ఉన్నది ఉన్నట్టు:రాజకీయ సంతలో సరుకులు

గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఇప్పుడు పొలిటికల్ లీడర్ అంటే ఒక క్రేజీ. అదో సోషల్ స్టేటస్. అధికారంలో ఉన్న పార్టీ అంటే మరింత మోజు.

Update: 2022-06-29 18:45 GMT

అధికారం ఉన్నా లేకున్నా సిద్ధాంతం కోసం ఒకే పార్టీలో ఉన్నవారి గురించి చాలా గొప్పగా చెప్పుకోవడం చూస్తుంటాం. ఇప్పుడు అలాంటి వారు చాలా అరుదు. అధికారం, పదవులు, చివరకు డబ్బే లక్ష్యంగా ఎక్కడ అవకాశాలు అనుకూలంగా ఉంటే అందులోకి జంప్ కావడం నేటి పొలిటికల్ లీడర్ల పరమావధి. అమ్ముడు పోవడానికి సిద్ధంగా ఉన్నంతకాలం కొనడానికి పార్టీలు కూడా కాచుకు కూర్చుంటాయి. పాలిటిక్స్, ప్రజాసేవ కాదు. పొలిటికల్ బిజినెస్. ప్రజాప్రతినిధులు కాదు. పక్కా అవకాశవాదులు. ఓటుకు డబ్బులిచ్చి గెలిచిన నేతలు నోటుకు అమ్ముడుపోతున్నారు. రాజకీయాలలో నైతికం, అనైతికం ఉండవ్. అంతా అధికారం, పదవీకాంక్షే.

ల్లీ నుంచి ఢిల్లీ దాకా ఇప్పుడు పొలిటికల్ లీడర్ అంటే ఒక క్రేజీ. అదో సోషల్ స్టేటస్. అధికారంలో ఉన్న పార్టీ అంటే మరింత మోజు. పలుకుబడి, పైరవీలు, సెటిల్‌మెంట్ల ద్వారా ఈజీగా డబ్బు సంపాదించడానికి అదో రాచమార్గం. ప్రజా సేవకుడు అనేది ఒక టైటిల్ మాత్రమే. ప్రజల ఓట్లతో గెలిచిన ప్రజాప్రతినిధులు ఒక సరుకుగా మారారు. అందుకే అప్పుడప్పుడు కొద్దిమంది రాజకీయ నేతలు 'సంతలో గొర్రెలను కొన్నట్లు కొంటున్నారు' అనే కామెంట్లు వినిపిస్తుంటాయి. ఇప్పుడు మహారాష్ట్ర సంక్షోభాన్ని చూస్తుంటే అదే గుర్తుకొస్తుంది. ఇది మొదటిసారేమీ కాదు. నాలుగైదు దశాబ్దాలుగా దేశ రాజకీయాలలో అన్ని రాష్ట్రాలలో కనిపిస్తున్న తంతే ఇది. అధికారం, డబ్బు, పదవీకాంక్ష. ఇవే పార్టీల అంతిమ లక్ష్యం.

తెలుగు రాష్ట్రాలలో ఎన్టీఆర్ హయాం నుంచి జరుగుతున్నదిదే. అధికారం నిలుపుకోవడానికి కొన్ని పార్టీలు, అధికారంలోకి రావడానికి మరికొన్ని పార్టీల మధ్య జరుగుతున్న పొలిటికల్ గేమ్. ప్రజా ప్రతినిధులను ప్రలోభపెట్టో, బలవంతం చేసో వాటివైపు తిప్పుకుంటున్నాయి. ఈ వ్యవహారం వెనక ఉన్నదంతా ప్యాకేజీలు, కాంట్రాక్టులు, పదవులే అనేది బహిరంగ రహస్యం. సాక్ష్యాలకు, ఆధారాలకు ఇవి దొరకకపోవచ్చు. కానీ 'ఓటుకు నోటు మొదలు' క్యాంపులకు, రిసార్టులకు తరలించడం వరకు వాటి యాక్టివిటీ అదే. సాక్షాత్తూ రాజకీయ పార్టీలే వీటిని సందర్భానుసారం ప్రస్తావిస్తూ ఉంటాయి. కొన్నిసార్లు అవి 'హార్స్ ట్రేడింగ్' అనే ముద్దు పేరు తగిలించాయి.

