'అమ్మ ముచ్చట్లు' అపురూపం

'Amma Muchattu' Book Review

Update: 2024-04-29 00:45 GMT

ప్రతి మనిషి జీవితంలో అమ్మ ఒక అపురూపం. అమ్మతో మధురమైన జ్ఞాపకాలు లేనివారు, తలచుకోని వారు ఎవరూ ఉండరు. రాఘవ శర్మ గారు 'అమ్మ ముచ్చట్లు' అనే పుస్తకం రాశారు. వారి అమ్మగారు తన బాల్యాన్ని, తన పుట్టింటి, అత్తింటి అనుభవాలను, సంఘటనలను కథలు కథలుగా చెప్పినట్లుగా రాశారు. ఇందులోని శైలి, సరళ భాష ఆసక్తికరంగా, ఆకర్షణీయంగా ఉండి, పఠితలను ఆసాంతం ఆపకుండా చదివిస్తుంది. గీతాంజలి గారి విశ్లేషణాత్మకమైన, ముందు మాటలు ఈ పుస్తకానికి మరింత విలువను పెంచుతాయి.రాఘవ శర్మ గారి అమ్మ ముచ్చట్లు చదువుతూ ప్రతివారు తమ అమ్మ ముచ్చట్లను తలచుకుంటారు. మమేకమౌతారు.

అమ్మ ముచ్చట్లు ఒక కాలం నాటి సామాజిక జీవిత చరిత్ర చిత్రణ. ఆనాటి ఉమ్మడి కుటుంబ వ్యవస్థ, అనుబంధాలు, మానవ సంబంధాలు, విలువలను రచయిత పాఠకుల కళ్ళముందు నిలిపారు. అప్పటి అమ్మలు శ్రమజీవులు. ఇప్పటి వారిలా తొందరగా అలసిపోయేవారు కాదు. నిత్యం వచ్చిపోయే చుట్టాలతో, ఇంటినిండా మనుషులతో, చేతి నిండా పనితో ఎప్పుడూ క్షణం తీరిక లేకుండా ఉండేవారు. మధ్య తరగతి, దిగువ మధ్యతరగతి అమ్మలకి పనిమనుషులు కూడా ఉండేవారు కాదు. అన్ని పనులు వారే చేసుకునే వారు. సంతానమూ ఎక్కువే అప్పుడు. అందరిని పెంచుతూ, ఇంట్లో అత్త మామలను చూస్తూ ఇన్ని పనులు ఎలా చేసేవారోనని ఆశ్చర్యం వేస్తుంది.

చదువుతున్నంత సేపూ..

అమ్మ ముచ్చట్లు చదువుతున్నంత సేపు నాకైతే మా అమ్మే కళ్ల ముందు కనిపించింది. ఆమె పోయినప్పుడు నేను ఆమెతో జ్ఞాపకాలను కథగా రాసాను. ఈనాడులో అచ్చయింది. అమ్మ, ప్రేమ అనేవి రచనకు ఎప్పుడూ తాజా అంశాలే! 'పని చేయని కాడికి ఈ చేతులెందుకు' అంటారు రాఘవ శర్మ గారి అమ్మ. నిజంగా మా అమ్మ కూడా ఇలాగే అనేది. ఆమె ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూనే ఉండేది. ఇంట్లో మా నాయనమ్మ ఉండేది. మేనత్తలు వచ్చిపోతుండే వారు. అందరికీ కావలసినవి చేస్తూనే ఇంటి దగ్గర ఉండే ఆశ్రమానికి వెళ్లి భగవద్గీత చదివి వినిపించేది. ఆమె ముఖంలో విసుగు, అసహనం ఎప్పుడూ చూడలేదు నేను.

ఆనాటి సంప్రదాయ కుటుంబాలలో గృహ హింస బాగా ఉండేది. కోడళ్లకు సరిగా తిండి పెట్టకపోవటం, ఇంటెడు చాకిరీ చేయించటం, అత్తగారి పెత్తనం ఉండేది. పురుషాధిపత్యం ఎలా ఉండేదంటే భార్యను కొట్టకుండా ఉండటం అనేది చాలా తక్కువ. ఇలాంటివన్నీ రచయిత తల్లిగారు తనతో చెపుతున్నట్లుగా రాశారు.

