సీనియర్ టీచర్లకు ప్రమోషన్లలో అన్యాయం!

Injustice in promotions for senior teachers!

Update: 2024-04-30 01:30 GMT

ఉన్నత పాఠశాలల్లో అత్యంత కీలకమైంది గెజిటెడ్ హెడ్మాస్టర్ గ్రేడ్-2 పోస్టు. వీటిని వందశాతం ప్రమోషన్లతోనే భర్తీ చేయాలి. ఈ పోస్టులకు ప్రమోషన్లు కల్పించేందుకు అర్హత కల్గిన ఉపాధ్యాయుల సీనియార్టీ జాబితాలు సిద్ధం చేయడంలో జిల్లా విద్యాశాఖాధికారులు (డీఈవోలు), రీజనల్ జాయింట్ డైరెక్టర్లు (ఆర్జేడీలు) ప్రభుత్వ ఉత్తర్వులను బేఖాతరు చేస్తున్నారు. నిబంధనలను తుంగలో తొక్కి తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయంలో డీఈవోలు, ఆర్జేడీలకు సరైన మార్గనిర్దేశం చేసి తప్పులను సవరించాల్సిన పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ కార్యాలయంలోని అధికారులు సైతం విషయాన్ని సీరియస్‌గా తీసుకోవడం లేదు. ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో అర్హులైన సీనియర్ టీచర్లకు గెజిటెడ్ హెడ్మాస్టర్ ప్రమోషన్లలో తీవ్ర అన్యాయం జరుగుతోంది.

పాఠశాలల్లో పనిచేస్తున్న అన్ని కేటగిరీల స్కూల్ అసిస్టెంట్లను ఒకే గాటన కట్టి గెజిటెడ్ హెడ్మాస్టర్ గ్రేడ్-2 పోస్టుల ప్రమోషన్ల కోసం విద్యాశాఖాధికారులు సీనియార్టీ లిస్టులు ప్రిపేర్ చేస్తున్నారు. డీఎస్సీ ర్యాంకుల ప్రాతిపదికగా ఇంటర్-సే సీనియార్టీ నిర్ధారిస్తున్నారు. అన్ని కేటగిరీల్లో 1వ ర్యాంకు పొందిన టీచర్ల పేర్లను సీనియార్టీ లిస్టులో మొదట రాస్తున్నారు. ఆ తర్వాత 2వ ర్యాంకు, 3వ ర్యాంకు పొందిన టీచర్ల పేర్లను వరుసగా పొందుపరిచి సీనియార్టీ లిస్టులు ప్రిపేర్ చేసి ప్రమోషన్లు ఇస్తున్నారు. ఇదెలా ఉంటుందంటే, ప్రైవేటు విద్యాసంస్థలు పరీక్షల్లో తమ విద్యార్థులు సాధించిన ర్యాంకులు 1,1,1, 2,2,2, 3,3,3 అని ఊదరగొట్టే ప్రచారాన్ని తలపిస్తుంది. ఇలా సీనియార్టీని నిర్ధారించడం నిబంధనలకు పూర్తి విరుద్ధం.

ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా సీనియార్టీ లిస్టులు రూపొందించడంపై కనీస అవగాహన లేని అధికారులే తప్పుడు పద్ధతుల్లో సీనియార్టీ లిస్టులు ప్రిపేర్ చేసి, చేతులు దులుపుకుంటున్నారు. ఒక్కో సబ్జెక్టు స్కూల్ అసిస్టెంట్ పోస్టు ఒక్కో కేటగిరి అని ప్రభుత్వం జారీచేసిన జీవోలే స్పష్టం చేస్తున్నాయి. మాట వరుసకు అధికారులు చెప్తున్నట్టు స్కూల్ అసిస్టెంట్ పోస్టులన్నీ ఒకే కేటగిరికి చెందినట్లైతే, స్టెప్పింగ్ అప్ పే వర్తింపజేసే సందర్భంలో కూడా దాన్నే ప్రామాణికంగా తీసుకోవాలి కదా! వేర్వేరు సబ్జెక్టు స్కూల్ అసిస్టెంట్ల మధ్య వేతన వ్యత్యాసాన్ని తొలగించడానికి కూడా స్టెప్పింగ్ అప్ పే అనుమతించాలి కదా. కానీ, స్టెప్పింగ్ అప్ పే అమలు సందర్భంలో సేమ్ సబ్జెక్టు (ఒకే కేటగిరి) స్కూల్ అసిస్టెంట్ ఉండాలని చెప్తున్న అధికారులే, సీనియార్టీ ఫిక్స్ చేసే విషయం వచ్చేసరికి స్కూల్ అసిస్టెంట్లందరూ ఒకే కేటగిరి కింద లెక్కించడం హాస్యాస్పదం కాదా?