అంతటా ఇదే తంతు

చాలా రాష్ట్రాలలో జరుగుతున్న రెగ్యులర్ ప్రాక్టీసే ఇది. తెలంగాణలోనే చూసుకుంటే స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా బస్సులు పెట్టి మరీ క్యాంపులకు తరలించారు. స్టార్ హోటళ్లలో బస కల్పించారు. ప్రత్యర్థి పార్టీ నుంచి ఇటువైపు వచ్చినందుకు ప్రతిఫలంగా ఏదో ఒకటి ముడుతుంది. పార్టీ సిద్ధాంతం, ఐడియాలజీ, ఇవేవీ ప్రాధాన్యం కాదు. ఇప్పుడు మహారాష్ట్రలోని రాజకీయ సంక్షోభాన్ని చూస్తే ముంబై టు సూరత్, అక్కడి నుంచి గౌహతి, మళ్లీ ముంబై, ఫ్లైట్ టికెట్లు, స్టార్ హోటళ్లు, లగ్జరీ సౌకర్యాలు ఇవన్నీ అధికారం కోసమే. ఒక పార్టీ నుంచి దూరమై మరో పార్టీకి లబ్ధి చేకూర్చినందుకు ప్రత్యేకంగా టారిఫ్‌లే ఉంటున్నాయి.విశ్వాస పరీక్ష, అవిశ్వాస తీర్మానం, ఇందుకు జరిగే ఓటింగ్ సందర్భాలలో లాంటి రాజకీయాలు ఎక్కువ. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం అంటూ మనం గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం.

ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోడానికి చట్టాలనూ ఈ పార్టీల ప్రతినిధులే చేస్తుంటారు. పార్టీ ఫిరాయింపు చట్టం అలాంటిదే. ఆ చట్టాన్ని చేసిన పార్టీలే ఇప్పుడు అందులోని లొసుగులను వాడుకుంటున్నాయి. ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి ఫిరాయించడం అనైతికం అని చెప్పే పార్టీలే వీటికి 'విలీనం' అనే ట్యాగ్ తగిలించి సమర్ధించుకుంటున్నాయి. ప్రభుత్వాలను కూల్చడం, ప్రతిపక్షాలను పటిష్టంగా ఉండకుండా చేయడమే వీటి లక్ష్యం. అధికారం కోసం అనైతిక పొత్తులు, అవకాశవాదం నేటి రాజకీయాల క్యారెక్టర్. ఎక్కడ ప్రయోజనాలు పుష్కలంగా ఉంటే అటు వెళ్లిపోవడం ప్రజా ప్రతినిధుల సహజ లక్షణం.

లాక్కోవడమే రాజకీయం

కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఉనికిలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అదే పార్టీతో పొత్తు పెట్టుకున్నది. శివసేన బాలథాకరే సైతం అదే చెప్పినా ఇప్పుడు అందుకు విరుద్ధంగా జరుగుతున్నది. తెలంగాణలో చూసుకుంటే ఉద్యమ పార్టీగా ఉనికిలోకి వచ్చిన టీఆర్ఎస్‌పైనా ప్రజలలో అలాంటి అభిప్రాయాలే ఉన్నాయి. ఉద్యమకారులకు అన్యాయం జరుగుతోందనే విమర్శలతో పాటు ఉద్యమానికి వ్యతిరేకంగా వ్యవహరించినవారు మంత్రులుగా కొనసాగుతున్నారనే ఆరోపణలు సరేసరి. కాంగ్రెస్, తెలుగుదేశం టికెట్లపై గెలిచి టీఆర్ఎస్‌లోకి దూకినవారు ఈ ఎనిమిదేళ్ల కాలంలో పదుల సంఖ్యలోనే ఉన్నారు. అందుకు ప్రతిఫలంగా రకరకాల పదవులు, హోదాలు, అధికారం, పనులు దక్కించుకున్నారు. ప్రజాప్రతినిధుల అవకాశవాద వైఖరే పార్టీలకు ఈ ఛాన్స్ కల్పిస్తున్నది.

దేశంలో సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆర్టికల్ 356 పేరుతో నచ్చని పార్టీల ప్రభుత్వాలను కూల్చేసిందని బీజేపీ పదేపదే విమర్శిస్తూ ఉన్నది. ఇప్పుడు అదే బీజేపీ గడచిన ఎనిమిదేళ్ల కాలంలో ఎనిమిది రాష్ట్రాలలోని ప్రభుత్వాలను మరో పేరుతో కూల్చేసింది. కర్నాటక, మధ్యప్రదేశ్, బిహార్, గోవా, ఉత్తరాఖండ్, జమ్ముకశ్మీర్, అరుణాచల్‌ప్రదేశ్, మణిపూర్ రాష్ట్రాలలో ఇదే జరిగింది. ప్రభుత్వాన్ని స్థాపించేందుకు అవసరమైన సంఖ్యా బలం లేకున్నా ప్రత్యర్థి పార్టీల నుంచి లాక్కుని ఈ పని చేసింది. ఇప్పుడు మహారాష్ట్రలోనూ దాన్నే రిపీట్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ప్రజాస్వామ్యానికి 'ధన'బలం

