ఓట్లేస్తేనే.. పాలసీ రూపొందిస్తారా?

చంద్రమండలానికి సైతం ఉపగ్రహాలను పంపించే స్థాయికి ఎదిగిన మన ప్రభుత్వాలకు, తరతరాలుగా నేతపనినే నమ్ముకున్న కార్మికులకు ఎలా

Update: 2024-04-30 01:15 GMT

చంద్రమండలానికి సైతం ఉపగ్రహాలను పంపించే స్థాయికి ఎదిగిన మన ప్రభుత్వాలకు, తరతరాలుగా నేతపనినే నమ్ముకున్న కార్మికులకు ఎలా ఉపాధి కల్పించాలో తెలియదంటే ఇచ్ఛంత్రమనే అనుకోవాలి.

ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యం కావాలి. ఆ ప్రజల్లో అణగారిన వర్గాలు, కులవృత్తులు చేస్తూ పేదరికంతో పోరాడుతూ, గ్లోబలైజేషన్ యుగంలో పోటీని తట్టుకోలేక చావు-బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ, కడు దుర్భర జీవితాన్ని గడుపుతున్న సమూహాలకు తగిన పని కల్పించి, వారి కాళ్ళపై వారిని నిలబడేలా ప్రభుత్వమే చూడాలి. మనిషి యొక్క కనీస సౌకర్యాలైన కూడు,గూడు, గుడ్డ లను వారే సొంతంగా సంపాదించుకునేలాగా చేయడం ప్రభుత్వాల కనీస బాధ్యత. వీటి కోసం ప్రభుత్వాల వైపు దేహీ అన్నట్టుగా ఎదురుచూడరాదు. సరిగ్గా ఇటువంటి దయనీయ పరిస్థితుల్లో ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలోని నేతన్నలు. సిరిసిల్లలో 50 సం.లు పైబడ్డ నేతన్నలకు చేద్దామన్నా పనిలేక, తినడానికి తిండి దొరక్క ఉపవాసాలు ఉంటూ, బక్కచిక్కి చావుకు దగ్గరవుతున్నారు. ఏ మార్గం కనబడక, దిక్కుతోచక, ఈ వయసులో వేరే పని చేయలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

చేనేతకు రక్షణ కవచం... జీఐ

మనదేశంలో చేనేత రంగంపై దాదాపు 30 లక్షల మంది ఆధారపడి ఉన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాలు చేనేత వస్త్రాల ఉత్పత్తికి ప్రసిద్ధిగాంచాయి. వాటిలో బెనారస్, భాగల్పూర్, కోట, సంబల్పూర్, సోలాపూర్, మైసూర్, కన్నూర్, కాసర్గోడ్, కాంచీపురం, ఉప్పాడ, ధర్మవరం, వెంకటగిరి, మంగళగిరి,పోచంపల్లి, గద్వాల, వరంగల్, సిద్దిపేట మొ. ప్రాంతాలున్నాయి. ఈ ప్రాంతాల్లో మగ్గంపై నేసే వస్త్రాలను వేరే ప్రాంతాల్లో తయారు చేయకుండా నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం, 65 రకాల చేనేత ఉత్పత్తులను 1999లో రూపొందించిన భౌగోళిక గుర్తింపు (జిీఐ) చట్టం కింద చేర్చింది. దీని ద్వారా నేతన్నల ప్రయోజనాలు కాపాడుతూనే వినియోగదారులు మోసపోకుండా వారికి ఏ ప్రాంతం చేనేత వస్త్రాలు కావాలో ఆ వస్త్రాలను అదే నాణ్యతా ప్రమాణాలతో అందించవచ్చు. ఇలా జీఐ పొందిన వాటిలో తెలంగాణకు చెందిన పోచంపల్లి ఇక్కత్ చీరలు, గద్వాల్ చీరలు, సిద్దిపేట గొల్లభామ చీరలు, నారాయణపేట చేనేత చీరలు, వరంగల్ జంపఖానా (దర్రీస్)లు కూడా ఉన్నాయి.

తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 60 వేల పైచిలుకు నేతన్నలు చేనేత రంగంపై ఆధారపడ్డారు. వీరంతా పద్మశాలి, స్వకులశాలి, కుర్ని, కత్రి, జాండ్ర, దేవాంగ, తొగట, నేతకాని కులాలకు చెందిన వారు. ఆ వర్గాల్లోని కుటుంబ సభ్యులంతా తరతరాలుగా ఈ వృత్తిపైనే ఆధారపడి జీవనోపాధి పొందుతున్నారు. రాష్ట్రంలో ఈ కులాలకు చెందిన వారందరినీ కలిపి నేతన్నలుగా వ్యవహరిస్తాం. కాలానుగుణంగా, ఎంతోమంది ఈ కుల వృత్తిని వదిలేసి, చాలా తక్కువ సంఖ్యలో చేనేత, మరమగ్గాల, వస్త్ర రంగానికి సంబంధించిన ఇతరత్రా పనుల్లో నిమగ్నమయ్యారు.