రూల్స్ ఏం చెప్తున్నాయంటే..!

ప్రభుత్వం 23 జనవరి, 2009 న 11, 12 నెంబర్ జీవోలు జారీచేసి పాఠశాల విద్యాశాఖలోని ఉపాధ్యాయులకు సర్వీస్ నిబంధనలను రూపొందించింది. ఆ జీవోల్లో పేర్కొన్న అర్హతల మేరకే టీచర్లకు ప్రమోషన్లు కల్పిస్తున్నారు. నేటికీ ఆ జీవోలే అమల్లో ఉన్నాయి. ఆ రూల్స్ ప్రకారం ఒక్కో సబ్జెక్టు స్కూల్ అసిస్టెంట్ పోస్టును ఒక్కో కేటగిరిలో పొందుపరిచారు. ఇలా వివిధ సబ్జెక్టు స్కూల్ అసిస్టెంట్ పోస్టులను 1 నుంచి 17 వరకు వేర్వేరు కేటగిరీలుగా వర్గీకరించారు. ఎల్ఎఫ్ఎల్ హెడ్మాస్టర్ పోస్టును కేటగిరి 18 లో పెట్టారు. వేర్వేరు సబ్జెక్టు స్కూల్ అసిస్టెంట్ల సీనియార్టీని తెలంగాణ స్టేట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ (టీఎస్ఎస్ఎస్ఆర్) రూల్-36 ప్రకారం నిర్ధారించాలి. ఇంటర్-సే నిబంధన వర్తింపజేసి వేర్వేరు సబ్జెక్టులకు చెందిన స్కూల్ అసిస్టెంట్ల సీనియార్టీని నిర్ధారించాలి. ఈ ఇంటర్-సే రూల్ అమలు సందర్భంలో డీఎస్సీ రోస్టర్ కమ్ మెరిట్ ప్రకారం ఎట్టి పరిస్థితుల్లోనూ సీనియార్టీ ఫిక్స్ చేయకూడదు. విధుల్లో చేరిన తేదీ ప్రాతిపదికగా మాత్రమే సీనియార్టీ ఫిక్స్ చేయాలి.

సీనియార్టీ నిర్ధారించడం ఇలా!

