సాంస్కృతిక ప్రతిబింబం నాట్యం

International Dance Day 2024

Update: 2024-04-29 00:00 GMT

భారతీయ సంస్కృతి సంప్రదాయాలను అనుసరించి, వాత్స్యాయన గ్రంథం ఆధారంగా రూపొందిన 64 కళలలో ముఖ్యమైనది నృత్యం. మనసుకు వినసొంపైన సంగీతం శ్రావ్యంగా వినబడితే శరీరం అప్రయత్నంగా లయబద్ధంగా కదులుతుంది. దానినే నృత్యం లేదా నాట్యం అంటారు. 1760లో ఆధునిక ఫ్రెంచ్ నృత్య నాటికల సృష్టికర్త, రచయిత అయిన జీన్ జార్జెస్ నోవెర్రే జన్మదినాన్ని పురస్కరించుకొని యునెస్కో ఏప్రిల్ 29ని 'అంతర్జాతీయ నృత్య దినం'గా ప్రకటించింది. యునెస్కోలో ఎన్‌జీఓ ఐన ఇంటర్నేషనల్ డాన్స్ కమిటీ ప్రతిపాదనతో నృత్య దినోత్సవాన్ని 1982 నుంచి జరుపుతున్నారు. నృత్య కళారూపం ప్రపంచీకరణను ఛేదించడానికి, అన్ని రాజకీయ, సాంస్కృతిక, జాతి అడ్డంకులను అధిగమించడానికి, సాధారణ భాషలో గల నృత్యరీతులు గల ప్రజలందరినీ ఒకే చోటికి తేవడానికి కృషి చేయడం ఈ నృత్య దినోత్సవ లక్ష్యం.

నృత్యం అన్నది సంగీతానికి అనుగుణంగా శరీర కదలికలను ప్రేరేపిస్తుంది. మానసిక ఉల్లాసానికి ఉపకరిస్తుంది. తమకు తెలియకుండానే ఆదిమ యుగం నాటి మనుషులు సంతోషం, దుఃఖం కలిగినప్పుడు శరీరాలను కదిలిస్తూ లయబద్ధంగా నృత్యం చేసేవారు. మానవ జాతి పుట్టుక దగ్గర నుంచి నేటివరకు లక్షలాది ఏళ్ళుగా నృత్యం జన జీవనంలో భాగమైంది. ఆదిమ జాతులు వారు జరుపుకునే పండుగలలో నృత్యం అనేది అత్యంత ప్రాధాన్యత కల్గినది. ఇది మూలవాసుల ఆదిమ సంస్కృతికి చిహ్నం. ఆదివాసీలు ప్రకృతిని, సూర్యుని, చంద్రుని దేవుళ్ళుగా భావించేవారు. అవి భ్రమణం చేస్తున్నాయని నమ్ముతున్న ఆదివాసీలు గుండ్రంగా తిరుగుతూ నృత్యం చేసే సంప్రదాయం ఆదిమ కాలపు సంప్రదాయానికి కొనసాగింపుగా పేర్కొంటున్నారు పరిశోధకులు. ఆది మానవుడు ప్రకృతి శక్తులను శాంతింపజేయడానికి తను వశపరుచుకోవడానికి నృత్యాన్ని ఒక సాధనంగా అలవాటు చేసుకున్నారు. కుల మత కట్టుబాట్లు, ప్రవృత్తి పెరిగిన కొలది నృత్య రీతి కూడా పెరిగింది. పరిణామ క్రమంలో నాట్యం నూతన కళాత్మకతను కొనసాగించడం భారత దేశంలో కనిపిస్తోంది.

ఆదిమ తెగలతో ధింసా, గుస్సాడీ, రేలా, దండారీ, కొమ్ము నృత్యాలు కాగా ఆధునిక కాలంలో భరతనాట్యం, కథాకళి, కూచిపూడి, ఒడిస్సీ, మణిపురి, మోహినిఅట్టం మొదలైనవి మన దేశంలో బహుళ ప్రాచుర్యం పొందినవి. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో జరిగే నాగోబా జాతర సందర్భంగా కొత్త కోడళ్ళను కుటుంబంలో కలుపుకోవడానికి గోండు పెద్దలు పెద్ద కార్యక్రమం నిర్వహిస్తారు. ఆటపాటలతో ఆదివాసీలు నృత్యం చేస్తారు. ఆ ఆచారం ఆదిమ తెగల నుంచి సంక్రమించినదే.

మధ్యయుగ కాలంలో దేవాలయ నిర్మాణం ఒక ఉద్యమంలా తయారయింది. దేవాలయ నిర్మాణం వల్ల పుణ్యం లభిస్తుందని భావించిన రాజులు, సామంతులు ఎన్నో దేవాలయాలను నిర్మించి పోషణ కోసం మాన్యాలు, గోవులు, వస్తువులను దానం ఇచ్చేవారు. దేవాలయాలలో దేవదాసీలు ఉండేవారు. అందుకే ప్రాచీన దేవాలయాలలో అద్భుతమైన నాట్యరీతులు గల శిల్పాలు దర్శనమిస్తాయి.

మన దేశంలోని దేవాలయాల్లో నృత్యానికి సంబంధించిన ఆనవాళ్ళు వివిధ భంగిమలలో శిల్పాలపై మలచబడి ఉన్నాయి. భారతీయ నాట్య ప్రపంచంలో భిన్నమైన జానపద నృత్యాలు, సింధు బాగోతులవారు ఆడే ఆట, పులి నృత్యం, ఆదివాసీలు ఆడే దండారీ, గుస్సాడీ ... ప్రాంతాల వారీగా ప్రత్యేకమైనవి. ఆదివాసీలలో ఏ వేడుక జరిగినా నృత్యం తప్పనిసరి. వీటిని బట్టి విడివిడిగా మన జీవితాలను ఊహించలేము. ప్రపంచవ్యాప్తంగా నాట్యానికి మానవ జీవితంలో విడదీయరాని బంధం పెనవేసుకుంది. నృత్యం నేడు వినోదాత్మక కళగా రూపుదిద్దుకున్నది. మారుతున్న కాలానికి శారీరక దేహదారుడ్యం, ఆరోగ్యం పెంపొందించుకోవడానికి నాట్యంలో సరికొత్త విధానాలు ప్రవేశపెడుతున్నారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలలో భాగమైన నృత్య కళను రక్షించుకోవాలంటే నృత్య కళాకారులకు ప్రభుత్వం సరైన జీవన భృతి కల్పించాలి.

(నేడు అంతర్జాతీయ నృత్య దినోత్సవం)


గుమ్మడి లక్ష్మీనారాయణ,

ఆదివాసీ రచయితల వేదిక,

9491318409

Tags:    

Similar News