ఈవీఎంలపై సుప్రీం తీర్పునిచ్చినా.. తొలగని సందేహాలు

Update: 2024-04-30 01:00 GMT

కొన్ని 'ఈవీఎం'ల విషయంలో ఓట్ల ట్యాంపరింగ్ జరుగుతోందని, ఆ ఈవీఎం మెషన్‌లలో ఏ పార్టీ గుర్తు మీట నొక్కినా అధికార పార్టీ గుర్తుకే ఓట్లు పోల్ అవుతున్నాయని సుప్రీంకోర్టు న్యాయవాదులు చాలా కాలం నుండి అనేక ధర్మ సందేహాలను లేవనెత్తారు. ఈవీఎంలలో సాంకేతిక అంశాలలో తలెత్తే సమస్యల నివృత్తి కోసం వారు పోరాటం చేస్తూ చివరకు న్యాయం కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే, ఈ పిటిషన్‌‌పై చాలా కాలం గడిచాక మొన్న శుక్రవారం సుప్రీంకోర్టు తన తీర్పును వెల్లడించింది. అయితే, ఈ తీర్పులో ప్రజల్లో గల అనేక సందేహాలను, న్యాయవాదులు లేవనెత్తిన అనేక సాంకేతిక అంశాలను సుప్రీంకోర్టు పట్టించుకోకపోవడంతో అనేక ధర్మ సందేహాలు అలాగే మిగిలిపోయాయి.

ఇటీవల కేరళలో ఈవీఎంల సామర్థ్యాన్ని నిరూపించడానికి ఒక ప్రయోగం నిర్వహించారు. అందులోనూ ఒక మీట నొక్కితే ఓటు మరొకరికి పడిన సాక్ష్యం వెల్లడైంది. అందుకే ఇలాంటి సాంకేతిక లోపాలను సరిదిద్దడానికి, ఈవీఎంలకు అనుసంధానమై ఉండే వీవీ ప్యాట్ పత్రాలన్నింటిని బేరీజు వేయాలని, లేదా పాత పద్ధతిలో బ్యాలెట్ పత్రాలను వినియోగించాలని, అదీ వీలుకాకపోతే, వీవీ ప్యాట్లలో ఏడు సెకండ్లు మాత్రమే వెలిగే కాంతిని ఎప్పుడూ వెలిగేలా చేయాలని న్యాయవాదులు సుప్రీంకోర్టులో కేసులు వేశారు. అయితే న్యాయవాదుల వాదనలు, ఇతర ప్రజా సంఘాలు చేసిన విజ్ఞప్తులను దేనిని కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు సంజీవ్ కన్నా, దీపాంకర్ దత్తతో కూడిన బెంచ్ ఆమోదించలేదు. ఈ కేసులన్నింటినీ సుప్రీంకోర్టు గంపగుత్తగా కొట్టివేసింది. దీంతో ఈ అంశంపై ప్రజల ప్రశ్నలు, ప్రశ్నలుగానే మిగిలిపోయాయి.

ఈసీ పనుల్లో జోక్యం చేసుకోలేమంటూ..

సుప్రీం బెంచ్ విచారణ సమయంలో, ఆధునిక సాంకేతికత ఆధారంగా తయారైన ఈవీఎంల మీద అనుమానాలు వ్యక్తం చేసే ధోరణి సరైనది కాదు, పైగా ఎన్నికల కమిషన్ కూడా రాజ్యాంగబద్ధమైన వ్యవస్థ కనుక తాము ఆదేశాలు ఇవ్వలేమనడం ఆశ్చర్యం కలిగించింది. సుప్రీంకోర్టే ఈ విషయంలో జోక్యం చేసుకోకపోతే దాని అవకతవకలను ఎవరు నిలువరించ గలరు? ఎన్నికల కమిషన్ తప్పు చేయదని నిర్ధారించడం ఎలా సమర్ధనీయం? కార్యనిర్వాహక వర్గం ప్రభావంతో ఎన్నికల సంఘం నిష్పాక్షికంగా వ్యవహరించనప్పుడు, ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా లేనప్పుడు ఓటర్లు ఎవరికి మొర పెట్టుకోవాలి? ఈవీఎంల పనితీరులో ఓటర్లకు సందేహాలు కలిగినప్పుడు వాటిని పరిష్కరించవలసిన బాధ్యత ఈసీకి లేదా? ఎన్నికల కమిషన్ అంతర్గత విషయాల్లో సమున్నత న్యాయస్థానం జోక్యం చేసుకోలేమంటే ఓటర్లు ఎవరిని ఆశ్రయించాలి? అసలు ఎన్నికల సంఘం విధుల్లో జ్యోక్యం చేసుకొనే అధికారం సుప్రీంకోర్టుకు లేదని న్యాయమూర్తులు నిర్ధారణకు వచ్చినప్పుడు కేసు ప్రాథమిక దశలోనే న్యాయవాదుల పిటిషన్లను తిరస్కరించకుండా ఇంతకాలం ఎందుకు వాదనలు, ప్రతివాదనలు జరిపారు? ఇది విలువైన కోర్టు సమయం వృధా చేయటమేగా?

