హైకోర్టులో మాజీమంత్రి నారాయణకు ఊరట

మాజీమంత్రి నారాయణకు హైకోర్టులో ఊరట లభించింది. టెన్త్ క్లాస్ పరీక్ష పేపర్ లీక్ కేసులో చిత్తూరు మేజిస్ట్రేట్‌ కోర్టు ఇచ్చిన బెయిల్‌ను చిత్తూరు తొమ్మిదో అదనపు సెషన్స్‌ జడ్జి రద్దు చేసిన సంగతి తెలిసిందే.

Update: 2022-12-06 12:41 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : మాజీమంత్రి నారాయణకు హైకోర్టులో ఊరట లభించింది. టెన్త్ క్లాస్ పరీక్ష పేపర్ లీక్ కేసులో చిత్తూరు మేజిస్ట్రేట్‌ కోర్టు ఇచ్చిన బెయిల్‌ను చిత్తూరు తొమ్మిదో అదనపు సెషన్స్‌ జడ్జి రద్దు చేసిన సంగతి తెలిసిందే. సెషన్స్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ మాజీమంత్రి నారాయణ హైకోర్టును ఆశ్రయించారు. ఇరువాదనలు విన్న ధర్మాసనం చిత్తూరు తొమ్మిదో అదనపు షెషన్స్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసింది. అంతేకాదు ఈ కేసును మళ్లీ విచారించి 4వారాల్లో నిర్ణయం తీసుకోవాలని సెషన్స్ కోర్టుకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇకపోతే టెన్త్ క్లాస్ పరీక్షల పేపర్ లీక్ కేసులో నారాయణకు చిత్తూరు మేజిస్ట్రేట్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈ ఉత్తర్వులను అదనపు సెషన్స్ జడ్జి రద్దు చేశారు. నవంబర్ 30లోగా ట్రయల్ కోర్టు ముందు లొంగిపోవాలని మాజీమంత్రి నారాయణను ఆదేశించింది. దీనిని సవాల్ చేస్తూ నారాయణ హైకోర్టును ఆశ్రయించారు.

ఈ పిటిషన్‌పై మంగళవారం హైకోర్టులో వాదనలు జరిగాయి. నారాయణ తరఫున వినిపిస్తూ.. ప్రభుత్వ ఉద్యోగి నమ్మకాన్ని ఉల్లంఘించిన నేరానికి వర్తించే ఐపీసీ సెక్షన్ 409ని చేర్చారని కోర్టుకు తెలిపారు. అర్నేశ్ కుమార్ కేసులో అత్యున్నత న్యాయస్థానం మార్గదర్శకాలను సైతం దాటవేసి ఈ కేసులో ఏడేళ్లకు పైగా జైలు శిక్ష పడేందుకే పోలీసులు సెక్షన్లు చేర్చారని వాదించారు. అంతేకాదు ప్రాసిక్యూషన్‌ వాదనలు వినకుండానే బెయిల్‌ మంజూరు చేయడంతో మేజిస్ట్రేట్‌ ఇచ్చిన బెయిల్‌ను చిత్తూరు తొమ్మిదో అదనపు సెషన్స్‌ జడ్జి రద్దు చేశారని తెలిపారు. విధానపరమైన లోపాల ఆధారంగా బెయిల్ రద్దు చేసిందని వాదించారు.

అలాగే టెన్త్ క్లాస్ పరీక్ష పేపర్ లీక్ కేసుకు నారాయణకు ఎలాంటి సంబంధం లేదని వివరించారు. నారాయణ ఎడ్యుకేషనల్ ట్రస్ట్‌కు నారాయణ 2014లో రాజీనామా చేశారని అందుకు సంబంధించిన ఆధారాలను హైకోర్టుకు న్యాయవాది సమర్పించారు. మరోవైపు ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ప్రభుత్వం తరఫున వాదించారు. ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారంలో పిటిషనర్ ప్రమేయాన్ని నిరూపించేందుకు పోలీసులు ఆధారాలు సేకరించారని కోర్టుకు తెలిపారు. రిమాండ్ దశలో బెయిల్ మంజూరు చేయడం అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు చిత్తూరు తొమ్మిదో అదనపు సెషన్స్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది.

Similar News