కార్పొరేషన్‌పై కన్ను.. త్వరలో వరంగల్‌కు ఆ నేతలు

by  |
కార్పొరేషన్‌పై కన్ను.. త్వరలో వరంగల్‌కు ఆ నేతలు
X

దిశ ప్రతినిధి, వ‌రంగ‌ల్: ఎమ్మెల్సీ, కార్పోరేష‌న్ ఎన్నిక‌లను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ పార్టీ వేగంగా స‌మాయ‌త్తమ‌వుతోంది. ఖ‌మ్మం, వ‌రంగ‌ల్‌ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో అనుస‌రించాల్సిన వ్యూహం, ప్రచారం, జ‌నంలోకి తీసుకెళ్లాల్సిన ప్రధాన అంశాల‌పై చ‌ర్చించేందుకు ప‌ది రోజుల క్రితం ఖ‌మ్మం పార్టీ కార్యాల‌యంలో స‌మావేశం నిర్వహించారు. ఈ స‌మావేశంలో ప‌లువురు ఏఐసీసీ నేత‌ల‌తో పాటు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవ‌హారాల ఇన్‌చార్జి మాణికం ఠాగూర్ సైతం పాల్గొన్నారు. ఈ స‌మావేశంలో వ‌రంగ‌ల్ అర్బన్, రూర‌ల్ జిల్లాల పార్టీ అధ్యక్షుడు నాయిని రాజేంద‌ర్‌రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్సీ కొండ మురళీధర్ రావు, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నమిండ్ల శ్రీనివాస్, తెలంగాణ ఉత్తర జిల్లాల కో-ఆర్డినేటర్ ఇనగాల వెంకట్రామిరెడ్డి, సీనియ‌ర్ నేత దొమ్మాటి సాంబయ్య, జిల్లా మైనారిటీ సెల్ చైర్మన్ మొహమ్మద్ ఆయుబ్ త‌దిత‌రులు పాల్గొన్నారు. స‌మావేశంలో సూచించిన అంశాల‌ను అమ‌లు చేయ‌డంపై నేత‌లంతా ఫోక‌స్ చేస్తున్నారు. స‌మ‌ష్టిగా ముందుకు క‌దులుతూ గ్రౌండ్ లెవ‌ల్‌లో పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టడం గ‌మ‌నార్హం.

డివిజ‌న్లకు క‌మిటీలు..

కార్పొరేష‌న్ ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో రెండు నెల‌ల కింద‌టే దాదాపు అన్ని డివిజ‌న్ల క‌మిటీల‌ను పూర్తి చేసింది. మిగిలిన నాలుగైదు డివిజ‌న్లకు కూడా క‌మిటీల‌ను ఏర్పాటు చేసి సైలెంట్‌గా త‌మ ప‌ని తాము చేసుకుపోతున్నట్లుగా కాంగ్రెస్ నేత‌లు చెబుతున్నారు. బూత్ క‌మిటీల‌ను ఏర్పాటు చేయడంలో నిమ‌గ్నమ‌య్యారు. వాస్తవానికి బూత్ క‌మిటీల‌ను కూడా గ‌తంలోనే చాలా వ‌ర‌కు పూర్తి చేసిన కొన్నింటిని స‌మీక్షిస్తున్నట్లుగా ఆ పార్టీ నేత‌లు చెబుతున్నారు. డివిజ‌న్ క‌మిటీల‌తో పాటు స‌గ‌టున ఒక్కో డివిజ‌న్‌లో 11 బూత్ క‌మిటీల‌ను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ప్రత్యేకంగా ప్రతీ డివిజ‌న్‌లో ఒక సోష‌ల్ మీడియా క‌మిటీ, మీడియా ఇన్‌చార్జి ఏర్పాటు చేస్తుండ‌డం గ‌మ‌నార్హం.

జిల్లాకు ఏఐసీసీ నేత‌లు..!

కార్పొరేష‌న్ ఎన్నిక‌ల‌పై ఏఐసీసీ నేత‌ల‌తో త్వర‌లోనే వ‌రంగ‌ల్‌లో స‌మావేశం ఉండ‌నుంది. వేలాది సంఖ్యలో కార్యక‌ర్తల‌తో స‌భ నిర్వహించాల‌ని కూడా కాంగ్రెస్ నేత‌లు యోచిస్తున్నారు. వాస్తవానికి ఈ నెల‌లో జిల్లాకు మాణికం ఠాగూర్‌తో పాటు ఇత‌ర కీల‌క నేత‌లు వ‌రంగ‌ల్‌లో ప‌ర్యటించాల్సి ఉండేది. అయితే రైతు నిర‌స‌న కార్యక్రమాలు చేప‌ట్టాల‌ని పార్టీ పిలుపునివ్వడంతో ముఖ్యనేత‌లు ఆ కార్యక్రమాల్లో బిజీబిజీగా ఉండ‌డంతో సాధ్యప‌డలేదు. దీంతో వాయిదా ప‌డిన‌ట్లు అయింది. కాంగ్రెస్ నేత‌లు చెబుతున్న ప్రకారం పార్లమెంట‌రీ స‌మావేశం అనంత‌రం పెద్ద ఎత్తున స‌భ నిర్వహించేందుకు ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. ఈలోగా ప్రభుత్వ, జీడ‌బ్ల్యూఎంసీ వైఫ‌ల్యాల‌ను ఎండ‌గ‌డుతూ పార్టీ వైపు జ‌నాలు చూసేలా వ్యూహాత్మక ధోర‌ణితో కాంగ్రెస్ ముందుకు సాగుతోంది.



Next Story