వీరశైవ సాహిత్యం - సామాజిక దృక్పథం!

Veerashaiva Book Review

Update: 2024-05-06 08:35 GMT

బసవేశ్వరుని తత్వం పట్ల, సోమనాథుని సాహిత్యం పట్ల అనురక్తి కలవారు డా. సత్తెనపల్లి బాబు. అందుకే శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో 'బసవపురాణం - ఒక పరిశీలన' అనే అంశంపై పిహెచ్‌డి చేసినారు. తృష్ణ తీరక విషయం వీరశైవ సాహిత్యం - సామాజిక దృక్పథం! అదే ఈ గ్రంథం!

భారతదేశంలో ఆటవిక సమాజం కొలిచిన ఆది దేవుడు శివుడు. ఆది దేవత అంబ. ఇప్పటికీ దక్షిణాదిన గ్రామ దేవతారాధనలు ఈ విషయాన్నే బలపరుస్తున్నాయి. ఈ శివశక్తి పూజా మార్గాలు వేదకాలానికి ముందునుంచే ఉన్నాయి. వైదిక దేవతలలో శివుడిని చేర్చుకొన్నప్పటికి, వైదికులు, అవైదికులు, శిష్టులు, శిష్టేతరులు ఆరాధించే అందరి దేవుడు శివుడు. వైదిక వర్ణ వ్యవస్థ సమాజంలో కల్పించిన అంతరాలను, చేస్తున్న హానిని గుర్తించిన బసవేశ్వరుడు (క్రీ శ 1140- 1196) పరిష్కారంగా వీరశైవంను ప్రబోధించాడు. దేవుడి మీద గుత్తాధిపత్యం చేస్తున్న వర్గాలను ధిక్కరించి అనాది దేవుడు శివుడిని ప్రజల పరం చేసినాడు. శ్రమ గౌరవాన్ని గుర్తించి కాయకమే కైలాసం అన్నాడు.

సామాజిక విప్లవకారుడు బసవేశ్వరుడు

బసవేశ్వరుడు ఆ రకంగా సామాజిక విప్లవకారుడు. బసవన్న బోధనలు కన్నడ నేల నుంచి దేశం కడ అంచుల దాకా చేరినాయి. బసవేశ్వరుని భావజాలాన్ని జీవిత సర్వస్వంగా భావించి, జీవించి, రచించి, తరించిన వాడు మన తెలుగు మహాకవి పాల్కురికి సోమనాథుడు (క్రీ శ 1160-1240). బసవేశ్వరుని జీవితచరిత్రను, శివశరణుల కథలను ప్రజల భాషలో కావ్యంగా మలిచి బసవపురాణంగా అందించినాడు. మరొకటి పండితారాధ్య చరిత్ర. వీరశైవంను అధ్యయనం చేయడానికి, అవగాహన చేసుకోవడానికి తెలుగు నాట సోమనాథుని రచనలే ప్రధాన ఆకరాలు.

తొలి దళిత బహుజన కావ్యం

డాక్టర్ బాబు అధ్యయనానికి కూడా సోమనాథుని రచనలే ఆధారమైనాయి. ఆ క్రమంలో నిగ్గు తేల్చి బసవపురాణంను తెలుగు సాహిత్యంలో మొట్టమొదటి దళిత బహుజన కావ్యంగా నిరూపించినారు. పండితారాధ్య చరిత్ర తొలి విజ్ఞాన సర్వస్వం. సోమనాథుని రచనలలో నాటి రాజకీయ, ఆర్థిక, సాంఘిక, మత పరిస్థితులు విభిన్న రంగాలలో ఎట్లా ప్రతిఫలించినాయో బాబు పరిశోధించినారు. వీరశైవ సాహిత్యంలోని సామాజిక దృక్పథాన్ని సమగ్రంగా ప్రకటించినారు. డాక్టర్ సత్తెనపల్లి బాబు కృషికి హార్దిక అభినందనలు!

పుస్తకం: వీరశైవ సాహిత్యం - సామాజిక దృక్పథం

డాక్టర్ సత్తెనపల్లి బాబు పరిశోధన గ్రంథం

పుటలు: 290, వెల: రూ.320

పుస్తకం కొరకు: 94939 81663


సమీక్షకులు

డాక్టర్ రాపోలు సత్యనారాయణ

94401 63211

Tags:    

Similar News