ఈ నెల 5న కాంగ్రెస్ మేనిఫెస్టో.. హైదరాబాద్‌లో మెగా ర్యాలీ

by Swamyn |
ఈ నెల 5న కాంగ్రెస్ మేనిఫెస్టో.. హైదరాబాద్‌లో మెగా ర్యాలీ
X

దిశ, నేషనల్ బ్యూరో: లోక్‌సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోను ఈ నెల 5న ప్రకటించనుంది. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం విడుదల చేయనున్నట్టు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ‘ఎక్స్’ వేదికగా సోమవారం వెల్లడించారు. దేశవ్యాప్తంగా ప్రజలతో విస్తృత చర్చల తర్వాత కాంగ్రెస్ తమ విజన్ డాక్యుమెంట్(మేనిఫెస్టో)ను విడుదల చేయనుందని తెలిపారు. ఆ మరుసటి రోజైన శనివారం(6వ తేదీ) జైపూర్, హైదరాబాద్‌లో మెగా ర్యాలీలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ‘‘జైపూర్‌లో పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, సీపీపీ చైర్ పర్సన్ సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంకా గాంధీ పాల్గొని మెగా ర్యాలీలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. హైదరాబాద్‌లో జరిగే కార్యక్రమంలోనూ రాహుల్ పాల్గొననున్నారు’’ అని తెలిపారు. తమ దృష్టి ఎల్లప్పుడూ దేశానికి సంక్షేమ ఆధారిత, అభివృద్ధి అనుకూల పాలనను అందించడంపైనే ఉంటుందని, ఈ ఎన్నికలకూ దానిపైనే ఫోకస్ పెట్టామని వేణుగోపాల్ పేర్కొన్నారు. కాగా, మొత్తం 543 లోక్‌సభ స్థానాలకు ఈ నెల 19 నుంచి 7 దశల్లో పోలింగ్ జరగనుండగా, జూన్ 4న ఫలితాలు వెలువడనున్న విషయం తెలిసిందే.





Next Story