వరల్డ్ వాక్: ఆధిపత్య పీడనపై స్వేచ్ఛ పోరాటం

వరల్డ్ వాక్: ఆధిపత్య పీడనపై స్వేచ్ఛ పోరాటం... A freedom struggle against hegemonic oppression

Update: 2023-01-03 18:45 GMT

ఆధునిక కాలంలో దేశాలైనా, ప్రజలైనా స్వేచ్ఛగా స్వతంత్రంగా జీవించాలని, ఎవరి ఆధిపత్యం లేకుండా ఉండాలని కోరుకుంటున్నారు. పది నెలలకు పైగా కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధం దీనికి తిరుగులేని ఉదాహరణ. పాకిస్తాన్‌లో పస్తూన్లు తదితర తెగలు, చైనాలో వియ్‌గర్ ముస్లింలు, మయన్మార్‌లో ప్రజాస్వామ్య పోరాటం, ఇరాన్‌లో హిజాబ్ వ్యతిరేక ఘటనలు వంటివి స్వేచ్ఛ కోసం ప్రజలు సాగిస్తున్న పోరాటాల్లో భాగమే. ఆదిపత్యం చెలాయించాలని చూసే ఏ శక్తికైనా ప్రజల ముందు భంగపాటు తప్పదనేది చరిత్ర చెబుతున్న సత్యం.

ప్రపంచంలో ప్రతి మనిషి స్వేచ్ఛగా జీవించాలనుకుంటాడు. అలాగే ప్రతిదేశం సార్వభౌమాధికారాన్ని కోరుకుంటుంది. స్వేచ్ఛగా ఉండాలని వాంఛిస్తుంది. ఒకవేళ ఎవరైనా తమపై ఆధిపత్యం చెలాయిస్తే తిరగబడుతుంది. దాదాపు పది నెలలుగా జరుగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధం దీనికి ఉదాహరణ. ఉక్రెయిన్ నాటో కూటమిలో చేరాలని అమెరికా కోరుకోగా, రష్యా వ్యతిరేకించింది. కానీ, అమెరికా వైపే మొగ్గు చూపిన ఉక్రెయిన్, నాటో కూటమిలో చేరడానికి దరఖాస్తు చేసుకుంది. ఉక్రెయిన్ తమ చేతుల నుంచి తప్పిపోతుందని, దీనివలన తమ భద్రతకు ముప్పు ఏర్పడుతుందని భావించిన రష్యా 2022 మొదట్లో ఉక్రెయిన్‌పై సైనిక చర్య చేపట్టింది. ఉక్రెయిన్ తిరగబడటంతో అది పూర్తిస్థాయి యుద్ధంగా మారిపోయింది.

ఆధిపత్యాన్ని సహించలేక

రష్యా సైనిక చర్యను ప్రతిఘటించడానికి ఉక్రెయిన్ తొలిరోజులలో కలవరపడినా, తర్వాత పుంజుకొని నాటో కూటమి దేశాల సహాయంతో రష్యాను నిలువరించింది. ఇటీవల అమెరికాలో పర్యటించిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్‌స్కీ అక్కడి కాంగ్రెస్ సభలో ప్రసంగిస్తూ, తాము స్వేచ్ఛను మాత్రమే కోరుకుంటున్నామని చెప్పారు. ఏ దేశమైనా సరే ఇతర దేశాల ఆధిపత్యాన్ని కోరుకోవడం లేదని ఆయన ప్రకటన స్పష్టం చేస్తోంది. కాగా ఉక్రెయిన్ పోరుకు మద్ధతిచ్చి అమెరికా తన అగ్రరాజ్య హోదాను కోల్పోయే పరిస్థితి తెచ్చుకుంటుంది. ఉక్రెయిన్ నుండి ప్రపంచంలోని పలు దేశాలకు ఆహార ధాన్యాల సరఫరా, రష్యా నుంచి ముడిచమురు, వంట నూనెల సరఫరా జరుగుతోంది. దాదాపు 10 నెలలకు పైగా సాగుతున్న ఈ పోరులో రష్యా- ఉక్రెయిన్ ప్రజలు ఎంత నష్టపోతున్నా యుద్ధం మాత్రం ఆగడం లేదు. రష్యా తాకిడిని ఉక్రెయిన్ నిలువరించడమే కాకుండా రష్యన్ బాంబుల వర్షాన్ని సైతం తట్టుకొని నిలబడుతోంది. ప్రపంచంలోని శక్తివంతమైన సైన్యాల్లో ఒకటైన రష్యాకు సైనికపరంగా తీవ్ర నష్టాలు కలిగిస్తోంది తప్పితే ఉక్రెయిన్ లొంగుబాటుకు సిద్ధపడటం లేదు. అవసరమైతే నాటోలో చేరడానికే సిద్ధంగా ఉంది.

ఈ నేపథ్యంలో జి-20 దేశాల కూటమికి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన భారతదేశం వెంటనే యుద్ధం విరమించి రష్యా, ఉక్రెయిన్‌లు చర్చలకు పూనుకోవాలని కోరింది.. ఇది యుద్ధాల సమయం కాదని అందరూ శాంతితో జీవించాలని భారత్ ఆకాంక్ష. అమెరికాతో పాటు చైనా ఒక అగ్రరాజ్యంగా ఉండికూడా తైవాన్‌ను స్వాధీనం చేసుకోవాలని బెదిరిస్తున్నది. చైనాను ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే ఎదుర్కొంటామని చైనాలో కలవబోమని తైవాన్ సైతం స్పష్టం చేసింది. అమెరికా, చైనాలు చిన్నదేశాలను నయాన భయాన ఆక్రమించాలని, పరోక్షంగా అదుపులో పెట్టుకోవాలని చూస్తున్నాయి. శ్రీలంకకు చైనా సహాయం చేయడం, నేపాల్‌ను తన చెప్పు చేతల్లో ఉంచుకోవడం, పాకిస్థాన్‌కు ఆర్థికంగా తోడ్పడటం వంటి చర్యలతో మన దేశంపై చైనా ఒత్తిడి పెంచి అంతిమంగా అరుణాచల్‌ప్రదేశ్ ను స్వాధీనం చేసుకోవాలనే కుట్ర చేస్తోంది.

