టీఆర్ఎస్ ఎంపీలకు స్పీకర్ వార్నింగ్

దిశ, తెలంగాణ బ్యూరో : ధాన్యం కొనుగోళ్ల అంశంపై పార్లమెంటు లోపలా, వెలుపలా టీఆర్ఎస్ ఎంపీల నిరసనలు కొనసాగిస్తోన్నారు. శీతాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచీ మూడు రోజులుగా ఉభయ సభల్లో ప్లకార్డులతో ఆ పార్టీ ఎంపీలు నిరసన వ్యక్తం చేస్తోన్నారు. లోక్‌సభలో బుధవారం ఉదయం ప్రశ్నోత్తరాల సమయంలో టీఆర్ఎస్ ఎంపీలు స్పీకర్ వెల్‌లోకి వెళ్లి ప్లకార్డులతో నిరసన ప్రదర్శన చేశారు. దీంతో స్పీకర్ ఓం బిర్లా టీఆర్ఎస్ ఎంపీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సభా సమయాన్ని వృథా […]

Update: 2021-12-01 05:48 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : ధాన్యం కొనుగోళ్ల అంశంపై పార్లమెంటు లోపలా, వెలుపలా టీఆర్ఎస్ ఎంపీల నిరసనలు కొనసాగిస్తోన్నారు. శీతాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచీ మూడు రోజులుగా ఉభయ సభల్లో ప్లకార్డులతో ఆ పార్టీ ఎంపీలు నిరసన వ్యక్తం చేస్తోన్నారు. లోక్‌సభలో బుధవారం ఉదయం ప్రశ్నోత్తరాల సమయంలో టీఆర్ఎస్ ఎంపీలు స్పీకర్ వెల్‌లోకి వెళ్లి ప్లకార్డులతో నిరసన ప్రదర్శన చేశారు.

దీంతో స్పీకర్ ఓం బిర్లా టీఆర్ఎస్ ఎంపీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సభా సమయాన్ని వృథా చేస్తున్నారని, ప్రశ్నోత్తరాల కార్యక్రమానికి విఘాతం కలిగిస్తున్నారని అసహానం వ్యక్తం చేశారు. సీట్లలోకి వెళ్లి కూర్చోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. అయినా ఎంపీలు శాంతించలేదు. నిరసనల పర్వం కొనసాగుతుండడంతో మరో ప్రత్యామ్నాయం లేక ప్రశ్నోత్తరాల సమయాన్ని వాయిదా వేశారు. ఆ తర్వాత కూడా టీఆర్ఎస్ ఎంపీలు పోడియం దగ్గర నేల మీద కూర్చుని ప్లకార్డులతో నిరసన తెలిపారు.

మరోవైపు రాజ్యసభలో సైతం టీఆర్ఎస్ ఎంపీల నిరసనల పర్వం కొనసాగుతున్నది. ఒకవైపు చర్చల్లో పాల్గొంటూనే తెలంగాణలో రైతుల దయనీయ స్థితిని, ధాన్యం సేకరణ అంశాన్ని ప్రస్తావిస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. సభ్యుడు మాట్లాడేటప్పుడు మిగిలిన ఎంపీలు సైతం ప్లకార్డులతో నిల్చోనే మౌనంగానే నిరసన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లపై స్పష్టత ఇవ్వాలని, రైతులను అకారణంగా శిక్షించే విధానాలను విరమించుకోవాలని ప్లకార్డుల ద్వారా ప్రభుత్వానికి నిరసనలను తెలియజేస్తున్నారు.

Tags:    

Similar News