ప్రభుత్వ రంగ సంస్థల విభజన ఇంకెప్పుడు?

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఎనిమిదేండ్లయినా 9, 10 షెడ్యూళ్లల్లో పేర్కొన్న ప్రభుత్వ రంగ సంస్థల విభజన పూర్తి కాకపోవడం బాధాకరమని

Update: 2022-09-28 15:01 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఎనిమిదేండ్లయినా 9, 10 షెడ్యూళ్లల్లో పేర్కొన్న ప్రభుత్వ రంగ సంస్థల విభజన పూర్తి కాకపోవడం బాధాకరమని తెలంగాణ ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగుల సమాఖ్య చైర్మన్ బాసబత్తిని రాజేశం, సెక్రటరీ జనరల్ జీటీ జీవన్ ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. కేంద్ర హోం శాఖ అధికారులతో జరిగిన చర్చలు కూడా అసంపూర్తిగానే ముగిశాయన్నారు. ఈ అంశంలో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ బలమైన వాదనలు చేశారని కొనియాడారు. తెలంగాణకు అన్యాయం జరుగకుండా చూసినందుకు తెలంగాణ ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగుల సమాఖ్య తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఎక్కడి ఆస్తులు అక్కడివే అని విభజన చట్టంలో ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చట్టాన్ని కాదని రాష్ట్ర ఆర్ధిక సంస్థకు రంగారెడ్డి జిల్లాలో ఉన్న 238 ఎకరాల స్థలంలో వాటా కోసం డిమాండ్ చేయడం అన్యాయమన్నారు. ఉద్యోగుల విభజనలో కూడా మొండిగా వ్యవహరిస్తూ ఆంధ్ర స్థానికత గల ఉద్యోగులను తెలంగాణకు పంపే ప్రయత్నం చేస్తున్నదన్నారు. తాము దానికి అంగీకరించమన్నారు. ఇప్పటికైనా రెండు రాష్ట్రాల అధికారులు సమన్వయంతో వ్యవహరించి విభజన సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు.

Similar News