ఎన్నికల ముందు నా దేశం!?

Poem

Update: 2024-04-14 19:00 GMT

ఆకలిని అధిగమించామని

జబ్బచరుచుకుంటోంది నా దేశం.

ఉచిత బియ్యం కోసం క్యూలో

సొమ్మసిల్లి పోతోంది నా దేశం!

కోట్ల ఉద్యోగాలు కల్పించామంటోంది నా దేశం.

ఉపాధి కోసం ఊళ్ళు వదిలేసి పోయింది నా దేశం!

ఉద్యోగాల కోసం ఖండాలను, మహాసముద్రాలను

దాటేసి వలసపోతోంది నాదేశం!

జీవచ్ఛవాలకు

‘అక్కా, చెల్లీ, అమ్మా, తల్లీ’ పలకరింపులు.

ఎంత ఊరడింపులు !

కనిపిస్తే చేతులెత్తి దణ్ణాలు!

ప్రేమగానాలు, ప్రణయ రాగాలు!

గడ్డం పుచ్చుకునే వారు, చేతులు

పట్టుకునే వారు, భుజాన చేతులేసే వారు!

ఎన్నికల ముందు ఒక పెద్ద

జాతరలా ఉంది నా దేశం!

అయిదేళ్ళ జాతరలో, అయిదొందలకు, వెయ్యికి

తనను తాను అమ్ముకునేలా ఉంది నా దేశం!

రానున్న అయిదేళ్ళ కోసం

పగటి కలలు కంటోంది నా దేశం!

ఎండ మావులను చూసి

మురిసి పోతోంది నా దేశం!

బ్రోకర్లను నమ్మి, మోసపోతున్నానని తెలియక,

ముస్తాబైన అమాయకపు ఆడబిడ్డలా ఉంది నా దేశం.

(కే.ఎన్.వై. పతంజలి గారి స్ఫూర్తితో)


-రాఘవశర్మ

94932 26180

Tags:    

Similar News