కరోనా వైరస్ స్క్రీనింగ్ ఇక నిరంతర ప్రక్రియ!

by  |
కరోనా వైరస్ స్క్రీనింగ్ ఇక నిరంతర ప్రక్రియ!
X

– లాక్‌డౌన్ తర్వాత ‘ఆశా’ వర్కర్లకు బాధ్యతలు
– ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మినీ ఎక్స్‌రే మిషన్లు
– దైనందిన జీవితంలో వ్యక్తిగత శుభ్రత, ‘సోషల్ డెస్టెన్స్’ భాగం

దిశ, న్యూస్ బ్యూరో: కరోనా వైరస్ వ్యాప్తికి ఎన్ని చర్యలు తీసుకుంటున్నా దేశవ్యాప్తంగా కొత్త కేసులు పుట్టుకొస్తూనే ఉన్నాయి. వైరస్‌కు వ్యాక్సీన్ వినియోగంలోకి వచ్చిన తర్వాత కూడా దీని బాధ తప్పేలా లేదు. ఇకపైన వైరస్ స్క్రీనింగ్ నిరంతరం కొనసాగే ప్రక్రియగానే ఉండబోతున్నది. లాక్‌డౌన్ ముగిసిన తర్వాత కూడా ఈ ప్రక్రియ కొనసాగనుంది. ‘ఆశా’ వర్కర్లకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఈ బాధ్యతను అప్పగించనున్నట్లు సమాచారం. మిగిలిన రాష్ట్రాల్లో ఎలా ఉన్నా తెలంగాణలో మాత్రం వైరస్ స్క్రీనింగ్‌ను దీర్ఘకాలం పాటు కొనసాగించాలనే ఆలోచన ఉంది. రాష్ట్రంలో ఉన్న సుమారు 32 వేల మంది ‘ఆశా’ వర్కర్లకు ఇకపైన స్ర్క్రీనింగ్ బాధ్యతలు అప్పజెప్పాలని ప్రభుత్వం భావిస్తోన్నది. ప్రతీ వెయ్యి మందికి ఒకరు చొప్పున ‘ఆశా’ వర్కర్లకు బాధ్యతలు అప్పగించనున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అధికారి ఒకరు సూచనప్రాయంగా తెలిపారు.

అవకాశాలు లేకపోలేదని..

ప్రభుత్వం దీనిపై ఇంకా విధాన నిర్ణయం తీసుకోవాల్సి ఉందని పేర్కొన్నారు. కరోనా లక్షణాలు బైయటపడిన తర్వాత నేరుగా నిర్ధారణ పరీక్షలు నిర్వహించకుండా సమీపంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పంపి అక్కడ చెస్ట్ ఎక్స్‌రే ద్వారా ఏ మేరకు లక్షణాలు ఉన్నాయో పరిశీలించనున్నట్లు తెలిపారు. అవసరాన్నిబట్టి ఆ తర్వాతనే నిర్ధారణ పరీక్ష చేస్తామని, రిపోర్టుకు అనుగుణంగా తగిన చికిత్స ఉంటుందని పేర్కొన్నారు.

కరోనా లక్షణాలు లేకున్నా పాజిటివ్ నిర్ధారణ అవుతున్నందున తొలుత అనుకున్న ఇన్‌క్యుబేషన్ గడువు 14 రోజుల నుంచి 28 రోజులకు పెరిగిందని, భవిష్యత్తులో ఇది మరికొన్ని రోజులకు కూడా పొడిగించే అవకాశాలు లేకపోలేదని ఆ అధికారి పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పుడున్న ‘ఆశా’ వర్కర్ల సంఖ్య సరిపోదు కాబట్టి భవిష్యత్తులో కొత్తగా రిక్రూట్‌మెంట్ చేసుకోవాల్సి వస్తుందన్నారు. ప్రతీ వెయ్యి మందికి ఒకరు చొప్పున ఇంటింటికీ తిరిగి లక్షణాలున్నవారిని గుర్తిస్తారని పేర్కొన్నారు. ఆశా వర్కర్లు ఇప్పుడు సుమారు 60 రకాల సేవలు చేస్తున్నారని, వాటికి అదనంగా ఇప్పుడు కరోనా స్క్రీనింగ్ కూడా చేరుతుందన్నారు. దేశం మొత్తం మీద సుమారు 10 లక్షల మంది ‘ఆశా’ వర్కర్లు ఉన్నారు. జాతీయ హెల్త్ మిషన్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న వీరికి నిర్దిష్టంగా ఒక్కో సేవకు ఒక్కో రేటు చొప్పున కేంద్ర ప్రభుత్వం పారితోషికం చెల్లిస్తూ ఉంది. ఒక్కో ఆశా వర్కర్‌కు గరిష్ట స్థాయిలో ఐదు వేల రూపాయలకు మించి రావడంలేదు. ఇప్పుడు కొత్తగా ఈ పనిని కూడా అప్పగిస్తే వారికి అదనంగా ఏ మేరకు పారితోషికం ఇవ్వాలనేదానిపై ప్రభుత్వాలు విధివిధానాలను రూపొందించాల్సి ఉంది. ప్రస్తుతం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఎక్స్‌రే సౌకర్యం లేదు కాబట్టి మినీ ఎక్స్‌రే మిషన్లను ప్రభుత్వం కొనుగోలు చేయనున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అధికారి ఒకరు తెలిపారు.

పాటించాల్సిందేనని..

ఒకసారి వైరస్ ఉనికిలోకి వచ్చిన తర్వాత కొన్నేళ్ల వరకు దాని బాధ తప్పదని, ప్రస్తుతం మనం వాడుతున్న మాస్క్, వినియోగిస్తున్న శానిటైజర్, హ్యాండ్ వాష్ లాంటివి ఇకపైన కూడా వాడక తప్పదని సూచించారు. కరోనా కోసం కొత్తగా అలవాటు చేసుకున్న ‘సోషల్ డెస్టెన్స్’, వ్యక్తిగత పరిశుభ్రత ఇకపైన ఎప్పటికీ ఆచరించే ఒక దైనందిన క్రమశిక్షణగా పాటించాల్సిందేనని అన్నారు. అయితే బస్సులు, రైళ్ళు, సినిమాహాళ్ళు, ఫంక్షన్ హాళ్ళు తదితరాల దగ్గర సోషల్ డిస్టెన్స్ సాధ్యాసాధ్యాలపై ఆయన వివరణ ఇస్తూ, సమీప భవిష్యత్తులో కరోనా భయం వదలదని, మరికొంత కాలం దాకా ప్రభుత్వాలే దీన్ని నొక్కిచెప్పక తప్పదని అభిప్రాయపడ్డారు. లాక్‌డౌన్ మనకు మనంగా వైరస్ ఒకరి నుంచి మరొకరికి సోకకుండా తీసుకున్న జాగ్రత్త మాత్రమేనని, వైరస్ పూర్తిగా నిర్మూలించబడింది అనేంతవరకూ దానిబారిన పడే ప్రమాదం తప్పదని అన్నారు.

tags: Telangana, Corona, Screening, ASHA Workers, LockDown, Mini X-Ray, Primary Health Centre

Next Story