ఏపీ, తెలంగాణ సీఎస్‌లతో కేంద్రం సమావేశం.. విభజన సమస్యలు పరిష్కారమయ్యేనా?

రాష్ట్రం విడిపోయి 8 ఏళ్లు గడుస్తున్న ఇప్పటికీ పరిష్కారానికి నోచుకోని విభజన సమస్యలు చాలా ఉన్నాయని వీటిని త్వరగా పరిష్కరించాలనే డిమాండ్లు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Update: 2022-09-22 13:06 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రం విడిపోయి 8 ఏళ్లు గడుస్తున్న ఇప్పటికీ పరిష్కారానికి నోచుకోని విభజన సమస్యలు చాలా ఉన్నాయని వీటిని త్వరగా పరిష్కరించాలనే డిమాండ్లు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలపై చర్చించేందుకు కేంద్రం ఈ నెల 27న సమావేశం నిర్వహించబోతోంది. ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులతో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సమావేశమై విభజన సమస్యల పరిష్కారం కోసం చర్చలు జరపనున్నారు. ఈ మీటింగ్ కు సంబంధించి ఇప్పటికే కేంద్రం తెలంగాణ, ఏపీలకు సమాచారం అందజేసింది. 27న ఢిల్లీలోని పార్లమెంట్ నార్త్ బ్లాక్‌లోని హోంశాఖ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ఈ సమావేశం జరగనుంది.

చర్చల సౌలభ్యం కోసం ఈ సమావేశం ఎజెండాను ద్వైపాక్షిక అంశాలు, ఇతర అంశాలుగా విభజించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను ద్వైపాక్షిక అంశాల్లో చేర్చగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్న సమస్యలను ఇతర అంశాల విభాగంలో చేర్చారు. గతేడాది కూడా కరోనా సమయంలో విభజన సమస్యల అంశంపై కేంద్ర హోం శాఖ వర్చువల్ విధానంలో రెండు రాష్ట్రాల అధికారులతో సమావేశమైన పరిష్కార మార్గాల దిశగా చర్చలు జరిపినా పలు అంశాల్లో ఇంకా ప్రతిష్టంభన నెలకునే ఉంది. ముఖ్యంగా తొమ్మిది, పదో షెడ్యూల్ లోని సంస్థల విభజన, విద్యుత్ బకాయిలపై రెండు రాష్ట్రాల నడుమ ఏకాభిప్రాయం రావడం లేదు. దీంతో అపరిష్కృతంగా ఉండిపోయిన సమస్యలకు పరిష్కారం కనుకునే దిశగా ఈ నెల 27న జరగబోయే ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. ఇక ఈ భేటీలో తమ వాదనలు వినిపించేలా తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు పలు నివేదికలు సిద్ధం చేసుకుంటున్నాయి. సమావేశంలో లేవనెత్తాల్సిన అంశాలపై సీఎస్ నేతృత్వంలో అధికారులు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు.

ఇవి కూడా చ‌ద‌వండి:

ప్రధానమంత్రి అభ్యర్థిగా సీఎం కేసీఆర్ ఏకగ్రీవం

Tags:    

Similar News