టీఎస్ఎస్ఎస్ఆర్-36 (i) ప్రకారం గెజిటెడ్ హెడ్మాస్టర్ గ్రేడ్-2 పోస్టుల ప్రమోషన్ కోసం ఒక్కో కేటగిరి స్కూల్ అసిస్టెంట్ల సీనియార్టీ జాబితాలను మొదట డీఎస్సీ రోస్టర్ కమ్ మెరిట్ ప్రకారం ప్రిపేర్ చేయాలి. మిగతా కేటగిరి స్కూల్ అసిస్టెంట్లతో కలిపి ఇంటర్-సే సీనియార్టీ జాబితా ప్రిపేర్ చేస్తున్నప్పుడు రోస్టర్ కమ్ మెరిట్ ప్రకారం రూపొందించిన ఆయా కేటగిరి సీనియార్టీ జాబితాలు డిస్టర్బ్ చేయకుండా, టీఎస్ఎస్ఎస్ఆర్-36 (ii) ప్రకారం వేర్వేరు సబ్జెక్టు స్కూల్ అసిస్టెంట్లకు వారు విధుల్లో చేరిన తేదీ ప్రాతిపదికగా సీనియార్టీ నిర్ణయించాలి. వేర్వేరు సబ్జెక్టు టీచర్లు ఒకే రోజు విధుల్లో చేరిన సందర్భాల్లో టీఎస్ఎస్ఎస్ఆర్-36 (iii) వర్తింపజేసి, పుట్టిన తేదీలను పరిగణనలోకి తీసుకొని, ఎక్కువ వయస్సు ఉన్న టీచర్ ని సీనియర్‌గా నిర్ధారించాలి. ఉపాధ్యాయుడి స్వీయ అభ్యర్థనపై వేరే యూనిట్ జిల్లాకు బదిలీ అయితే, టీఎస్ఎస్ఎస్ఆర్-36 (v) ప్రకారం నూతన యూనిట్ జిల్లాలో చేరిన తేదీ ప్రాతిపదికగా మాత్రమే సీనియార్టీ నిర్ధారించాలి. 317 జీవో అమలు సమయంలో ఉమ్మడి జిల్లా పరిధి దాటి బదిలీ అయిన స్పౌజ్ కేటగిరి టీచర్లకు ఈ నిబంధన వర్తింపజేసి, కొత్త జిల్లాలో చేరిన తేదీ ప్రాతిపదికగా మాత్రమే సీనియార్టీ ఫిక్స్ చేయాలి. మిగతా క్యాడర్ల సీనియార్టీ లిస్టులు సైతం ఇదే పద్ధతిలో రూపొందించాలి. ఈ ఇంటర్-సే సీనియార్టీ నిబంధనలు విద్యాశాఖలో పనిచేసే టీచర్లకే కాకుండా, అన్ని ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు సైతం వర్తిస్తాయి.

డైరెక్టర్ జోక్యం చేసుకోవాలి!

ఉపాధ్యాయుల సీనియార్టీపై క్లారిఫికేషన్ కోసం పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ కార్యాలయాన్ని సంప్రదిస్తున్న డీఈవోలు, ఆర్జేడీలకు అధికారులు సరైన రీతిలో వివరణలు ఇవ్వడం లేదు. తమకు తోచింది ఓరల్ గా చెప్తూ జిల్లాల్లో మరింత గందరగోళం సృష్టిస్తున్నారు. డీఈవోలు, ఆర్జేడీలు రూపొందిస్తున్న తప్పుడు సీనియార్టీ జాబితాలనే ఆదర్శంగా తీసుకొని చాలా చోట్లా ఉన్నత పాఠశాలల హెడ్మాస్టర్లు సైతం పాఠశాల స్థాయిలో ఉపాధ్యాయుల సీనియార్టీ ఫిక్స్ చేస్తున్నారు. ఆ తప్పుడు సీనియార్టీ ప్రకారమే పాఠశాలల్లో ఉపాధ్యాయులకు ఇంచార్జి హెడ్మాస్టర్, పరీక్షలు వంటి కీలకమైన బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఈ కారణంగా సీనియర్ టీచర్లకు అన్యాయం జరుగుతోంది. దీంతో పాఠశాలల్లో ఉపాధ్యాయుల మధ్య వివాదాలు, సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకునే దాకా పరిస్థితులు దిగజారుతున్నాయి. అందుకని, ఈ విషయంలో రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ సత్వరం జోక్యం చేసుకోవాలి. ఉపాధ్యాయుల సీనియార్టీ లిస్టుల ప్రిపరేషన్‌పై డీఈవోలు, ఆర్జేడీలు ప్రభుత్వ ఉత్తర్వులు పాటించేలా స్పష్టమైన ఆదేశాలివ్వాలి.

మానేటి ప్రతాపరెడ్డి

TRTF గౌరవాధ్యక్షుడు

98484 81028

Tags:    

Similar News