అడెల్లి ఆలయ పునర్నిర్మాణానికి నిధులు మంజూరు

నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని ప్రసిద్ధి పుణ్యక్షేత్రం అడెల్లిపోచమ్మ అమ్మవారి దేవాలయ పునర్నిర్మాణ పనులకు సోమవారం న్యాయ, దేవదాయ, పర్యావరణ అటవీ దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు.

Update: 2022-10-03 10:32 GMT

దిశ, సారంగాపూర్ : నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని ప్రసిద్ధి పుణ్యక్షేత్రం అడెల్లిపోచమ్మ అమ్మవారి దేవాలయ పునర్నిర్మాణ పనులకు సోమవారం న్యాయ, దేవదాయ, పర్యావరణ అటవీ దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అడెల్లి పోచమ్మ దేవాలయానికి మొక్కులు తీర్చుకోవడానికి తెలంగాణ, మహరాష్ట్ర, ఛత్తీస్ ఘడ్, ఒరిస్సా రాష్ట్రాల నుండి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి దర్శించుకుంటారని తెలిపారు.

ఆలయ కీర్తి ప్రతిష్టలు పెంచాలన్న ఉద్దేశ్యంతో చాలా పవిత్రమైన దసరా నవరాత్రులలో దుర్గాష్టమి రోజున అమ్మవారి ఆలయ పున:నిర్మాణ పనులను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. రూ 10 కోట్లతో ఆలయాన్ని పూర్తిగా కృష్ణ శిలలతో నిర్మిస్తున్నట్లు తెలిపారు. యాదాద్రి క్షేత్రంలాగే శతాబ్దాల పాటు మన్నిక ఉండేలా తరతరాలుగా నిలిచిపోయేలా పోచమ్మ ఆలయం నిర్మాణం చేపడుతున్నట్లు పేర్కొన్నారు.

తమిళనాడు, తిరుపతి ప్రాంతాలలో ఈ కృష్ణ శీలలను తయారు చేయిస్తున్నట్లు తెలిపారు. గర్భాలయంలోని ఉన్నట్టు వంటి అమ్మవారి విగ్రహాన్ని తొలగించకుండా నూతనంగా ఆలయాన్ని నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. రూ. 6 కోట్ల 60 లక్షలతో దేవాలయం, 40 లక్షలతో వసతి గృహాలు, 40 లక్షలతో కోనేరు ఆధునీకరణ పనులు, రూ 1కోటి తో 100 దుకాణాల సముదాయాల గదులు, రూ 1 కోటితో రాజగోపురాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు.

ఆలయానికి 24 గంటల విద్యుత్ సరఫరాతో పాటు మిషన్ భగీరథ ద్వారా తాగు నీటిని అందిస్తామని తెలిపారు. తొమ్మిది నెలలలోనే ఆలయ నిర్మాణ పనులు పూర్తి చేయిస్తామన్నారు. అలాగే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక నిర్మల్ నియోజకవర్గంలో 600 దేవాలయాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. బోథ్ నుండి అడెల్లి వరకు రూ 10 కోట్లతో రహదారి నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు.

అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. అలాగే సారంగాపూర్ లో సహకార సంఘ నూతన భవన నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. జామ్ గ్రామంలో గల రామాలయ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త అల్లోల మురళీధర్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ అడ్డి బోజ రెడ్డి, జిల్లా రైతు బంధు కోఆర్డినేటర్ వెంకటరామిరెడ్డి, ఎంపీపీ అట్ల మైపాల్ రెడ్డి, జెడ్పీటీసీ పత్తిరెడ్డి రజేశ్వేర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ చించోలి ఆశ్రిత రెడ్డి, సొసైటీ చైర్మన్లు నారాయణరెడ్డి, మాణిక్ రెడ్డి, మండల సర్పంచుల అధ్యక్షులు రవీందర్ రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు మాధవరావు, నాయకులు రాజ మహమ్మద్, శ్రీనివాస్ రెడ్డి, మల్లేష్, శంకర్, కండెల భోజన్న, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

Tags:    

Similar News