పట్నం పులి పంజా విసురుతుంది
నగరపు రోడ్డు కొండ చిలువలా చుట్టేస్తున్నది
దరిదాపుల్లో ఉండడమే
పంట పొలం చేసుకున్న పాపం!
పచ్చని దేహం నిండా
పచ్చి నెత్తురు తాగే కోరల గాట్లే
తరాల ఆకలి తీర్చిన తల్లి
కాలం కలిసి రాక
ఆశల గాలానికి చిక్కిన
రైతు బిడ్డ చేతుల్లోంచి జారి
రోడ్డున బడ్డది
అన్నం మెతుకులుపండే చోటు
అంగడి వస్తువై చేతులు మారుతున్నది
పంట కాలువ పాల ధారలై పారిన చోట
నేల తల్లి కన్నీరు పారుతున్నది
పాలిచ్చే రొమ్మును కోసినట్లు
కరెన్సీ కత్తి
పొలాన్ని ముక్కలుగా కోసి అమ్మేస్తున్నది
పొలం గుండెల నుంచి పైసలు పిండుకొని
పచ్చటి నెత్తురు తాగుతున్నై ధన పిశాచాలు
వ్యాపారం ఊరి చివర పర్యావరణాన్ని
కబేళాలకు తరలిస్తుంటే
కడుపు రగిలిపోతున్నది కాపాడే ప్రకృతికి
ఇక్కడ వీస్తున్న గాలి కీడును శంకిస్తున్నది
రహీమొద్దీన్
90108 51085