క్రమంగా విస్తరిస్తున్న ఏఐఎంఐఎం

by  |
aimim
X

ఒకప్పుడు ఎంఐఎంకు హైదరాబాద్ నగరం లేదా తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన రాజకీయ పార్టీగానే గుర్తింపు ఉండేది. ఇప్పుడు అది తెలంగాణ సరిహద్దులు దాటుకుని ఆంధ్రప్రదేశ్, కర్నాటక, మహారాష్ట్ర, బిహార్ రాష్ట్రాలకు విస్తరించింది. సింగిల్ డిజిట్‌కే పరిమితమైన ఆ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య ఇప్పుడు డబుల్ డిజిట్‌కు వెళ్లింది. ఇతర రాష్ట్రాల్లో ఎలాంటి పునాది లేకపోయినప్పటికీ స్థానిక సంస్థలు మొదలుకుని అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల వరకూ పోటీ చేస్తోంది.

దిశ, తెలంగాణ బ్యూరో: ఆల్​ ఇండియా మజ్లిస్​ ఎ ఇత్తేహాదుల్​ ముస్లిమీన్​ (ఏఐఎంఐఎం) జాతీయ పార్టీగా గుర్తింపు పొందే దిశగా అడుగులు వేస్తోంది. తాజాగా జరిగిన బిహార్ ఎన్నికల​లోనూ ఐదుగురు ఎమ్మెల్యేలను గెలిపించుకుంది. ఆ పక్కనే ఉన్న పశ్చిమబెంగాల్‌లో వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేయాలనుకుంటోంది. ఉత్తరప్రదేశ్​లోనూ పోటీకి సిద్ధమవుతోంది. ఏ మాత్రం ఉనికి లేని లేని రాష్ట్రాల్లోనూ మజ్లిస్ గెలవడం చాలా మంది రాజకీయ పండితులను ఆశ్చర్యపరిచింది. బీజేపీ హిందూ ఓట్లను ఏకం చేయడంపై దృష్టి పెట్టింది. మజ్లిస్​ ముస్లిం ఓట్లపై దృష్టి పెట్టి బలం పెంచుకునే ప్రయత్నం చేస్తోంది.

ఇంతకాలం ముస్లింల ఓట్లన్నీ కాంగ్రెస్‌వైపే అనే అభిప్రాయం ఉంండేది. మజ్లిస్ దాన్ని పటాపంచలు చేస్తోంది. ముస్లిం ప్రజలకు మజ్లిస్ మాత్రమే ప్రత్యామ్నాయం అనే నూతన ఆలోచనకు బీజం వేస్తోంది. కాంగ్రెస్‌ బలహీనపడడం ద్వారా ఆ పార్టీకి పడే ముస్లిం ఓట్లు మజ్లిస్​కు కలిసొస్తున్నాయి. ముస్లిం ఓటర్లకు మాత్రమే మజ్లిస్ పరిమితం అనే అభిప్రాయం స్థానంలో సెక్యులర్ ముద్ర కోసం అసదుద్దీన్ ఒవైసీ ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో దళితవాద పార్టీలతో పొత్తు పెట్టుకున్నారు. పాంథర్స్ రిపబ్లికన్ పార్టీతో కలిసి పోటీ చేశారు. దళిత పార్టీలతో పొత్తుకు సిద్ధంగా ఉన్నామని ఒవైసీ బహిరంగంగానే ప్రకటించారు.

