ఆ నియోజకవర్గం నుంచి వారిద్దరికి మంత్రి పదవులు..?పృథ్వీరాజ్ జోస్యం!

తనకు 25 ఎంపీ సీట్లు ఇస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకువచ్చి, రాజధాని నిర్మాణం చేపట్టి ఆంధ్రప్రదేశ్ ప్రగతి పథంలో నడిపిస్తానని గత ఎన్నికల ముందు ఈ ప్రజలకు నమ్మబలికి, అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని

Update: 2024-04-25 11:57 GMT

దిశ ప్రతినిధి, అనకాపల్లి : తనకు 25 ఎంపీ సీట్లు ఇస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకువచ్చి, రాజధాని నిర్మాణం చేపట్టి ఆంధ్రప్రదేశ్ ప్రగతి పథంలో నడిపిస్తానని గత ఎన్నికల ముందు ఈ ప్రజలకు నమ్మబలికి, అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ప్రముఖ సినీ నటుడు, జనసేన స్టార్ క్యాంపైనర్ పృథ్వీరాజ్ పేర్కొన్నారు. గురువారం అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాను పదేళ్లు జగన్‌తో కాపురం చేశానని ఆయన విధానాలు నచ్చకే తాను పార్టీ నుంచి బయటకు వచ్చానని తెలిపారు. జగన్ పాలనలో వారి యొక్క శాఖలపై అవగాహన లేని అంబటి రాంబాబు, రోజా వంటి వారికి పదవులిచ్చి రాష్ట్రాన్ని అయోమయంలో పడేశారన్నారు.

అనకాపల్లి నియోజకవర్గం నుంచి సీఎం రమేష్ ఎన్నికయ్యాక కేంద్ర మంత్రి అవుతారని, అలాగే ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న జనసేన పార్టీ అభ్యర్థి కొణతాల రామకృష్ణ రాష్ట్ర మంత్రి అవుతారని జోష్యం చెప్పారు. ఉత్తరాంధ్రకు సీఎం జగన్ పాలన వలన పరిశ్రమలు రాకపోవడంతో యువత నిరుద్యోగ సమస్యను ఎదుర్కొని ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. నిరుద్యోగ సమస్య తీరాలన్నా,పరిశ్రమలు రావాలన్నా సీఎం రమేష్‌ను ఎంపీగా గెలిపించుకోవాలని ఫృధ్వీరాజ్ కోరారు.

మే 4న ప్రధాని మోడీ అనకాపల్లి రాక..

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా మే నెల 4వ తేదీన అనకాపల్లికి విచ్చేస్తున్నారని బీజేపీ నాయకులు పరుచూరి భాస్కరరావు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు విజయవంతం చేయాలని కోరారు. జిల్లా బీజేపీ అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు మాట్లాడుతూ కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పర్యటన విజయవంతం చేసిన మూడు పార్టీల నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అన్నారు. సమావేశంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బుద్ద నాగజగదీశ్వరరావు, గుడాల ముదిరాజ్ సత్యనారాయణ, మళ్ల గణేష్ పాల్గొన్నారు.

Read More..

అధికారంలోకి రాగానే వాళ్లను శిక్షిస్తాం.. సీఎం రమేశ్ మాస్ వార్నింగ్


Similar News