ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలి

by  |
ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలి
X

దిశ, తెలంగాణ బ్యూరో: అకాల వర్షాలను దృష్టిలో పెట్టుకుని ధాన్యం కొనుగోలులో వేగం పెంచాలని పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కేంద్రాల్లో ధాన్యం నిల్వలు పేరుకుపోకుండా కొనుగోళ్లు చేపట్టి ఎప్పటికప్పుడు రైస్ మిల్లులకు తరలించాలని సూచించారు. మిల్లర్లు ధాన్యాన్ని దిగుమతి చేసుకొన్న వెంటనే వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఆదేశించారు.

లారీలు, హమాలీల కొరత లేకుండా పౌరసరఫరా అధికారులు వ్యవసాయ, రెవెన్యూ, రవాణా, అధికారులతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. ఒకసారి తూకం వేసిన ధాన్యాన్ని రైసు మిల్లులకు తరలించిన తర్వాత అక్కడ తాలు పేరుతో తరుగు తీయడం చట్ట విరుద్ధమని పేర్కొన్నారు. ఈ విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండి రైతులకు నష్టం జరగకుండా చూడాలన్నారు. అకాల వర్షాల వల్ల కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడవకుండా అవసరమైన టార్ఫలిన్లు రైతులకు అందుబాటులో ఉండే విధంగా చూడాలని మార్కెటింగ్ అధికారులకు సూచించారు.

ఈ యాసంగిలో ధాన్యం కొనుగోలు కోసం రాష్ట్ర వ్యాప్తంగా 7,114 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని ప్రతిపాదించగా ఇప్పటి వరకు 5,884 కేంద్రాలను ప్రారంభించామని తెలిపారు. ఇప్పటి వరకు రెండు లక్షల మంది రైతుల నుండి రూ. 2,920 కోట్ల విలువచేసే 15.49 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని వివరించారు. ధాన్యం కొనుగోలు చేసిన 3 రోజుల్లోగా రైతుల బ్యాంక్ ఖాతాలో నగదు జమచేయాలని ఆదేశించారు.



Next Story

Most Viewed