జోగిని రంగమ్మ ఇంట్లో భారీ చోరీ.. కాశీకి వెళ్లొచ్చేసరికి ఇళ్లు గుల్ల

by  |
Jogini Rangamma house
X

దిశ, సికింద్రాబాద్: ఓ మహిళ తీర్థయాత్రకు వెళ్లి వచ్చేసరికి ఇంట్లోని బీరువాలో ఉండాల్సిన 110 తులాల బంగారు ఆభరణాలు, నాలుగు లక్షల నగదు చోరీకి గురైన సంఘటన ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ రమేష్ వివరాల ప్రకారం.. మాణికేశ్వరీనగర్ బస్తీలో నివాసం ఉంటోన్న జోగిని రంగమ్మ గతంలో ఓ అమ్మాయిని దత్తత తీసుకొని పెంచుకుంది. ఇటీవల రంగమ్మ సమీప బంధువైన లక్ష్మణ్‌తో వివాహాన్ని జరిపించింది. ప్రస్తుతం వీరిద్దరు కూడా రంగమ్మ ఇంట్లోనే ఉంటున్నారు. అయితే, గతవారం రోజుల క్రితం జోగిని రంగమ్మ దైవ దర్శనం నిమిత్తం కాశీకి వెళ్లింది. ఆమె వెళ్లే సమయంలో ఆమె దత్తత తీసుకున్న కూతురు, ఆమె అల్లుడు లక్ష్మణ్ ఇంట్లోనే ఉన్నారు.

దీంతో వారికి తన వద్ద ఉన్న 90 తులాల బంగారు వడ్డాణం, 20 తులాల బంగారు గొలుసు, నాలుగు లక్షల నగదును బీరువాలో భద్రపరిచి వీటిని జాగ్రత్తగా చూడాలని చెప్పి వెళ్లింది. ఆమె తిరిగి మంగళవారం కాశీ నుంచి ఇంటికి తిరిగి వచ్చింది. ఈ క్రమంలో ఇంట్లోకెళ్లి బీరువా ఓపెన్ చేసి చూడగా నాలుగు లక్షల నగదుతో పాటు 110 బంగారు ఆభరణాలు కనిపించకపోవడంతో ఆందోళనకు గురైంది. ఆమె దత్తత తీసుకున్న కూతురు, అల్లుడు కూడా కనిపించకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు పోలీసులు పరారీలో ఉన్న లక్ష్మణ్ దంపతుల కోసం గాలిస్తున్నారు. కాగా, ఈ చోరీ వారిపనే అయి ఉంటుందని పోలీసులు సైతం ఓ నిర్ధారణకు వచ్చారు. ఈ మేరకు దర్యాప్తు వేగవంతం చేశారు.


Next Story

Most Viewed