డేటా సెంటర్ల సామర్థ్యాన్ని పెంచేందుకు ఎయిర్‌టెల్ రూ. 5 వేల కోట్ల పెట్టుబడులు

by  |
డేటా సెంటర్ల సామర్థ్యాన్ని పెంచేందుకు ఎయిర్‌టెల్ రూ. 5 వేల కోట్ల పెట్టుబడులు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ అనుబంధ సంస్థ నెక్స్‌ట్రా గురువారం తన డేటా సెంటర్ సామర్థ్యం కోసం రూ. 5,000 కోట్ల పెట్టుబడులను ప్రకటించింది. 2025 నాటికి డేటా సెంటర్ల సామర్థ్యాన్ని మూడు రెట్లు పెంచే లక్ష్యాన్ని నిర్దేశించినట్టు తెలిపింది. ఇందులో భాగంగా కంపెనీ 7 హైపర్‌స్కేల్ క్యాంపస్‌లను ఏర్పాటు చేస్తుందని, ప్రస్తుతం 35 శాతం ఉన్న డేటా సెంటర్లలోని గ్రీన్ ఎనర్జీ వాటాను 50 శాతానికి పెంచనున్నట్టు పేర్కొంది. ఈ విస్తరణ ప్రక్రియతో కీలక మెట్రో నగరాల్లో కొత్త డేటా సెంటర్ పార్కులను ఏర్పాటు చేయనున్నారు. పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని కంపెనీ వెల్లడించింది. ‘తాజా పెట్టుబడులకు సంబంధించి కొన్ని పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. దేశవ్యాప్తంగా 70 నగరాల్లో డేటా సెంటర్లతో కొత్త లక్ష్యాలను చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నామని’ ఎయిర్‌టెల్ వ్యాపార విభాగం డైరెక్టర్, సీఈఓ అజయ్ చిత్కర చెప్పారు. ప్రస్తుతం నెక్స్‌ట్రా సంస్థ 10 పెద్ద డేటా సెంటర్లు, 120కి పైగా ఎడ్జ్ డేటా సెంటర్లను నిర్వహిస్తోంది. అంతేకాకుండా రానున్న 5-6 నెలల్లోగా ఇప్పుడున్న డేటా సెంటర్లలో 40 మెగావాట్ల సామర్థ్యాన్ని అదనంగా జోడించాలని భావిస్తోంది.


Next Story

Most Viewed