ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో.. ట్విస్టులే ట్విస్టులు

by  |
CM-KCR114
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్న రెండు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల‌లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక ఉత్కంఠను రేపుతోంది. రెండు స్థానాలకు సంబంధించి పదుల సంఖ్యలో ఆశావాహులు ఉండడంతో అభ్యర్థుల ఎంపిక అధిష్టానానికి ఓ పరీక్షలా మారిందనే చెప్పాలి. శనివారం రాత్రి ఒక స్థానం సిట్టింగ్ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డికి, మరో స్థానం టీఆర్ఎస్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా ఉన్న బాద్మీ శివకుమార్‌కు సీట్లు ఖరారైనట్టు ప్రచారం జరిగింది.

అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటే తప్ప వీరు ఇరువురు రంగంలో ఉంటారని పార్టీ వర్గాలు భావించాయి. కానీ, ఆదివారం సాయంత్రానికి సీన్ ఒక్కసారిగా మారిపోయింది. ఒక స్థానం నుండి సిట్టింగ్ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి పేరే ప్రచారంలోకి రాగా, మరో స్థానం నుండి ప్రముఖ గాయకుడు సాయి చంద్ పేరు తెరమీదకు వచ్చింది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా సాయి చందు పేరును సూచించడంతో శివకుమార్‌కు బదులుగా రెండవ స్థానం నుండి పోటీ చేస్తారని అనధికారిక ప్రకటన విడుదలైంది. దాదాపుగా వీరు ఇరువురు రంగంలో ఉంటారు అనే ప్రచారం జరిగే లోపే మరో ఊహించని పరిణామం చోటు చేసుకుంది.

వారికే ఫోన్..

ఉమ్మడి పాలమూరు జిల్లాలో సిట్టింగ్ ఎమ్మెల్సీగా కొనసాగుతున్న కూసుకుంట్ల దామోదర్ రెడ్డి‌కి ఆదివారం రాత్రి సీఎం కార్యాలయం నుండి ఫోన్ వచ్చినట్లు సమాచారం. ఈ సమాచారం ప్రకారం ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్ దాఖలు చేయమని తెలియజేసినట్లు తెలిసింది. దామోదర్ రెడ్డి పోటీలో ఉంటారా..? లేక ఆయన కుమారుడిని పోటీలో నిలుపుతార అన్న అంశాన్ని దామోదర్ రెడ్డి నిర్ణయించుకునే‌లా పార్టీ అధిష్టానం సూచించినట్లు తెలిసింది. దీంతో దామోదర్ రెడ్డి సోమవారం నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

బరిలో మిగిలేదెవరో..?

రెండు ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి కసిరెడ్డి నారాయణరెడ్డి, దామోదర్ రెడ్డి, సాయి చందు‌లో ఎవరో ఒకరిని అధిష్టానం స్థానం తప్పించే అవకాశం ఉంది. అధికారికంగా పార్టీ అభ్యర్థులను సోమవారం సాయంత్రం లోపు గాని, మంగళవారం ఉదయం గాని ప్రకటించే అవకాశం ఉంది. దీనితో అభ్యర్థుల ఎంపిక అంశంపై పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ కొనసాగుతోంది.

epaper – MORNING EDITION (22-11-21) చదవండి

Next Story

Most Viewed