బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు అనూహ్య పరిణామం.. ఎన్నికల వేళ కేసీఆర్‌కు తలనొప్పి!

by Disha Web Desk 2 |
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు అనూహ్య పరిణామం.. ఎన్నికల వేళ కేసీఆర్‌కు తలనొప్పి!
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో మరోసారి అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ కొట్టాలని గులాబీ బాస్, సీఎం కేసీఆర్ ఓ వైపు ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంటే మరోవైపు బీఆర్ఎస్ నేతలకు మాత్రం కొత్త కష్టాలు వచ్చిపడుతున్నాయి. అధికార బీఆర్ఎస్‌లో మెజార్టీ ఎమ్మెల్యేలు రెండో దఫా ఎన్నికయిన వారే ఉన్నారు. దీంతో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతకు తోడు ఎమ్మెల్యేల తీరు కొన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీని ఆందోళనకు గురి చేస్తోంది. దీంతో ఇటీవల జరిగిన బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలకు కేసీఆర్ కీలక ఆదేశాలు ఇచ్చారు. ప్రజల్లోకి వెళ్లకుండా పైపై ప్రచారాలు పక్కన పెట్టాలని, ఎన్నికల సమయానికి లోపాలను సరిదిద్దుకోవాలని హెచ్చరించారు. ఆయా జిల్లాల్లో కొంత మంది ఎమ్మెలకు ఎన్నిసార్లు సూచనలు చేసినా వారి తీరు మార్చుకోవడం లేదని సీఎం తలంటినట్లు వార్తలొచ్చాయి. ఇకనైనా తీరు మార్చుకుని ఎమ్మెల్యేలు ప్రజాక్షేత్రంలో విస్తృతంగా పర్యటనలు చేయాలని సూచించారు. అయితే, అధినేత ఆదేశాలతో గ్రామాల్లోకి వెళ్తున్న ఎమ్మెల్యేలకు ప్రజలనుంచి వస్తున్న వ్యతిరేకత సమస్యగా మారుతోంది. ప్రజలు వేస్తున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక కొంత మంది ఎమ్మెల్యేలు, నేతలు అసహనం ప్రదర్శించడం హాట్ టాపిక్ గా మారుతోంది.

నేతల ప్రస్టేషన్:

మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనేతలతా ప్రభుత్వ పథకాల ప్రచారంపై ఫోకస్ పెట్టాలని కేసీఆర్ ఆదేశించారు. ఎమ్మెల్యేలు అయితే నెలలో 21 రోజులు నియోజకవర్గంలోనే అందుబాటులో ఉంటూ పెండింగ్ పనులు చకచకా పూర్తి చేసుకోవాలని సూచించారు. చెప్పినట్లుగా తీరు మార్చుకోని ఎమ్మెల్యేల తోకలు కట్ చేస్తానని అలాంటి వారికి టికెట్లు ఇవ్వడం కష్టమే వార్నింగ్ ఇచ్చారు. దీంతో ప్రజాప్రతినిధులంతా గ్రామాల బాట పట్టాయి. అయితే ఇన్నాళ్లు తమ గోడు పట్టించుకోని నేతలంతా ఇప్పుడు గ్రామాల్లోకి వస్తుండటంతో పలు చోట్ల గులాబీ నేతలకు నిరసన వ్యక్తం అవుతోంది. ప్రభుత్వ పథకాలు అందడం లేదని, ఇచ్చిన హామీలు నెరవేరడం లేదని నిలదీస్తున్నారు. దీంతో ఏం సమాధానం చెప్పాలో తెలియక పలువురు ప్రజాప్రతినిధులు ప్రస్టేషన్‌కు లోనై నోరుపారేసుకుంటున్నారు.

తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సమ్మెకు దిగిన రేషన్ డీలర్లను సంబంధిత శాఖ మంత్రి గంగుల కమలాకర్ మీకు కమిషన్లు చాలవా? జీతాలు కావాల్నా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన తీరు విమర్శలకు దారి తీస్తోంది. న్యాయమైన డిమాండ్లను నెరవేర్చమని కోరితే మంత్రి తమను అవమానించేలా కమీషన్ల చాలవా అనడం ఎంతవరకు సబబు అని డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక కరీంనగర్ జిల్లా జమ్మికుంట రైతు దినోత్సవంలో భాగంగా రుణమాఫీ గురించి అడిగిన ఓ రైతుపై ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసిన తీరు వివాదాస్పదం అయింది. రైతు బంధు, పింఛన్లు, ఉచిత కరెంటు ఇస్తున్నాం.. సిగ్గులేకుండా రుణమాఫీ గురించి ఎలా అడుగుతున్నావ్ అంటూ సదరు రైతుపై కౌశిక్ రెడ్డి చిందులేసిన తీరు సర్వత్రా విమర్శలు వ్యక్తం అయ్యాయి. మహబూబాబాద్ గోప తండాలో అభివృద్ధి పనుల పరిశీలన నిమిత్తం వచ్చిన డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ ను ప్రశ్నించిన ఓ వృద్ధురాలిపై ఎమ్మెల్యే ఆగ్రహంతో మండిపోయారు. ఆమెకు పింఛన్ కట్ చేయాలని అధికారులను ఆదేశించారు.

ఇలాంటి వారు మనకు ఓటు వేయరని, ఇలాంటి వారు ఉన్న ఒకటే ఊడినా ఒకటే అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. మరో వ్యక్తి ప్రశ్నించగా అతడిపై కూడా ఎమ్మెల్యే గుస్సా అయ్యాడు. కేసీఆర్ డబ్బులు తీసుకుంటూ కేసీఆర్ ఇస్తున్న బియ్యం తీసుకుంటూ మళ్లీ ప్రశ్నిస్తారా అంటూ చిటపటలాడారు. గతంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు సైతం ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నాకు వ్యతిరేకంగా మాట్లాడే వేరే పార్టీ వారు కేసీఆర్ వేసిన రోడ్లపై నడవకూడదని, కేసీఆర్ ఇస్తున్న రైతు బంధు, కళ్యాణలక్ష్మి, ఇతర పథకాలు తీసుకోవాదన్ని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నం పెట్టేవారికి సున్నం పెడుతున్నారు.. నా సంగతి మీకు తెలియదు. అందర్నీ డ్యాన్స్ చేయిస్తా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన తీరు వైరల్ అయింది. వీరితో పాటు మరి కొంత మంది బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు సైతం ప్రశ్నిస్తున్న వారిపై నోరు పారేసుకోడవంం హాట్ టాపిక్ గా మారుతోంది.

కేసీఆర్‌కు తలనొప్పి వ్యవహారం:

అయితే క్షేత్రస్థాయిలో ప్రజావ్యతిరేకతను తగ్గించుకునేందుకు ప్రజలతో మమేకం కావాలని అధినేత కేసీఆర్ ఆదేశిస్తే అందుకు భిన్నంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు వ్యవహరించడం కారుపార్టీలో చర్చనీయాంశంగా మారుతోంది. ప్రజలు నిలదీస్తుంటే ప్రజల కోసం ప్రభుత్వం ఇచ్చిన హామీలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై సమాధానాలు చెప్పకుండా ఇలా చిందులు తొక్కడం వల్ల మొదటికే మోసం వస్తుందనే చర్చ జరుగుతోంది. కొండనాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిన చందంగా కేసీఆర్ పరిస్థితి తయారైందనే టాక్ వినిపిస్తోంది.


Next Story

Most Viewed