కామన్ మ్యాన్ డైరీ: ఆదుకున్న పల్లెతల్లి....

కృష్ణది వరంగల్ సమీపంలోని ఓ గ్రామం. సుమారు నాలుగువేల జనాభా ఉండే ఆ గ్రామంలో కిరాణా వ్యాపారం చేసేవాడు. మొత్తం గ్రామంలో నాలుగైదు

Update: 2022-09-26 18:45 GMT

కృష్ణది వరంగల్ సమీపంలోని ఓ గ్రామం. సుమారు నాలుగువేల జనాభా ఉండే ఆ గ్రామంలో కిరాణా వ్యాపారం చేసేవాడు. మొత్తం గ్రామంలో నాలుగైదు షాపులే ఉండటంతో వ్యాపారం బాగా సాగేది. తండ్రి శంకరయ్యతో కలిసి షాపును నడిపేవారు. షాపునకు సరిపడా సామగ్రి వరంగల్ నుంచి తెచ్చేవాడు కృష్ణ. తండ్రి పెట్టిన షాపులో ఉండటం, ఆ వ్యాపారాన్నే తాను కొనసాగించడం కృష్ణకు పెద్దగా ఇష్టం ఉండేది కాదు. డిగ్రీ వరకు చదువుకొన్నా షాపునకే పరిమితమయ్యాడు. హైదరాబాద్​ వెళ్లి ఏదైనా వ్యాపారం చేయాలనుకొనేవాడు.

'సమ్ థింగ్ డిఫరెంట్' బిజినెస్ చేయాలని కలలు కన్నాడు. ఈ విషయమై తండ్రితో గొడవ పడేవాడు. తనకు రూ. 10 లక్షల పెట్టుబడి కావాలని అడిగాడు. తన ఆరోగ్యం బాగుండటం లేదని, అమ్మకు కూడా ఓ తోడు కావాలని పెళ్లిచేసుకోవాలని కొడుకును సముదాయించాడు శంకరయ్య. మేనమామ కూతురు లావణ్యతో వివాహం చేశాడు. ఏడాది గడిచింది. ఆస్తమాతో తీవ్ర అస్వస్థతకు గురైన శంకరయ్య ఎంజీఎం దవాఖానలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఓ నెల రోజులు గడిచింది. గిరాకీ క్రమంగా పడిపోతున్నది. రోజూ రూ. 10 వేల నుంచి 15 వేల రూపాయల వచ్చిన కలెక్షన్ కాస్తా రెండు వేలకు పడిపోయింది.

*

కృష్ణ స్నేహితుడు రాజేశ్​ హైదరాబాద్‌లోని జగద్గిరిగుట్టలో కిరాణం షాపు నడుపుతున్నాడు. షాపు బాగా నడుస్తుండటంతో ఇల్లు కొన్నాడు. ఊళ్లో రెండెకరాల పొలం తీసుకున్నాడు. దసరా పండుగకు, ఏదైనా ఫంక్షన్లు జరిగితే సొంతూరుకు వచ్చిపోతుంటాడు. ఓసారి ఊరొచ్చినప్పుడు కృష్ణను కలిశాడు. వ్యాపారం బాగా సాగుతుందని చెప్పాడు. ప్రస్తుతం సిటీలో క్యారీ బ్యాగుల వ్యాపారం, తయారీ బాగా సాగుతుందని, మంచి డిమాండ్ ఉందని చెప్పాడు. కొంచెం పెట్టుబడి ఎక్కువే కానీ, మంచి లాభాలు గడించవచ్చని సలహా ఇచ్చాడు. అప్పటి నుంచి కృష్ణకు క్యారీ బ్యాగుల తయారీ పరిశ్రమ ఏర్పాటు చేయాలనే ఆలోచన వెంటాడుతున్నది. ఓ రోజు హైదరాబాద్ వెళ్లి రాజేశ్‌ను కలిశాడు. తాను క్యారీ బ్యాగుల తయారీ పరిశ్రమ పెడతానన్నాడు.