వీరి గుర్తింపులో శాస్త్రీయ విధానం

తెలంగాణ రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే ఐదు రకాల చేనేత వస్త్రాలకు జీఐ గుర్తింపు ఉన్నప్పటికీ చేనేత వస్త్రాలపై సామాన్య జనానికి అంతగా అవగాహన లేక, వస్త్రాల కొనుగోళ్లు రోజురోజుకూ తక్కువై, నేతన్నలకు ఉపాధి కరువై బతకడమే గగనమైపోతున్నది. మరి ఇటువంటి సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి? ముందుగా ప్రభుత్వం నేతన్నలను ఏడురకాలుగా విభజించాలి. ఒకటి సాంప్రదాయ మగ్గాల (చేనేత-హ్యాండ్ లూమ్స్)పై ఆధారపడ్డ వారు; రెండవది పవర్ లూమ్స్‌పై ఆధారపడ్డ వారు; మూడవది ప్రైవేట్ టెక్స్ టైల్ కంపెనీల్లో పనిచేసేవారు; నాలుగవది కుట్టు మిషన్లపై బట్టలు కుట్టేవారు(టైలర్); అయిదవది ఇతరుల బట్టల షాపుల్లో పనిచేసేవారు; ఆరవది అంగళ్ళలో, ఊళ్ళల్లో కెళ్ళి బట్టలు అమ్మేవారు; ఏడవది చిన్న చిన్న దుకాణాలు పెట్టుకొని వస్త్రాలు అమ్మేవారు. చేనేత రంగంలో ఆమ్దానీ ఫాయిదా లేకపోవడం వల్ల గానీ, అసలు ఉపాధి అవకాశాలే లేకపోవడం వల్ల నేతన్న వర్గాలకు చెందిన చాలామంది బట్టల షాపుల్లో పనికి కుదరడం, బట్టలు అమ్మడం వంటి కొత్త పనులు చేస్తున్నారు. అటువంటి వారిని గుర్తించే బాధ్యతను చేనేత సహకార సంఘాలకు అప్పజెప్పాలి. ఇటువంటి వారికి కూడా ప్రభుత్వ పథకాలు అందిస్తే, స్వయం ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. నేతన్నల్లోని యువతరం సొంతంగా బట్టల షాపులు పెట్టుకొని వారి కాళ్లపై వారు నిలబడగలుగుతాడు.

ప్రతి పనిని ఓట్ల కోసం చూడొద్దు!

ప్రభుత్వాలు ప్రతీ పనిని ఓట్ల కోణంలోనే చూస్తాయి. వారికి ఒక వర్గం లేదా కులం వారు ఓట్లు వేస్తారనుకుంటే, వారి కోసం ఎటువంటి పాలసీలైనా, చట్టాలైనా చేయడానికి సిద్ధంగా ఉంటున్నాయి. అలాగే ముఖ్యమంత్రి, మంత్రుల యొక్క నియోజకవర్గాలకే నిధులు అధికంగా కేటాయించుకొని, మిగతా రాష్ట్రాన్ని పట్టించుకోకపోవడమూ మంచిది కాదు. అందువల్లనే ప్రభుత్వాలు మారినప్పుడల్లా వారి యొక్క ప్రాధాన్యాలు కూడా మారుతున్నాయి. ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి యాజమాన్యం మారినప్పుడల్లా వారి విధానాలు ఎలా మారుతాయో, ఆ రకంగానే ఈ ప్రభుత్వాలు కూడా వ్యవహరిస్తూ బడుగు బలహీన వర్గాల యొక్క సంక్షేమాన్ని రాజకీయాల పేరుతో మర్చిపోతున్నాయి. ప్రభుత్వాల ఈ విపరీత ధోరణి మారిపోయి, నేతన్నలకు తగు ఉపాధి కల్పించాలి.

ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలబడాలి!

ప్రపంచీకరణ నేపథ్యంలో ఆర్థిక, సామాజిక, విద్యా రంగాల్లోని మార్పులవల్ల ఈ రోజుల్లో కేవలం చేనేతపై ఆధారపడ్డ వారు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు. అయితే వారికి కూడా ప్రభుత్వ ఆదరణ లేకపోతే చేనేత కళ అంతరించిపోవడం ఖాయం. కులవృత్తులు చేసుకుంటున్న అణగారిన వర్గాలు, ముఖ్యంగా అత్యంత దీనస్థితిలో ఉన్న నేతన్నలకి వెన్నుదన్నుగా నిలబడడమే ప్రభుత్వ లక్ష్యం కావాలి. ఈ చర్య ప్రత్యక్షంగా చేనేత రంగాన్ని పదికాలాలపాటు పరిరక్షిస్తుంది. కాబట్టి ఏ ప్రభుత్వమైనా, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకి వెన్నెముకగా ఉండే వ్యవసాయం, చేనేత, తదితర రంగాలను ఆదుకుంటేనే దేశమైనా, రాష్ట్రమైనా పురోగమిస్తుందని మరువరాదు.

-డా. శ్రీరాములు గోసికొండ,

సోషల్ సైంటిస్ట్

92484 24384

Tags:    

Similar News