అంతర్గత అణచివేతను వ్యతిరేకిస్తూ

ఇతర దేశాల ఆధిపత్యాన్నే కాదు దేశంలోని అణచివేతను సైతం ప్రజలు సహించడం లేదు. ఇరాన్‌లో ఇటీవల జరిగిన హిజాబ్ వ్యతిరేక ఘటనలు దీనికి ఉదాహరణ. హిజాబ్ వస్త్రధారణ విషయంలో ఇరాన్ అణచివేత చర్యలకు తెగబడగా, అక్కడి మహిళలు తిరుగుబాటు చేశారు. దీంతో వారి ఒత్తిడి తట్టుకోలేక ఇరాన్ కొంతవరకు దిగివచ్చి మహిళలకు స్వేచ్ఛ కల్పించింది. అలాగే ఆఫ్ఘానిస్తాన్‌లో మహిళలపై అణచివేత ప్రకటిస్తూ పాఠశాలలో, కాలేజీల్లో, యూనివర్సిటీలలో అడ్మిషన్లను తాలిబన్ ప్రభుత్వం రద్దు చేసింది. అక్కడి మహిళలు తీవ్రంగా ప్రతిఘటించడం, ఇతర దేశాల నుంచి వచ్చిన ఒత్తిడి కారణంగా తాలిబన్ ప్రభుత్వం అక్కడి మహిళలకు యూనివర్సిటీ చదువు వద్దన్న ఆర్డర్ ను పక్కకు పెట్టేసింది.

అయితే ఒత్తిడి వల్లే తాలిబన్లు వెనక్కు తగ్గారు కానీ మరోసారి మహిళల విద్యపై తాలిబన్లు ఆంక్షలు పెట్టడం తప్పనిసరని అంటున్నారు. అలాగే పాకిస్తాన్ సైతం తన సరిహద్దులోని తెగలపై హింసా చర్యలకు పాల్పడుతోంది. పాకిస్తాన్ ఆధిపత్యాన్ని పస్తూన్లు వంటి అక్కడి తెగలు ప్రశ్నిస్తున్నాయి. అలాగే ఉయ్‌గర్ తెగ ముస్లింలపై చైనా తీవ్రమైన అణచివేత చర్యలకు పాల్పడుతోంది. ప్రస్తుతం చైనా కరోనా నివారణ చర్యలపైనే కేంద్రీకరించింది. కానీ చైనా దేశం నమ్మదగినది కాదు అక్కడి ముస్లింలకు ఆ దేశం ఎప్పటికైనా ప్రమాదమే.

అలాగే మయన్మార్‌లో ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటున్న తెగ ప్రజలపై అక్కడి ప్రభుత్వం అణచివేత చర్యలు చేపడుతోంది. ప్రజాస్వామ్య పాలనను కోరుకుంటున్న రాజకీయ నాయకురాలు అంగ్‌సాన్ సూకీని అక్కడి సైనిక ప్రభుత్వం నిర్బంధించి, వరుస శిక్షలతో తీవ్ర అణచివేత చర్యలకు పాల్పడుతున్నది. ఉత్తర కొరియా ఆధునిక క్షిపణులను ప్రయోగిస్తూ దక్షిణ కొరియాను భయపెడుతోంది. జపాన్‌ను సైతం వణికిస్తున్నది. అలాగే గొప్ప ప్రజాస్వామ్య దేశం అని చెప్పుకునే మనదేశంలో సైతం కాశ్మీర్ ప్రాంతంలో ఒక వర్గం వారిపై ఉగ్రదాడులు జరుగుతున్నాయి. కాశ్మీర్ స్వయం ప్రతిపత్తికి అవకాశం ఇచ్చిన ఆర్టికల్ 370ని రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం అక్కడ ప్రశాంత వాతావరణం ఉందని ప్రకటించింది. కానీ అక్కడ మైనార్టీ వర్గాలపై దాడులు ఎక్కువై ప్రజలు ప్రశాంత పరిస్థితులలో జీవించే పరిస్థితి లేకుండా ఉంది. కాశ్మీర్‌లో ఎన్నికలు జరిగి ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడితే ఇక్కడి పరిస్థితి కొంత కుదుటపడవచ్చు. మొత్తం మీద చూస్తే నేటి ఆధునిక కాలంలో దేశాలైనా, ప్రజలైనా స్వేచ్ఛగా స్వతంత్రంగా జీవించాలని, ఎవరి ఆధిపత్యం లేకుండా ఉండాలని కోరుకుంటున్నారు. మరి కాల పరిస్థితులు ఎలా ఉంటాయో వేచి చూడాలి.

శ్రీనర్సన్

జర్నలిస్ట్, కాలమిస్ట్

8328096188

పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ dishaopinion@gmail.com, వాట్సప్ నెంబర్ 7995866672

Also Read... 

గిరిజన రిజర్వేషన్‌కు మోకాలడ్డు


Tags:    

Similar News