దక్షిణాదిలో నీటి సంక్షోభం..పదేళ్ల కనిస్టానికి పడిపోయిన నిల్వలు!

దక్షిణ భారతదేశం తీవ్ర నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. నీటి నిల్వలు పదేళ్ల కనిష్టానికి పడిపోయాయి. ఆంద్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని రిజర్వాయర్లలో 17శాతం మేర మాత్రమే నీరు నిల్వ ఉంది.

Update: 2024-04-27 09:17 GMT

దిశ, నేషనల్ బ్యూరో: దక్షిణ భారతదేశం తీవ్ర నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. నీటి నిల్వలు పదేళ్ల కనిష్టానికి పడిపోయాయి. ఆంద్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని రిజర్వాయర్లలో 17శాతం మేర మాత్రమే నీరు నిల్వ ఉంది. ఇది చారిత్రక సగటు కంటే చాలా తక్కువ అని సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్లూసీ) తాజాగా వెల్లడించింది. దక్షిణ భారతదేశంలో మొత్తం 42రిజర్వాయర్లు ఉండగా..అవి 53.334 బిలియన్ క్యూబిక్ మీటర్ల (బీసీఎం) నీటి నిల్వ సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. కానీ ప్రస్తుతం ఈ రిజర్వాయర్లలో 8.865 బీసీఎం మాత్రమే నీటి నిల్వలు ఉన్నాయని పేర్కొంది. అంటే ఇది వాటి సామర్థ్యంలో కేవలం 17శాతం మాత్రమే. గతేడాది ఇదే సమయంలో 29శాతం నీటి నిల్వలున్నాయి. పదేళ్ల సగటు(23) శాతంతో పోలిస్తే ఇది తీవ్రమైన క్షీణతను సూచిస్తుంది. దీంతో దక్షిణాది రాష్ట్రాల్లో నీటి పారుదల, తాగు నీటి సరఫరా, విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి సవాళ్లు ఎదురుకానున్నట్టు తెలుస్తోంది.

అలాగే అసోం, ఒడిశా, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో నీటి నిల్వలు కాస్త మెరుగుపడ్డాయని సీడబ్లూసీ తెలిపింది. ఈ ప్రాంతంలో మొత్తం 23రిజర్వాయర్లుండగా 20,430 బీసీఎం నీటి నిల్వ సామర్థ్యం కలిగి ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఈ రిజర్వాయర్లలో 7,889 బీసీఎం నీటి నిల్వ ఉంది. అంటే ఇది దాని మొత్తం సామర్థ్యంలో 39శాతం. గత పదేళ్ల సగటుతో పోలిస్తే ఇది కాస్త మెరుగ్గానే ఉంది. ఇక, గుజరాత్, మహారాష్ట్రలతో కూడిన పశ్చిమ ప్రాంతంలో 49రిజర్వాయర్లుండగా.. వాటి నిల్వ సామర్థ్యం 11.771 బీసీఎంగా ఉంది. వీటిలో 31.7శాతం నీటి నిల్వలు ప్రస్తుతం ఉన్నాయి. ఇది పదేళ్ల సరాసరి(32.1)శాతంతో పోలిస్తే చాలా తక్కువ.

బ్రహ్మపుత్ర, నర్మద, తపి వంటి నదీ పరీవాహక ప్రాంతాలు సాధారణ నిల్వ స్థాయిల కంటే మెరుగైన స్థాయిల్లో ఉన్నాయని సీడబ్లూసీ పేర్కొంది. అయితే దక్షిణ భారత దేశంలో నీటి నిల్వలు వేగంగా తగ్గిపోవడానికి వాతావరణ మార్పులు, భూగర్భ జలాలను అధికంగా వెలికి తీయడం, కాలుష్యం, పట్టణీకరణ ప్రధాన కారణమని నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా వ్యవసాయ, పట్టణ అవసరాల కోసం విపరీతంగా బోర్లు వేయడం వల్ల వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని భావిస్తున్నారు. కాబట్టి రాబోయే ప్రమాదాన్ని గమనించి ముందస్తుగా చర్యలు తీసుకోవాలని చెబుతున్నారు.

Tags:    

Similar News