ట్యాంపరింగ్ అవకాశాలున్నాయన్నా..

పోనీ, వీవీపాట్ల నుండి వెలువడే చిన్న ఓటర్ స్లిప్పులను ఓటరు చేతికి ఇస్తే అతడు చూసుకొని ఒక డబ్బాలో వేసే అవకాశం కల్పించాలన్న సూచనలను కూడా న్యాయమూర్తులు అంగీకరించలేదు. వాటిని లెక్కించడం మొదలుపెడితే దానికి వారం రోజుల సమయం పడుతుంది కనుక దాన్ని సైతం సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈవీఎం అనే పరికరం ఒకసారి మాత్రమే ప్రోగ్రాం చేసేది కాదు. దాని ఫలితాలను సాంకేతికంగా తారుమారు చేసే వీలు ఉందని, ఇది కేరళలలో రుజువైందని, ప్రసిద్ధ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ చేసిన వాదనలను కూడా సరైన కారణాలు చెప్పుకుండానే సుప్రీంకోర్టు నిరాకరించింది. కావాలంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సమక్షంలో ఈవీఎం పనితీరును, ట్యాంపరింగ్ అవకాశాలను సాంకేతిక నిపుణుల ముందు, జర్నలిస్టుల ముందు పరీక్షకు ఆదేశాలు ఇవ్వొచ్చు కదా! కానీ, కోర్టు అలా చేయలేదు. ఈవీఎంలలోని లోపాలను లేవనెత్తడం అంటే... ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వ్యతిరేకించడమేనని ఎన్నికల సంఘం వాదనతో సుప్రీంకోర్టు ఏకీభవించింది.

యంత్రాల్లో మార్పు చేయలేరా?

మనుషుల ప్రమేయం లేని యంత్రాలు కచ్చితంగా ఫలితాలు అందిస్తాయని న్యాయమూర్తులు... ఈవీఎంలను సాంకేతికంగా సాప్ట్‌వేర్ సహాయంతో మార్పులు చేయవచ్చునన్న వాదనను కోర్టు అంగీకరించకపోవడం, మనిషి తయారు చేసిన పరికరాన్ని ఆ మనుషులే మార్చవచ్చునన్న తర్కాన్ని కోర్టు ఎందుకు పట్టించుకోలేదో తెలియదు. అయితే, ఈ తీర్పులో సుప్రీంకోర్టు ఎన్నికల కమిషన్ కు రెండు బాధ్యతలను అప్పగించింది. ఈవీఎంలలోకి పార్టీ చిహ్నాలను చేర్చిన తర్వాత ఆ చిహ్నాలను చేసిన విభాగాన్ని సీలు చేసి, 45 రోజుల దాకా భద్రంగా ఉంచాలని, అలాగే ఓటింగ్‌కు వినియోగించిన పరికరాలలోని సాఫ్ట్ వేర్ ను ఫలితాలు వెల్లడి అయిన తర్వాత వాటిని తయారు చేసిన ఇంజనీర్లు పరిశీలించి నిగ్గు తేల్చాలని కూడా ఆదేశించింది. అయితే, ఈ రెండు ఆదేశాలు అనుమానాలను తగ్గించడానికి ఉపయోగపడతాయే గానీ, ఆ అనుమానాలను సంపూర్ణంగా నివృత్తి చేయలేవు. ఇక మిగిలిందల్లా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి అప్రమత్తమై మెలగవలసిన బాధ్యత ఓటర్లదే.

డా. కోలాహాలం రామ్ కిశోర్,

98493 28496

Tags:    

Similar News