ఆవకాయ జాడీలకు వాసెన కట్టటం, కావలసినప్పుడు మడి కట్టుకుని చిన్న జాడీల్లోకి తీసుకోవడం, ఎప్పుడు పడితే అప్పుడు ముట్టుకోకపోవటం ఆనాడు బ్రాహ్మణ కుటుంబాల్లో సర్వ సాధారణం. ఇలా చేయటం వెనక శుచి, శుభ్రతలే కాక ఆరోగ్య భద్రత కూడా ఉంది. ఎన్నాళ్లయినా ఆవకాయ పాడయ్యేది కాదు. ఇంట్లో దొంగలు పడి వెండి, బంగారం దోచుకోకుండా రాత్రి చద్దన్నం కోసం వండి ఉంచిన అన్నంలో ఆవకాయ కలుపుకుని తినేయటం, ఆవకాయ జాడీల్లో అంటు చేయి పెట్టి మళ్ళీ వాడుకోవటానికి పనికిరాకుండా చేసేయటం ఒక హాస్య సన్నివేశం.

అమ్మ గొప్పతనాన్ని చెప్పే పుస్తకం..

రామ శేషమ్మ ఒక విలక్షణమైన వ్యక్తి. రచయిత మేనత్త. గట్టిగా మాట్లాడేది. పెళ్లంటే ఏమిటో తెలియని వయసులో జరిగే బాల్య వివాహాల దుష్పలితాల గురించి తెలుగు సాహిత్యంలో ఎన్నో కథలు వచ్చాయి. ఆమెకు అయిదేళ్లు. ఆయనకు పన్నెండేళ్లు. శేషమ్మ గారి పెళ్లి బొమ్మల పెళ్లిలా జరిగిపోయింది. కొంచెం వయసు వచ్చి ఊహ తెలిసాక ఆయనకు భార్య నచ్చలేదు. ఈ గయ్యాళి నాకొద్దు అన్నాడు. మామగారు అల్లుడిపై కేసు వేసి విడాకులిప్పించేసారు. కూతురి జీవితం పుట్టింట్లోనే గడిచిపోయింది. చివర్లో భర్తతో కలిసి కొన్ని రోజులుంది. ఆయన పోయారు. మళ్ళీ ఒంటరిదయింది. ఒంటరి స్త్రీలు సమాజంలో బతకటం కష్టం అనుకునేవారేమో గయ్యాళిలా, గట్టిగా మాట్లాడుతూ ఉండేవారు ఆరోజుల్లో.

రాఘవశర్మ గారి అమ్మ నాలుగవ తరగతి వరకే చదివారు. అయితేనేం, తన పిల్లలందరినీ భర్త తో పోట్లాడి మరీ బాగా చదివించారు. ఆమెకు పాటలు పాడటం ఇష్టం. ఎవరింట్లో పేరంటం జరిగినా ఈమె పాట పాడాల్సిందే. ఆసుపత్రి బెడ్‌పై పార్కిన్సన్‌తో ఊగిపోతున్నా అయిదు పాటలు పాడారు. ఆమె పాడుతుంటే నర్సులంతా చూసి ఆశ్చర్యపోయారు. రాఘవశర్మ గారి అమ్మ గొప్ప మానవతావాది. ఇందులోని ప్రతి సన్నివేశంలో ఆమె గొప్ప వ్యక్తిత్వం వ్యక్తమవుతుంది. అమ్మ ప్రేమను, అమ్మ గొప్పతనాన్ని చెప్పే మంచి పుస్తకం ఇది.

ప్రతులకు

అమ్మ ముచ్చట్లు

పుటలు : 108

వెల : 100

పండు పబ్లికేషన్స్, తిరుపతి

ఆలూరు రాఘవ శర్మ

 94932 26180


సమీక్షకులు

డాక్టర్ చెంగల్వ రామలక్ష్మి

63027 38678

Tags:    

Similar News