అమృతకాలం కాదిది ఆపత్కాలం!

Amrutakalam Kadu Apatkalam book Review

Update: 2024-04-29 00:30 GMT

రాంపల్లి శశి కుమార్ 'అమృతకాలం కాదిది ఆపత్కాలం' అనే ఈ పుస్తకం ఎవరికోసం ఎందుకోసం రాశారో చెబుతూ, “ఈ పుస్తకం గడిచిన 10 సంవత్సరాల మోడీ పరిపాలనా కాలాన్ని విమర్శనాత్మకంగా పరిశీలిస్తున్న వారి కోసం కాదు. మీడియా ప్రచారపు హోరులో పడి వాస్తవాలు ఎరగకుండానే దేశం అమృతకాలంలో ప్రయాణం చేస్తున్నదని భ్రమ పడుతున్న వారి కోసం! కఠోర వాస్తవాన్ని విప్పి చెప్పటం ద్వారా కొందరికైనా కనువిప్పు కలిగించటానికి” అంటారు.

దీనికి ముందుమాట రాస్తూ దివి కుమార్ గారు ఇది కొందరికి “అమృత కాలమే” అంటారు! నిజమే కదా కోవిడ్‌‌లో బిలియనీర్‌లైన వారికీ, పబ్లిక్ రంగ సంస్థల్ని కొనేసుకున్న వారికీ, బ్యాంకులో అప్పులు ఎగ్గొట్టి విదేశాలు చెక్కేసిన వారికీ, కనీవినీ ఎరుగని రీతిలో ఒక దేశాధినేత ఎంచక్కా దేశ సంపదని కోరుకున్న వారికి కోరుకున్నంత పందారం చేస్తుంటే వారికి అమృతకాలమే కదా

జీడీపీ 410 లక్షల కోట్లకు ఎగబాకుతుందని గాలి మేడలు కట్టడమూ, నిజమే అని నమ్మించడమూ, విపరీతమైన ప్రచార ఆర్భాటాలతో సామాన్య జనాల కళ్లకు గంతలు కట్టడమూ ఎలా ఒక పద్ధతిగా సాగుతుందో ఈ పుస్తకం వివరించే ప్రయత్నం చేసింది. ఈ దేశపు 23% ఆదాయం కేవలం టాప్ 1 పర్సెంట్ వారికి మాత్రమే చేరుతుందన్న వాస్తవాన్ని గణాంకాలతో నిరూపిస్తుందీ పుస్తకం. ఇంచుమించు 15 లక్షల కోట్ల జీఎస్టీ పేరున లాగింది 50% నిరుపేద వర్గాల నుంచేననీ, 10% కుబేరులు ఈ దేశపు 77% సంపాదనని అనుభవిస్తున్నారనీ, అదే సమయంలో, ఆ వర్గం వాళ్లకే 7,40,968 కోట్ల రూపాయల రుణమాఫీ చేయడం లోని ఔచిత్యాన్ని ప్రశ్నిస్తుంది. ఇది మృత కాలమా అమృత కాలమా అచ్ఛే దినాలా చచ్చేదినాలా అని ధైర్యంగా ప్రశ్నిస్తుంది.

వాస్తవాన్ని గణాంకాలతో నిరూపించి..

2021 నాటికి స్విస్ బ్యాంకు లోని భారతీయ డిపాజిట్లు గత 14 ఏళ్లలో అత్యధిక స్థాయికి చేరుకున్నాయి! కానీ నల్లధనపు నీడతో యుద్ధాలు చేస్తూ పులుకడిగిన ముత్యంలా స్కాములు అవినీతి అంటని ప్రధానమంత్రిగా మహాపురుషుల కోవలోకి వెళ్ళిపోతారు మోడీజీ అంటారీ పుస్తకంలో. ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో చేతికి మకిలి అంటకుండా తీసుకున్నరు. 2004 కోట్ల రూపాయల విరాళాల కోసం రూ.3,84,825 కోట్ల విలువైన 179 కాంట్రాక్టులను కేవలం 38 కంపెనీలకు ధారాదత్తం చేసిన ఘోరాన్ని వెలికితీస్తూ ఈ 38 కంపెనీలకూ ఇది అమృత కాలమే కదా అని వాపోతుందీ పుస్తకం

ఎక్కడో 609 స్థానంలో ఉన్న మిత్రుడిని 4వ స్థానంలోకి ఎగబాకేలా చేసిన ఘనత మన ప్రధాన మంత్రి వారిదే! ఆరు ఎయిర్‌పోర్టులూ, 5,422 నిడివి గల తీర ప్రాంతంలో ప్రతి 500 కిలోమీటర్లకు ఒక ఆదానీ పోర్టు, ఇంకా బొగ్గు ఉత్పత్తుల కంపెనీలూ, షెల్ కంపెనీలూ, స్మార్ట్ మీటర్ల కంపెనీలూ…ఇంచుమించు దేశంలో ఏ పని జరగాలన్నా ఈ రెండు మూడు బ్రాండ్లతోనే జరుగుతూ పోవడం గమనార్హం! మదరాఫ్ డెమోక్రసీకి ఏమయిందిప్పుడు 2014లో 27వ స్థానంలో ఉన్న భారతదేశపు ప్రజాస్వామ్య ర్యాంక్ 2024 నాటికి 53కీ, ఎన్నికల ప్రజాస్వామ్యంలో 110 స్థానంలోకీ ఎందుకు దిగజారిందో ఈ పుస్తకం చాలా స్పష్టంగా వివరిస్తుంది.