ఇందుకోసం 20 లక్షల వరకు ఖర్చవుతాయని రాజేశ్ చెప్పడంతో ఊళ్లో ఉన్న నాలుగెకరాలలో రెండెకరాల పొలం అమ్మేశాడు. జీడిమెట్ల పారిశ్రామికవాడలో ఓ షెడ్డును లీజుకు తీసుకొని క్యారీ బ్యాగులు, విస్తరాకులు, పేపర్ గ్లాస్‌లు, ప్లేట్ల తయారీని ప్రారంభించాడు. తొలుత ట్రాన్స్‌పోర్ట్, మార్కెటింగ్ కొంత కష్టమైంది. ఫ్యామిలీని హైదరాబాద్‌లోని షాపూర్‌నగర్‌కు మార్చాడు. వ్యాపారం బాగా సాగింది. తక్కువ ధరకు ఇస్తుండటంతో చాలా మంది కృష్ణ వద్దే కొనుగోలు చేసేవారు. చింతల్ ఓ ఔట్‌లెట్ ఓపెన్ చేసి భార్యను షాపులో కూర్చోబెట్టాడు. క్యారీ బ్యాగులు, విస్తరాకులు, పేపర్ ప్లేట్లు, ప్లాస్టిక్ గ్లాసులు అమ్మేవారు.

*

పాలిథిన్ ప్రాణాంతకమని, నిర్ణీత డైమన్షన్ కన్నా తక్కువ ఉన్న కవర్లను అనుమతించబోమని, అమ్మితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ప్రభుత్వం జీఓ జారీ చేసింది. కృష్ణ వద్ద ఉన్న మెషిన్లతో అంతకన్న ఎక్కువ మందంతో కవర్లు తయారు చేయలేడు. గోదాము నిండా స్టాకు పేరుకుపోయింది. షాపుల వాళ్లు కేసులకు భయపడి తీసుకునేందుకు నిరాకరించారు. అధికారులు గోదాముల మీద దాడి చేసి తనపైనా కేసులు నమోదు చేస్తారేమోనన్న భయం కృష్ణను వెంటాడుతున్నది. చింతల్‌లో ఏర్పాటు చేసిన ఔట్‌లెట్ మూసేశారు. అంతకు ముందు వ్యాపారం బాగా సాగుతుండటంతో బ్యాంకు నుంచి రూ. 20 లక్షల వరకు లోన్ తీసుకున్నాడు. ఇన్‌స్టాల్‌మెంట్ కట్టకపోవడంతో వాళ్లు ఫోన్లు చేస్తున్నారు. ఏం చేయాలో అర్థం కాలేదు. తన బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదు.

ఆ రాత్రికి తన మేనమామ నర్సింహకు ఫోన్ చేసి పిలిపించుకున్నాడు. విషయం చెప్పాడు. ఎలా గట్టెక్కాలో అర్థం కావడం లేదంటూ ఏడ్చినంత పనిచేశాడు. ఊళ్లో ఉన్న రెండెకరాలు అమ్మితే నలభై లక్షల వరకూ వస్తుంది. అమ్మేసి డబ్బు కట్టేద్దామని సలహా ఇచ్చాడు ఆయన. భూమిని అమ్మేసి బ్యాంకు లోన్ కట్టేశారు. క్యారీ బ్యాగుల గోదాం ఖాళీ చేశారు. ఓ రాత్రి పూట ఊరవతల డంప్ చేసేశారు. 'బతుకు జీవుడా' అంటూ ఊరు బాట పట్టారు. అక్కడే మళ్లీ కిరాణం షాపు పెట్టారు. ఈ సారి సిటీలోని షాపింగ్ మాల్ మాదిరిగా కొంచెం పెద్దగానే పెట్టారు. షాపు బాగానే నడుస్తోంది. 'భూమి గుండ్రంగా ఉన్నదన్నట్టు' హైదరాబాద్​ వెళ్లి వ్యాపారం చేయాలనుకున్న కృష్ణ తిరిగి సొంతూరికే చేరాడు.

ఎంఎస్‌ఎన్ చారి

79950 47580

Tags:    

Similar News