అత్తతో ఫ్రెండ్‌ షిప్.. కోడలితో డిస్టెన్స్

by  |
అత్తతో ఫ్రెండ్‌ షిప్.. కోడలితో డిస్టెన్స్
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో చెరగని ముద్ర వేసిన ఆ నలుగురు నాయకులు రాజకీయాల్లో వైవిధ్యమైన పాత్రను పోషించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన వీరు చట్టసభలకు కూడా ప్రాతినిథ్యం వహించారు. ఏఐసీసీలో కీలక భూమిక పోషించిన ఈ నలుగురు నాయకులపై అధిష్టానం శీతకన్నే వేసింది.

అత్త హయాంలో హవా..

నెహ్రూ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న ఐరన్ లేడీ ఇందిరా గాంధీతో కరీంనగర్‌కు చెందిన పీవీ నరసింహరావు, జువ్వాడి చొక్కారు, మెన్నేని సత్యనారాయణ రావు, జి.వెంకటస్వామి (కాకా)లు అత్యంత సన్నిహితులుగా మెదిలారు. భారత ప్రదానిగా బాధ్యతలు నిర్వర్తించిన పీవీ నరసింహరావు ఇందిర కెబినెట్‌లో పలు మంత్రిత్వ శాఖలు నిర్వర్తించారు. విధాన నిర్ణయాల్లో ఇందిర వెన్నంటి నడిచిన పీవీ నరసింహరావు సోనియా గాంధీ బాధ్యతలు చేపట్టిన తర్వాత అణిచివేతకు గురయ్యారు. చివరకు ఆయన పార్థివ దేహాన్ని కూడా ఏఐసీసీ కార్యాలయానికి రానివ్వలేదు. భారత ప్రధానిగా పని చేసిన వారందరికీ ఢిల్లీలో స్మృతి వనాలు ఉన్నా పీవీకి లేకపోవడం గమనార్హం. సోనియా గాంధీ హయాంలో పీవీని ఎంత వివక్షకు గురి చేశారో ఈ ఘటనలే ప్రత్యక్ష ఉదాహరణ.

దేశ వ్యాప్తంగా కాకాగా సుపరిచుతుడైన జి.వెంకటస్వామి పెద్దపల్లి ఎంపీగా పనిచేశారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన ఆయన చివరి వరకూ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు. కార్మిక నాయకునిగా ఎదిగిన వెంకటస్వామి ఇందిరాగాంధీ అప్పటి నుంచి జాతీయ రాజకీయాల్లో ఉన్నారు. సోనియా బాధ్యతలు చేపట్టక ముందు పార్టీలో తానే అత్యంత సీనియర్ నని, ఏఐసీసీ అధ్యక్ష్య బాధ్యతలకు తానే అర్హుడునని ప్రకటించారు. రాష్ట్రపతి కావాలని ఆకాంక్షించిన ఆయనకు మాత్రం పార్టీ అవకాశం ఇచ్చేందుకు సాహసించలేదు.

ఎంపీగా, ఎమ్మెల్యేగా చట్టసభలకు ప్రాతినిథ్యం వహించిన జువ్వాడి చొక్కారావు కూడా ఇందిరాగాంధీతో సన్నిహితంగా ఉండే వారు. వ్యవసాయ రంగంపై మక్కువ ఉన్న చొక్కారావుపై ప్రత్యేక అభిమానం చూపేవారు ఇందిరాగాంధీ. అయితే, ఆయన మరణానంతరం ఏఐసీసీ మాత్రం గుర్తింపు ఇచ్చిన దాఖలాలు లేవు. రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేసిన చొక్కారావు ఆదర్శాలను భావితరాలకు అందించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించకపోవడం విస్మయం కల్గిస్తోంది. నీతి, నిజాయితీలకు నిలువుటద్దంగా చెప్పుకునే చొక్కారావును కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆయన మరణానంతరం అంతగా ప్రాధాన్యత కల్పించ లేదన్న ఆవేదన చాలా మందిలో వ్యక్తం అవుతోంది.

మెన్నేని సత్యనారాయణ రావు (ఎమ్మెస్సార్) ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా ఐదు రాష్ట్రాలకు ఇంచార్జీగా వ్యవహరించారు. నేడు ఏఐసీసీలో కీలక భూమిక పోషిస్తున్న గులాం నబీ ఆజాద్ వంటి నాయకులు ఎమ్మెస్సార్ హయాంలో యూత్ కాంగ్రెస్‌లో తిరిగే వారని కాంగ్రెస్ శ్రేణులు చెప్తుంటాయి. ఇందిరాగాంధీ చీఫ్‌గా ఉన్న కాలంలో కాంగ్రెస్‌లో కీలకంగా వ్యవహరించిన ఎమ్మెస్సార్ తనకు గవర్నర్‌గా పనిచేయాలని ఉందని బాహాటంగానే ప్రకటించారు. ఏఐసీసీ చీఫ్‌గా ఉన్న సోనియా గాంధీ మాత్రం ఎమ్మెస్సార్ కు ఎలాంటి ప్రాధాన్యం కల్పించకపోవడం గమనార్హం.

Next Story

Most Viewed