ఆధారాలతో సహా..

మీడియా అమ్ముడు సరుకుగా మారడం ఎలా వీలు పడిందో, అమ్ముడు పోకపోతే ఎలా కొనుగోలు చేసుకోవచ్చో కూడా ఎన్డీటీవీ ఉదాహరణ ద్వారా వివరిస్తారీ పుస్తకంలో. 2023 మార్చి నెలలో ఎన్డీటీవీలో మెజారిటీ వాటా కొనేసి దాన్ని దారిలోకి తెచ్చుకుంది! జాతీయ మీడియా అంతా అంబానీ(70 కి పైగా) లేదా ఆదాని చేతుల్లోనే ఉన్నాయి. స్వీయ గొంతుక ఉన్న పుణ్య ప్రసూన్, బాజ్పాయ్, అభిసార్ శర్మ, అజిత్ అంజుమ్, బాబి గోష్, వినోద్ దువా, పవన్ జైస్వాల్, ప్రశాంత్ కనోజియా, సిద్ధికి కపన్, దిశా రవి, గ్రేటా థన్ బర్గ్, రిహాన్నా ఇంకా అనేకమంది గొంతుకలని వేధించి వెళ్ళగొట్టాక పత్రికా స్వేచ్ఛ పరంగా 180 దేశాల్లో 161 వ స్థానంలోకి పడిపోయిన వైనాన్ని ఆధారాలతో సహా ముందుకు తెస్తుందీ పుస్తకం.

2022 నాటికల్లా ఆరు కోట్ల ఇళ్ళూ, 24 గంటల విద్యుత్తూ, స్కిల్ ఇండియా, స్టార్టప్ ఇండియా, స్టాండ్ అప్ ఇండియా, డిజిటల్ ఇండియా, మేకిన్ ఇండియా, స్వచ్ఛభారత్, మౌలిక సదుపాయాల కల్పనకు లక్ష కోట్ల రూపాయల పెట్టుబడి సమకూర్చటం, 2022 కల్లా నవభారత నిర్మాణంతో పాటూ, ఉగ్రవాదం, మతోన్మాదం, కుల జాడ్యం, అవినీతి, నిరుద్యోగం వంటి రుగ్మతలను కూకటివేళ్లతో పెకిలించి వేయడం, ఐదు ట్రిలియన్ డాలర్ల జీడీపీకి చేరుస్తాం అంటూ ఊదరగొట్టిన డొల్ల మాటల గురించి ఈ పుస్తకం గణాంకాలతో సహా వివరిస్తుంది. రెండు కోట్ల ఉద్యోగాల కల్పన విషయం పక్కన పెడితే, ఒక్క తయారీ రంగంలోనే 5.1 కోట్ల ఉద్యోగాలను 2.73 కోట్లకు దిగజార్చడం ఎలా జరిగిందో తెలియపరుస్తుందీ పుస్తకం.

అమృతకాలం ఎలా అవుతుదంటూ..

యూనియన్ బడ్జెట్ పరిమాణమే 47,65,768 కోట్లు కాగా వడ్డీకే నాలుగో వంతు అంటే 11,90,440 కోట్లు చెల్లించుకోవాల్సిన పరిస్థితి. అదే సమయంలో ఒక్క స్వచ్ఛభారత్ కార్యక్రమానికి 1895 కోట్లు ప్రకటనల పేరు మీద ఖర్చు చేయడం, మేక్ ఇన్ ఇండియా లోగో సింహం బొమ్మకు 11 కోట్లు, ఇంకా ఇటువంటి అనేక దారుణాల గురించి ఈ పుస్తకం విస్మయం వ్యక్తం చేస్తుంది. పెద్ద నోట్ల సమయంలో, వ్యవసాయ నల్ల చట్టాల ఆందోళన సమయంలో, కరోనా సమయంలో, మణిపూర్ సంఘటనలో అనేకమంది ప్రాణాలు పోయినా రవ్వంత పశ్చాత్తాపం ప్రకటించకపోగా అవి అతి సాధారణ విషయాలుగా మౌనం వహించడం లాంటివి చూశాక ఏ రకంగా అమృతకాలం వచ్చిందని నమ్మాలో తేల్చుకోమని విస్మయంతో ప్రశ్నిస్తుందీ పుస్తకం. దీన్ని చార్వాక పబ్లికేషన్స్ వారు ప్రచురించారు.

ప్రతులకు

అమృతకాలం కాదిది ఆపత్కాలం

రచయిత రాంపల్లి శశికుమార్

పుటలు 140

వెల రూ. 100

చార్వాక పబ్లికేషన్స్

రెడ్ హిల్స్, హైదరాబాద్

Email: Charwaka@gmail.com


సమీక్షకులు

వి.విజయకుమార్

85558 02596

Tags:    

Similar News