తమది ముస్లింల పార్టీ మాత్రమే కాదన్న విశ్వాసాన్ని కలిగించేలా ముస్లిమేతరులకు కూడా పోటీ చేయడానికి అవకాశాలు కల్పించారు. మహారాష్ట్రలో ప్రస్తుతం ఔరంగాబాద్ సెంట్రల్, ముంబాయిలోని బైకుల్లా అసెంబ్లీ నియోజకవర్గాల్లో మజ్లిస్ ప్రాతినిధ్యం వహిస్తోంది. ఔరంగాబాద్ మున్సిపల్ కార్పొరేషన్​లో 113 డివిజన్లకుగాను 53 చోట్ల పోటీచేసి 25 చోట్ల గెలిచింది. 12 చోట్ల ముస్లిమేతర అభ్యర్థులను నిలబెట్టగా ఐదుగురు గెలిచారు. నాందేడ్ మున్సిపాలిటీలోనూ 11 మంది కార్పొరేటర్లను గెలిపించుకుంది. అప్పటికే కర్నాటకలోని బీదర్, బసవకల్యాణ్ అసెంబ్లీ ఎన్నికలకు పోటీచేసినా గెలవలేకపోయింది. ప్రస్తుతం జీహెచ్ఎంసీలో సైతం 44 మంది కార్పొరేటర్లలో పది మంది ముస్లిమేతరులే ఉన్నారు.

ఐదున్నర దశాబ్దాలుగా
నిజాం కాలంలో ఉనికిలోకి వచ్చిన మజ్లిస్ పార్టీ 1948లో సర్దార్ పటేల్ పోలీసు చర్యతో నిర్వీర్యమైపోయింది. 1950వ దశకం చివరలో సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ తండ్రి వాహెద్​ ఒవైసీ మళ్లీ పునరుద్ధరించారు. హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల నుంచి మొదలైన రాజకీయ ప్రస్థానం అసెంబ్లీ, పార్లమెంటు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడం దాకా వచ్చింది. అసదుద్దీన్ ఒవైసీ పగ్గాలు చేపట్టిన తర్వాత ఇతర రాష్ట్రాలకూ వ్యాపిస్తోంది. ఇకపై అన్ని రాష్ట్రాల్లోనూ పోటీ చేస్తామని, ఇందుకు ఎవరి అనుమతీ అవసరం లేదని రెండు రోజుల క్రితం స్వయంగా ఆయనే ప్రకటించారు.

నగరంలో మజ్లిస్​ ఐదున్నర దశాబ్దాల కాలంలో ప్రతీ ఎన్నికల్లో గెలుస్తూనే ఉంది. పాతబస్తీలోని మున్సిపల్ డివిజన్లు, అసెంబ్లీ నియోజకవర్గాల్లో మజ్లిస్ తప్ప మరే పార్టీ గెలవడం అసాధ్యం అనే అభిప్రాయాన్ని కలిగించడంలో సక్సెస్ అయింది. హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో మూడున్నర దశాబ్దాలుగా మజ్లిస్ పార్టీదే గెలుపు. ఆ పార్టీ అధ్యక్షుడిగా సలావుద్దీన్ ఒవైసీ ఉన్నంతకాలం వరుసగా ఆరుసార్లు ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత అసదుద్దీన్ ఒవైసీ నాలుగుసార్లు గెలిచారు. రాష్ట్రంలో ముస్లిం జనసాంద్రత ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో పోటీ చేయడం ద్వారా ఇతర పార్టీలకు పడే ఓట్లను చీల్చడంలో మజ్లిస్ ఒక మేరకు విజయం సాధించింది. పరోక్షంగా సహకారం అందిస్తున్న పార్టీ విజయానికి కారణమవుతోంది.

కుటుంబ పార్టీగానే
అన్ని ప్రాంతీయ పార్టీల తరహాలోనే మజ్లిస్ కూడా కుటుంబ పార్టీయే. మొదట వాహెద్ ఒవైసీ నేతృత్వంలోనూ, ఆ తర్వాత ఆయన కుమారుడు సలావుద్దీన్ ఒవైసీ అధ్యక్షతనా కొనసాగింది. ఆయన తదనంతరం అసదుద్దీన్ ఒవైసీ అధ్యక్షతన కొనసాగుతోంది. ఇప్పుడు పార్టీలో ఆయన, సోదరుడు అక్బరుద్దీన్ తప్ప నాయకులే లేరన్నది బహిరంగ రహస్యం. ముస్లిం ఓటు బ్యాంకును చేజారిపోకుండా చూసుకోవడంలో, పార్టీని నడిపించడంలో అన్నదమ్ములదే సర్వాధికారం. బయటవారికి పార్టీ పగ్గాలు అప్పజెప్పే అవకాశమే లేకుండా పోయింది. ముస్లిమేతరులకు పోటీచేసే అవకాశం ఇస్తున్నా, ప్రధాన ఓటు బ్యాంకు మాత్రం ముస్లింలే.

