మహబూబ్‌‌నగర్‌లో ఎయిర్‌పోర్ట్.. ఎప్పుడు?

by  |
మహబూబ్‌‌నగర్‌లో ఎయిర్‌పోర్ట్.. ఎప్పుడు?
X

దిశ ప్రతినిధి, మహబూబ్‌‌నగర్‌: జిల్లాలో రాష్ర్ట ప్రభుత్వం ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేయబోతున్నదన్న ప్రకటన వెలువడటంతో ఆ జిల్లా వాసులు సంతోషం వ్యక్తం చేశారు. దేవరకద్ర మండలం గుడిబండలో దీనిని నిర్మిస్తారనే వార్తలు రావడంతో ఒక్కసారిగా అక్కడి భూములకు రెక్కలొచ్చాయి. ఇదంతా మూడేండ్ల క్రితం ముచ్చట. అసలు ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేస్తారా? లేదా? ఎక్కడ ఏర్పాటు చేస్తారు? అనే ప్రశ్నలు ప్రజల్లో మొన్నటి వరకు అలాగే మిగిలిపోయాయి. ఇదే సమయంలో పది రోజుల క్రితం అధికారులు మళ్లీ పలు ప్రాంతాల్లో స్థల పరిశీలన చేయడంతో తమ ప్రశ్నలకు ఈ సారైనా సమాధానం దొరకుతుందేమోనని అనుకుంటున్నారు జిల్లా వాసులు.

సరిగ్గా మూడేండ్ల క్రితం రాష్ట్రంలో 6 విమానాశ్రయాలు ఏర్పాటు చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో మహబూబ్‌నగర్ జిల్లాలో ఒకటి ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటన రావడంతో అక్కడి ప్రజల్లో ఆనందం వెల్లివిరిసింది. మహబూబ్‌‌నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం అడ్డాకుల మండలం గుడిబండ గ్రామంలో ఏవియేషన్ అధికారులు భూమిని పరిశీలించారు. ఇదే నియోజకవర్గంలోని హజిలాపూర్, చౌదర్‌పల్లి పరిసరాల్లోనూ భూములు పరిశీలించారు. అప్పట్లో ఈ రెండు స్థలాల్లో గుడిబండ గ్రామమే అనవైన స్థలంగా అధికారులు భావిస్తున్నట్టు ప్రచారం జరిగింది. దీనికి తోడుగా నాడు వచ్చిన ఏవియేషన్ అధికారులు తమ పర్యటన అనంతరం మంత్రి కేటీఆర్‌తో సైతం సమావేశం కావడంతో ఇక ఎయిర్ పోర్టు రావడం కన్ఫామ్ అయిందని అందరూ భావించారు. కానీ మూడేండ్లు దాటినా ముందడుగు పడలేదు.

ఏర్పాటు ఎక్కడ?

ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు సుమారు 500 ఎకరాలు అవసరం అవుతుందని ఏవియేషన్ అధికారులు గతంలో చెప్పారు. దానికి గుడి బండ అనువైన స్థలమని గుర్తించారు. ఈ గ్రామ పరిసరాల్లో సుమారు 200 ఎకరాల భూమిని గుర్తించి నివేదికలు తయారు చేశారు. ఇక్కడ రెండు చోట్ల హైటెన్షన్ వైర్లు ఉన్న నేపథ్యంలో వాటిని తొలగిస్తే ఇక్కడ విమానాశ్రయం ఏర్పా‌టుకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని అధికారులు తెలిపారు. అదే సమయంలో దేవరకద్ర మండలంలోని హజిలాపూర్, చౌదర్‌పల్లిలోనూ అధికారులు పర్యటించి స్థలాలు పరిశీలించారు. ఇటీవల పది రోజుల క్రితం మరోమారు అధికారులు ఈ ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సారి నేరుగా చౌదర్‌పల్లి, హాజిలాపూర్ ప్రాంతాల్లో స్థలాన్ని మరోసారి పరిశీలించి వివరాలు సేకరించారు. దేవరకద్ర మండల శివారులోనూ పర్యటించి సాధ్యాసాధ్యాలు పరిశీలించారు. ఇక్కడ ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు 500 ఎకరాలు అవసరముండగా 216 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా మరో 284 ఎకరాలను ప్రైవేటు వ్యక్తుల నుంచి సేకరించాలి. ఈ ప్రాంతంతో పాటు ముసాపేట, భూత్పూరు మండలంలోనూ అనుకూలంగా ఉన్న ప్రదేశాలనూ అధికారులు పరిశీలించారు. రావులపల్లి వద్ద హైటేన్షన్ తీగలు, వాగులు, గుట్టలు ఉన్నాయని గురించారు. అనంతరం మూసాపేటలోని వేముల, తుంకీనిపూర్, చక్రపూర్, కనకాపూర్ శివారులో 474 ఎకరాల భూమిని పరిశీలించి వెళ్లిపోయారు.

జాతీయ రహదారి సౌలభ్యం కోసమేనా?

గతంలో పరిశీలించిన గుడిబండను అధికారులు ఈ సారి పరిశీలనలోకి తీసుకోకపోవడంతో జాతీయ రహదారికి సమీపంలో ఉన్న ప్రదేశాలనే అధికారులు పరిశీలిస్తున్నట్టు అర్థమవుతోంది. ఇటు దేవరక్రద, చౌదర్‌పల్లి, హజిలాపూర్‌ గ్రామాలు జాతీయ రహదారికి సమీపంలో ఉండడం కలిసివచ్చే అంశంగా చెప్పాలి. అలాగే ప్రభుత్వ భూమి సైతం అందుబాటులో ఉండటం వల్ల ఇక్కడ పెద్దగా భూసేకరణ సైతం అవసరం అయ్యే అవకాశం లేదు. ఈ ప్రాంతానికి అటు జాతీయ రహదారి 44తో పాటు హైదరాబాద్-రాయిచూర్ ప్రధాన రహదారి కూడా సమీపంలో ఉన్నాయి. కానీ అధికారులు మాత్రం ఏ ప్రాంతాలను పరిగణలోకి తీసుకుంటారనే విషయం ఇంకా సస్పెన్స్‌ కొనసాగుతున్నది.

వాలిపోయిన రియల్టర్లు

అధికారులు స్థలాలను పరిశీస్తుండటంతో రియర్టర్లు గ్రామాల్లో వాలిపోయారు. మూడేండ్లుగా అధికారులు వస్తూ పోతూ ఉండటంతో ఈ ప్రాంతంలో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. గతంలో ఎకరాకు రూ.6 నుంచి 10 లక్షలు ఉండగా.. ప్రస్తుతం రూ.20 నుంచి 50లక్షల వరకు పలుకుతున్నాయి.



Next Story