కాంగ్రెస్ మాయలో పడకండి.. అధికారం మనదే: కేంద్రమంత్రి మురుగన్

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారని కేంద్రమంత్రి మురుగన్ విమర్శించారు.

Update: 2024-05-04 17:05 GMT

దిశ, గద్వాల: ‘ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు వాళ్ళ మాటలు నమ్మితే మరింత మోసపోవాల్సిన పరిస్థితులు నెలకొంటాయి.’ అని కేంద్ర ప్రసార, సమాచార శాఖ సహాయ మంత్రి మురుగన్ అన్నారు. శనివారం జోగులాంబ గద్వాల జిల్లా తేరు మైదానంలో నాగర్ కర్నూల్ బిజెపి ఎంపీ అభ్యర్థి భరత్ ప్రసాద్‌కు మద్దతుగా నిర్వహించిన విజయ్ సంకల్పు సభకు మురుగన్, బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మురుగని మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ వాళ్లు శక్తికి మించిన హామీలు, అమలుకు సాధ్యం కానీ పథకాలను ప్రకటించి అధికారంలోకి వచ్చి మోసం చేశారన్న విషయం అందరికీ తెలిసిందేనని ఎద్దేవా చేశారు. ఇప్పుడు పార్లమెంటు ఎన్నికల సందర్భంగా మోసం చేయడానికి మళ్లీ వస్తున్నారని, వాళ్లతో పాటు బీఆర్ఎస్ వాళ్లు కూడా మరోసారి మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపారు. వాళ్ళను నమ్ముకుంటే చాలా నష్టపోతామని, ప్రపంచం గర్వపడేలా నరేంద్ర మోడీ ఈ దేశాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తున్నాడని పేర్కొన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో దేశవ్యాప్తంగా బిజెపి 400కు పైగా సీట్లను సాధించి అధికారంలోకి రావడం ఖాయం అన్నారు. నాగర్ కర్నూల్ నుండి బిజెపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న భరత్ ప్రసాదును భారీ మెజారిటీతో గెలిపించి మోడీకి కానుకగా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.


బీజేపీ వల్లే రామరాజ్యం: డీకే అరుణ

భారతీయ జనతా పార్టీ వల్లే రామరాజు స్థాపన సాధ్యమవుతుందని బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు సర్పంచ్, ఎంపీటీసీ, జిల్లా పరిషత్, ఎమ్మెల్యే ఎన్నికలు కామని, ఇవి పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించినవన్నారు. మోడీ సారధ్యంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలి అంటే అందరూ బిజెపికి అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్, బీ‌ఆర్ఎస్ చెప్పిన మాయ మాటలు విని మోసపోయామని ఎద్దేవా చేశారు. ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి ఇప్పటికే అతీగతి లేదని ఆమె విమర్శించారు. ఎట్టి పరిస్థితిలోనూ వాళ్ల మాటలను లెక్కచేయొద్దని ప్రజలను డీకే అరుణ కోరారు. నాగర్ కర్నూల్ నుంచి పోటీ చేస్తున్న బిజెపి అభ్యర్థి భరత్ ప్రసాదును , మహబూబ్ నగర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.


అవకాశం ఇవ్వండి, అంకితభావంతో పని చేస్తా: భరత్ ప్రసాద్

‘పల్లె.. పట్టణం అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరూ మోడీ మరోసారి ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నారు. బిజెపి అభ్యర్థిగా నేను పోటీలో ఉన్నాను. అరుణమ్మ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ సభకు భారీ ఎత్తున హాజరైన మీరు ఆశీర్వదించి గెలిపించండి. మీరు అందరూ మెచ్చేలా పనిచేస్తా.’ అని భరత్ ప్రసాద్ చెప్పారు. ఈ సందర్భంగా మీకే అరుణకు కార్యక్రమానికి హాజరైన ప్రముఖులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపియ్యాలి. కార్యక్రమంలో ఎంపీ రాములు, పార్టీ రాష్ట్ర, జిల్లా నేతలు పాల్గొన్నారు.

Similar News