ఫిరాయించడానికి ఎమ్మెల్యేలు లేదా ఎంపీలు సిద్ధమవుతున్నంతకాలం కండబలం, ధనబలం ఉన్న పార్టీలు ఈ ప్రయత్నాలు చేస్తూనే ఉంటాయి. ప్రాంతీయ పార్టీలలోని కొన్ని అవలక్షణాలు బీజేపీ లాంటివాటికి కలిసొస్తున్నాయి. కుటుంబ పాలన, ఏకపక్ష నిర్ణయాలు, వ్యక్తి కేంద్రంగా పార్టీ నిర్వహణ. ఇలాంటివాటిని బీజేపీ వాడుకుంటున్నది. ఇప్పుడు మహారాష్ట్రలో ఏక్‌నాధ్ షిండే వెనక నడిచిన ఎమ్మెల్యేలంతా లేవనెత్తిన వాదన ఇదే. పార్టీ అధినేత లేదా సీఎంగా ఉన్నవారు మంత్రులకు సైతం కలిసే అవకాశం ఇవ్వడం లేదు అనేది వాటిలో ఒకటి.తెలంగాణలో సైతం ఇది తరచూ వినిపిస్తున్నదే. మంత్రులు, ఎమ్మెల్యేలు ఉత్సవ విగ్రహాలు మాత్రమే. చాలాచోట్ల ప్రాంతీయ పార్టీలు కుటుంబ పార్టీలుగానే ఉన్నాయి.

తమిళనాట డీఎంకే, కర్నాటకలో జేడీఎస్, ఏపీలో తెలుగుదేశం, తెలంగాణలో టీఆర్ఎస్, ఒడిశాలో బీజేడీ, మహారాష్ట్రలో శివసేన, జార్ఖండ్‌లో జేఎంఎం, ఉత్తరప్రదేశ్‌లో ఎస్‌పీ ఇవన్నీ ఆ కోవలోనివే. ఒకవైపు ప్రాంతీయ పార్టీలదే భవిష్యత్తు అనే చర్చలు జరుగుతున్నాయి. గతంలో అవన్నీ ఒకే కూటమిగా ఏర్పడి ప్రభుత్వాలను ఏర్పాటు చేశాయి. ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నికలలో ఐక్యంగా ఉన్నామన్న మెసేజ్‌ను ఇస్తున్నాయి. ఇదే సమయంలో వాటిని నిర్వీర్యం చేసి బలహీనపర్చడంపై బీజేపీ ఫోకస్ పెట్టింది. అడ్వాంటేజ్‌గా మార్చుకుంటున్నది. మహారాష్ట్రలో చేజారిన అధికారాన్ని తిరిగి తెచ్చుకోవడానికి తెర వెనక రాజకీయం నడిపిస్తున్నది.

నైతికత లేని పార్టీలు

ప్రభుత్వం పడిపోయినా ఫర్వాలేదంటూ వాజ్‌పాయి తన పార్టీ ఐడియాలజీకి కట్టుబడి ఉన్నారు. ఇప్పుడు అధికారం కోసం ఏం చేసినా నైతికమే అనే లాజిక్ అమలవుతున్నది. నిజానికి బహుళపార్టీ వ్యవస్థలోనే ప్రజాస్వామ్యం పటిష్టంగా ఉంటుందని పార్టీల నేతలు లెక్చర్లు ఇస్తుంటారు. కానీ, అది మాటల వరకే. ఆచరణలో చిన్న పార్టీలను విచ్ఛిన్నం చేయడానికి కుట్రలు జరుగుతూనే ఉంటాయి. నయానా భయానా లాంటివి అమలుచేస్తుంటాయి. అవినీతి కేసులు, దర్యాప్తు సంస్థల నోటీసులు, ఇవన్నీ రాష్ట్రంలో, కేంద్రంలో చూస్తున్నదే. అవసరమైతే కోవర్టు రాజకీయాలనూ ప్రోత్సహిస్తుంటాయి. ఇంటిగుట్టును ప్రత్యర్థులకు చేరవేసి ప్రతిఫలాన్ని పొందుతున్నవారూ ఉన్నారు.తెలంగాణలోనే చూస్తే ఏకంగా పీసీసీ చీఫ్ అయిన తర్వాత రేవంత్ స్వయంగా కోవర్టు కామెంట్ చేసి నెల రోజుల డెడ్‌లైన్ పెట్టారు.

అధికారం ఉన్నా లేకున్నా సిద్ధాంతం కోసం ఒకే పార్టీలో ఉన్నవారి గురించి చాలా గొప్పగా చెప్పుకోవడం చూస్తుంటాం. ఇప్పుడు అలాంటివారు చాలా అరుదు. అధికారం, పదవులు, చివరకు డబ్బే లక్ష్యంగా ఎక్కడ అవకాశాలు అనుకూలంగా ఉంటే అందులోకి జంప్ కావడం నేటి పొలిటికల్ లీడర్ల పరమావధి. అమ్ముడుపోవడానికి సిద్ధంగా ఉన్నంతకాలం కొనడానికి పార్టీలు కూడా కాచుకు కూర్చుంటాయి. పాలిటిక్స్, ప్రజాసేవ కాదు. పొలిటికల్ బిజినెస్. ప్రజాప్రతినిధులు కాదు. పక్కా అవకాశవాదులు. ఓటుకు డబ్బులిచ్చి గెలిచిన నేతలు నోటుకు అమ్ముడుపోతున్నారు. రాజకీయాలలో నైతికం, అనైతికం ఉండవ్. అంతా అధికారం, పదవీకాంక్షే.

 ఎన్. విశ్వనాథ్

99714 82403

Tags:    

Similar News