ఎన్నికలు మొదలవ్వకుండానే రూ.4,650 కోట్లు సీజ్.. 75ఏళ్ల చరిత్రలోనే అత్యధికం

రాష్ట్రాలవారీగా చూసుకుంటే, తెలుగు రాష్ట్రాల్లో దాదాపు రూ.250 కోట్లు...

Update: 2024-04-15 17:17 GMT

దిశ, నేషనల్ బ్యూరో: రానున్న లోక్‌సభ ఎన్నికల కోసం కనీవినీ ఎరుగని రీతిలో ధన ప్రవాహం పొంగిపొర్లుతోంది. ఇంకా పోలింగ్ మొదలవ్వకుండానే, 75ఏళ్ల లోక్‌సభ ఎన్నికల చరిత్రలోనే అత్యధిక సొమ్ము ఈసారి పట్టుబడింది. ఎన్నికల వేళ దేశవ్యాప్తంగా సంబంధిత అధికారులు ఇప్పటివరకు రికార్డు స్థాయిలో రూ.4,650 కోట్ల విలువైన సొమ్మును సీజ్ చేశారు. 2019 నాటి లోక్‌సభ ఎన్నికల మొత్తం సమయంలో రూ.3,475 కోట్ల సొమ్ము పట్టుబడగా, ఈసారి కనీసం తొలి దశ ఎన్నికలైనా జరగకుండానే, గత ఎన్నికల రికార్డును బ్రేక్ చేయడం గమనార్హం. ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) సోమవారం ప్రకటించింది. ఎన్నికల సంఘం వెల్లడించిన వివరాల ప్రకారం, గత ఎన్నికల్లో మొత్తం రూ.3,475 కోట్లు విలువ చేసే సొమ్ము పట్టపడగా, ఈ ఎన్నికల్లో మార్చి 1 నుంచి ఈ నెల 13వరకు మాత్రమే రూ.4,650 విలువైన సొమ్మును సీజ్ చేశారు. రోజుకు కనీసం రూ.100 కోట్ల చొప్పున స్వాధీనం చేసుకుంటున్నట్టు ఈసీ వెల్లడించింది. ఎన్నికలు మొదలవ్వకుండానే ఇంత భారీ స్థాయిలో సొమ్ము పట్టుబడిందంటే, పోలింగ్ పూర్తయ్యేనాటికి ఎవరూ ఊహించని స్థాయిలో నగదు పట్టుబడే అవకాశాలున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

భారీగా పెరిగిన డ్రగ్స్

గతంలో కన్నా ఈ ఎన్నికల్లో డ్రగ్స్‌ను ఇప్పటివరకు 45శాతం అధికంగా స్వాధీనం చేసుకోవడం ఆందోళనకరం. గత ఎన్నికల్లో రూ.844కోట్ల నగదును సీజ్ చేయగా, ఈ ఎన్నికల్లో ఇప్పటివరకు రూ.395.39కోట్లు మాత్రమే స్వాధీనం చేసుకున్నారు. నగదు మినహా మిగతా అన్నింట్లోనూ గతంలో కన్నా ఎక్కువగా సీజ్ చేశారు. గత ఎన్నికల్లో రూ.304.6కోట్ల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకోగా, ఈసారి రూ.489.3 కోట్ల లిక్కర్‌ పట్టుబడింది. 2019 ఎలక్షన్ల టైంలో రూ.1,279.9 కోట్ల విలువైన డ్రగ్స్, నార్కొటిక్స్ స్వాధీనం చేసుకోగా, ఈసారి 45శాతం పెరిగి రూ.2,068.8 కోట్లకు చేరుకోవడం గమనార్హం. అలాగే, గత ఎన్నికల్లో రూ.987.11కోట్ల విలువైన ఆభరణాలను స్వాధీనం చేసుకోగా, ఈసారి రూ.562.1కోట్ల విలువ చేసే ఆభరణాలు సీజ్ చేశారు. గత ఎన్నికల్లో రూ.60.15కోట్ల విలువైన ఉచితాలు పట్టుబడగా, ఈసారి ఏకంగా రూ.1,142.49 కోట్ల విలువైనవి సీజ్ చేశారు. కాగా, ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందు జనవరి, ఫిబ్రవరిలో సముద్ర, రోడ్డు మార్గం గుండా తరలిస్తుండగా సంబంధిత ఏజెన్సీలకు రూ.7,502కోట్ల విలువైన అక్రమ నగదు, మత్తుపదార్థాలు పట్టుబడటం గమనార్హం. ఈ రెండింటినీ కలిపితే ఇప్పటివరకు జప్తు చేసిన మొత్తం సొమ్ము, మత్తు పదార్థాల విలువ రూ.12వేల కోట్లకు పైనే.

తెలుగు రాష్ట్రాల్లో రూ.250కోట్లకు పైగా..

మార్చి 1 నుంచి ఏప్రిల్ 13వరకు సంబంధిత ఏజెన్సీలు జప్తు చేసిన సొమ్మును రాష్ట్రాలవారీగా చూసుకుంటే, తెలుగు రాష్ట్రాల్లో దాదాపు రూ.250 కోట్లు పట్టుబడ్డాయి. ఆంధ్రప్రదేశ్‌లో నగదు, మద్యం, మత్తుపదార్థాలు, ఆభరణాలు, ఉచితాలు కలిపి రూ.125.9 కోట్ల సొమ్ము సీజ్ చేయగా, తెలంగాణలో రూ.121.8 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. రాజస్థాన్‌లో రికార్డు స్థాయిలో రూ.778.5 కోట్ల విలువైన సొమ్ము జప్తు చేయగా, తర్వాతి స్థానాల్లో గుజరాత్(రూ.605.3కోట్లు), తమిళనాడు(రూ.460.8కోట్లు), మహారాష్ట్ర(రూ.431.34కోట్లు), పంజాబ్(రూ.311.8కోట్లు) మొదలైన రాష్ట్రాలు ఉన్నాయి.


Similar News