1962లో జరిగిన ఎన్నికలతో ఒక్క సభ్యుడితో అసెంబ్లీలోకి అడుగుపెట్టింది మొదలు ఆ తర్వాత ప్రతీ ఎన్నికల్లోనూ మజ్లిస్ తన ఎమ్మెల్యేలను సభలోకి పంపుతూనే ఉంది. ప్రస్తుత సభలో ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. పదేళ్ల క్రితం ఎమ్మెల్సీలను కూడా గెల్చుకుని మండలిలోకి కూడా అడుగుపెట్టింది. సమైక్య రాష్ట్రంలోనే రాష్ట్రస్థాయి రాజకీయ పార్టీగా గుర్తింపు పొందిన మజ్లిస్, ఆ తర్వాత మహారాష్ట్రలోనూ ఎమ్మెల్యేలను గెల్చుకుని అక్కడ కూడా గుర్తింపు పొందింది. చివరకు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన మజ్లిస్ పార్టీకి కామన్ సింబల్ కూడా దక్కింది. స్థానిక సంస్థల ఎన్నికల మొదలు పార్లమెంటు ఎన్నికల వరకు ఒకే గుర్తుపై పోటీచేసే వెసులుబాటు లభించింది.

అన్న లిబరల్… తమ్ముడు వైలెంట్
ముస్లిం పార్టీగా ముద్ర పడిన మజ్లిస్‌కు సెక్యులర్ గుర్తింపు తీసుకురావడానికి అసదుద్దీన్​ యత్నిస్తున్నారు. అన్ని రాష్ట్రాల్లోని వివిధ పార్టీలకు అందుబాటులో ఉంటూ లిబరల్ నేతగా గుర్తింపు పొందారు. సెక్యులర్ పార్టీ అనే నినాదాన్ని మొత్తం దేశానికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగమే దళితులను కలుపుకుపోయే ప్రయత్నం. ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ దళిత పార్టీల మద్దతుతో పోటీ చేయాలనుకుంటోంది. సెక్యులర్ ముద్రను జాతీయ స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది.

అసద్ సోదరుడు అక్బరుద్దీన్ తీరు మాత్రం భిన్నంగా ఉంటుంది. సలావుద్దీన్ ఒవైసీ తరహాలో రోమాలు నిక్కబొడుచుకునే తీరులో ప్రసంగం చేయడంలో దిట్ట. రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడం అక్బర్ ప్రత్యేకత. గతంలో అక్బరుద్దీన్ చేసిన ఒక ప్రకటన సంచలనంగా మారింది. ఇప్పటికీ ఆయనపై కేసు కొనసాగుతూనే ఉంది. 15 నిమిషాలు పోలీసులు పక్కకు జరిగితే సత్తా ఏంటో చూపిస్తామంటూ బహిరంగంగానే వ్యాఖ్యానించారు. అన్న సెక్యులర్ గుర్తింపు కోసం పాకులాడుతూ ఉంటే తమ్ముడు ముస్లిం ఓటు బ్యాంకు చేజారిపోకుండా వ్యవహరిస్తున్నారు. అన్న జాతీయస్థాయిలో ఫోకస్ పెడితే తమ్ముడు హైదరాబాద్, తెలంగాణపై దృష్టి సారించారు.



Next Story