛానెళ్లు?

టీఆర్ఎస్ ను జాతీయ పార్టీగా మార్చాలనే ప్రణాళికతో ఉన్న సీఎం కేసీఆర్ తాను పెట్టబోయే కొత్త పార్టీకి

Update: 2022-10-03 11:36 GMT

దిశ, డైనమిక్ బ్యూరో:  టీఆర్ఎస్ ను జాతీయ పార్టీగా మార్చాలనే ప్రణాళికతో ఉన్న సీఎం కేసీఆర్ తాను పెట్టబోయే కొత్త పార్టీకి విస్తృతంగా ప్రచారం కలిగేలా పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తుంది. జాతీయ పార్టీకి దేశవ్యాప్తంగా ప్రచారం లభించేలా సీఎం కేసీఆర్ త్వరలో మరో రెండు న్యూస్ చానెళ్లు ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ చానెళ్ల ఏర్పాటు కోసం టీఆర్ఎస్ పెద్దలు, ఢిల్లీలోని పలువురు సీనియర్ జర్నలిస్టులతో కేసీఆర్ చర్చలు జరిపినట్లు సమాచారం. కొత్త చానెళ్ల కోసం అనుమతులు తీసుకోవాలా లేక ఇప్పటికే అనుమతులు ఉన్న చానెళ్లతో ఒప్పందం చేసుకోవాలా అనే విషయంలో కేసీఆర్ త్వరలో ఓ కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా ప్రచారం జరుగుతుంది. తెలంగాణ ఉద్యమం సమయంలో సొంత చానెల్ వ్యూహంతో తమ ఆలోచనను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో సక్సెస్ అయిన నేపథ్యంలో జాతీయ పార్టీ విషయంలోనూ మీడియా కవరేజ్ కోసం అదే తరహా వ్యూహంతో ముందుకు సాగాలని నిర్ణయంతో ఉన్నారని, ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణం పూర్తయిన తర్వాత అదే బిల్డింగ్ లో చానల్స్ ఏర్పాటు చేయడంపై కేసీఆర్ దృష్టి సారించినట్లు ప్రచారం వినిపిస్తుంది.

అదానీ ఎంట్రీతో వ్యూహం మారిందా?

బీజేపీపై టార్గెట్ గా కేసీఆర్ జాతీయ రాజకీయాలు ప్రారంభించారు. నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై ఆయన నిప్పులు చిమ్ముతున్నారు. అయితే తాను స్థాపించబోయే జాతీయ పార్టీకి ప్రచారం నిమిత్తం కొన్ని జాతీయ సంస్థలకు పెద్ద ఎత్తున ప్రకటనలు గుప్పిస్తోంది టీఆర్ఎస్. కేసీఆర్ పాలనలో చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుపై స్పెషల్ డాక్యుమెంటరీలు సైతం ఓ ప్రముఖ ఇంగ్లీష్ మీడియాలో ప్రసారం కావడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. అయితే సదరు చానెల్ ను ప్రముఖ వ్యాపార వేత్త ఆదానీ తన గుప్పిట్లోకి తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం జరగడంతో కేసీఆర్ వ్యూహం మారినట్లు టాక్ వినిపిస్తుంది. జాతీయ స్థాయిలో ప్రచారం కోసం ఇతర మీడియా సంస్థల వైపు ఎదురు చూసే కంటే తానే సొంతంగా మీడియా సంస్థను నెలకొల్పాలనే నిర్ణయానికి వచ్చారని తెలుస్తుంది. ఇలా చేయడం వల్ల భారీగా ప్రచార ఖర్చులు కూడా కలిసి వస్తాయనే అభిప్రాయంతో ఉన్నారనే వాదన వినిపిస్తుంది.

కేసీఆర్ తో మీడియా సంస్థల చైర్మన్ సమావేశం

కేసీఆర్ సొంత చానెళ్ల విషయం ప్రచారం వెనుక మరో బలమైన కారణాన్ని చూపుతున్నారు. మహారాష్ట్రకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, రాజ్యసభ మాజీ సీనియర్ నేత విజయ్ దర్డా గత గురువారం కేసీఆర్ తో ప్రగతి భవన్ లో భేటీ అయ్యారు. ఈయన లోక్ మత్ మీడియా సంస్థల ఛైర్మన్ గా కూడా కొనసాగుతున్నారు. ఈ సమావేశంలో బీజేపీ పాలనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ దేశ ప్రతిష్టను దిగజార్చే ఇటువంటి పరిస్థితులను చక్కదిద్దే ప్రత్యామ్నాయ రాజకీయ నాయకత్వం దేశానికి అవసరం అన్నారు. కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావాలని ఆకాంక్షించినట్లు తెలిసింది. అయితే ఈ ఇద్దరి భేటీలో తాను పెట్టబోయే కొత్త పార్టీకి మీడియా సంస్థలకు సంబంధించిన విషయాలు చర్చించి ఉండవచ్చనే ఊహాగానాలు గుప్పుమన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి కేసీఆర్ జాతీయ పార్టీ కోసం మరో రెండు చానళ్లుఏ ర్పాటు చేయబోతున్నారనే ప్రచారం జోరందుకుంది. .

ఇవి కూడా చ‌ద‌వండి : 

కేఏ పాల్ సంచలన నిర్ణయం.. కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఆమరణ నిరహార దీక్ష

దసరా రోజున సమావేశం జరిగి తీరుతుంది: కేసీఆర్ 

Tags:    

Similar News