డాక్టర్.. స్టూడెంట్.. సీనియర్ లీడర్.. హుజురాబాద్‌ పీఠం ఎవరిది?

by  |
డాక్టర్.. స్టూడెంట్.. సీనియర్ లీడర్..  హుజురాబాద్‌ పీఠం ఎవరిది?
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: ఒకరు రాజకీయాల్లో తలపండిన నాయకుడు.. మరోకరు ఎంబీబీస్ డాక్టర్.. ఇంకొకరు రాజనీతి పరిశోధనలో స్టూడెంట్. రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన హుజురాబాద్ ఉప ఎన్నికల్లో రసవత్తర పోరు సాగుతోంది. ఈ ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు ముగ్గురూ.. ముగ్గురే అన్నట్టుగా ఉంది. ఇప్పటికి ఆరు సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు మంత్రిగా పని చేసి అనుభవం గడించిన ఈటల రాజేందర్ తో తలపడుతున్న ప్రత్యర్థులు ఇద్దరూ కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి తొలిసారి అడుగు పెట్టిన వారే.

ఈటల ప్రస్థానం…

2002లో ఉద్యమ ప్రస్థానంలోకి అడుగుపెట్టిన ఈటల రాజేందర్.. టీఆర్‌ఎస్‌తో మమేకమై పనిచేశారు. 2004 నుండి జనరల్, ఉప ఎన్నికల్లో ఆరు సార్లు కమలాపూర్, హుజురాబాద్ నియోజకవర్గాల నుండి ప్రాతినిధ్యం వహించారు. నియోజకవర్గంపై తిరుగులేని పట్టున్న ఈటల మరోసారి ప్రజాక్షేత్రంలో తన పట్టు నిలుపుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఇందుకోసం నియోజకవర్గం అంతా కలియ తిరుగుతూ ఈటల తన ప్రభావాన్ని తగ్గించుకోకుండా పావులు కదుపుతున్నారు. ఓటు బ్యాంకు ఎక్కడ ఉంటుంది, ఏ ఓటర్లను ఎలా మల్చుకోవాలి అన్న విషయంపై ప్రాక్టికల్ గా తెలిసిన రాజేందర్.. ప్రత్యర్థుల ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ముందుకు సాగుతున్నారు. ఐదు నెలలకు పైగా నియోజకవర్గంలో ప్రచారం చేస్తూ ఏడోసారి చట్ట సభలోకి అడుగు పెట్టాలన్న యోచనతో స్కెచ్ లు వేస్తున్నారు. బీజేపీ తరుపున పోటీ చేస్తున్న ఈటల.. జాతీయ పార్టీ బలం తనకు మరింత తోడవుతుందని అంచనా వేస్తున్నారు.

ఉద్యమ ప్రస్థానం నుండి...

ఉస్మానియా వేదికగా ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్న టీఆర్‌ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ పీజీ, ఎల్ ఎల్ బీ పూర్తి చేసి రాజనీతి శాస్త్రంలో పీహెచ్ డీ స్టూడెంట్ గా కొనసాగుతున్నారు. అనూహ్యంగా హుజురాబాద్ లో ఉప ఎన్నికలు రావడంతో ప్రజా క్షేత్రంలో తన భవిష్యత్తును పరీక్షించుకుంటున్నారు. వీణవంక మండలంకు చెందిన గెల్లు శ్రీనివాస్ ఉన్నత చదువుల కోసం హైదరాబాద్ లోనే చాలా కాలంగా ఉంటున్నారు. అయితే గత కొంతకాలంగా సైలెంట్ గా వర్క్ చేసుకుంటూ నియోజకవర్గంలో తనకంటూ క్యాడర్ ను కొంత తయారు చేసుకున్నారు. నియోజకవర్గంలో బలంగా ఉన్న ఈటల రాజేందర్ ను ఓడించాలని తహతహలాడుతున్నారు. కొంతకాలంగా ఈటలకు, గెల్లుకు మధ్య అభిప్రాయ బేధాలు ఉండడంతో గెల్లు అధినాయకత్వం అండదండలతో పార్టీలో కొనసాగుతున్నారు. తన ఇమేజ్ కన్నా పార్టీ ఇమేజ్ పైనే ఎక్కువగా ఆధారపడ్డారు. నియోజకవర్గంలో బీసీ కార్డును ఉపయోగించి సక్సెస్ అయ్యేందుకు పావులు కదుపుతున్నారు.

డాక్టర్ సాబ్ ఎంట్రీ…

కరీంనగర్‌లో ఎంబీబీఎస్ పూర్తి చేసిన బల్మూరి వెంకట్ కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఫస్ట్ టైం ఎంట్రీ ఇచ్చారు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేస్తున్న వెంకట్ స్పీచ్ తో మాత్రం ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆలస్యంగా నియోజకవర్గంలోకి అడుగుపెట్టినప్పటికీ పార్టీ బలంతో పాటు ప్రజల్లోకి చొచ్చుకుపోతూ తనకు అనుకూలంగా మల్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు హుజురాబాద్ తో ఉన్న అనుబంధాలను ఆసరాగా చేసుకుని ముందుకు సాగుతున్నారు. గ్రౌండ్ లెవల్ పాలి’ట్రిక్స్‘పై పట్టు పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్ది ఇమేజ్ తోడవుతుందని అంచనా వేస్తున్నారు.

ఇద్దరూ విద్యార్థి నాయకులే...

టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఇద్దరూ కూడా విద్యార్థి విభాగాల రాష్ట్ర అధ్యక్షులే కావడం విశేషం. టీఆర్‌ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న గెల్లు శ్రీనివాస్, ఎన్ ఎస్ యూ ఐ రాష్ట్ర అధ్యక్షునిగా పని చేస్తున్న బల్మూరి వెంకట్ లు ఇద్దరు ఒకేసారి బరిలోకి దిగడం ఈ ఎన్నికల్లో హైలెట్. సాధారణంగా రాష్ట్ర స్థాయిలో కీలక బాధ్యతల్లో ఉన్న నేతలు ఒకే చోట ప్రత్యర్థులుగా పోటీ చేయడం అత్యంత అరుదుగా కనిపిస్తుంది. హుజురాబాద్ బై పోల్ లో కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పార్టీల స్టూడెంట్ వింగ్స్ కు రాష్ట్ర అధ్యక్షులు కావడం విశేషం. బల్మూరి వెంకట్ ప్రజల నాడి చూసి రోగాన్ని నయం చేసే ఎంబీబీఎస్ డాక్టర్ అయితే.. రాజనీతి శాస్త్రంలో రీసెర్చ్ చేసి డాక్టరేట్ పట్టా కోసం విద్యార్థిగా కొనసాగుతున్నారు గెల్లు శ్రీనివాస్.

ఇద్దరు బీసీ సామాజిక వర్గాలకు చెందిన అభ్యర్థులు కాగా, ఒకరు ఫార్వర్డ్ క్యాస్ట్ కు చెందిన వారు. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ఈటల రాజేందర్ బీజేపీ అభ్యర్థిగా.. యాదవ సామాజిక వర్గానికి చెందిన గెల్లు శ్రీనివాస్ టీఆర్‌ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. వీరిద్దరూ బీసీ వర్గాలకు చెందిన వారే కావడం గమనార్హం. కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ వెలమ సామాజిక వర్గానికి చెందిన ఫార్వర్డ్ క్యాస్ట్ అభ్యర్థి.


Next Story

Most Viewed