IPL 2023: అరంగేట్రంలోనే సత్తాచాటిన ఆర్సీబీ యువ పేసర్

by Disha Web Desk 13 |
IPL 2023: అరంగేట్రంలోనే సత్తాచాటిన ఆర్సీబీ యువ పేసర్
X

బెంగళూరు: బెంగళూరు వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓ కుర్రాడు అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇంతకుముందెప్పుడు అతను ఐపీఎల్‌లో కనిపించలేదు. ఒక్కసారిగా మైదానంలో అద్భుత ప్రదర్శనతో ఫిదా చేశాడు. మ్యాచ్ అనంతరం నెటిజన్లు..‘ఎవరీ వైశాక్’ అంటూ అతని గురించి ఆరా తీయడం మొదలుపెట్టారు. అతనే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు యువ పేసర్ విజయ్‌కుమార్ వైశాక్. తన బౌలింగ్‌తో అద్భుతం చేసిన వైశాక్.. బెంగళూరు గెలుపొందడంలో కీలక పాత్ర పోషించాడు.

4 ఓవర్లలో 20 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. ఈ సీజన్‌లో మంచి ఫామ్‌లో ఉన్న డేవిడ్ వార్నర్‌ను తాను వేసిన తొలి ఓవర్‌లో పెవీలియన్ పంపాడు. అలాగే, కీలకమైన అక్షర్ పటేల్ వికెట్‌తోపాటు లలిత్ యాదవ్ వికెట్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్‌తోనే ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన అతను.. అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు. కర్ణాటకకు చెందిన వైశాక్.. 2021-22 సీజన్‌లో కర్ణాటక జట్టు తరఫున దేశవాళీలోకి ఎంట్రీ ఇచ్చాడు. 10 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 38 వికెట్లు, 7 లిస్ట్ ఏ మ్యాచ్‌ల్లో 11 వికెట్లు తీశాడు.

అలాగే, 14 టీ20 మ్యాచ్‌ల్లో 6.92 ఎకానమీతో 22 వికెట్లు పడగొట్టాడు. అయితే, గతేడాది డిసెంబర్ జరిగిన ఐపీఎల్ మినీ వేలంలో రూ. 20 లక్షల బేస్ ప్రైజ్‌తో పాల్గొన్న అతన్ని కొనుగోలు చేయడానికి ఏ ఫ్రాంచైజీ ముందుకు రాలేదు. అయితే, బెంగళూరు ఫ్రాంచైజీ నెట్ బౌలర్‌గా వైశాక్‌కు అవకాశమిచ్చింది. ఆర్సీబీ యువ క్రికెటర్ రజత్ పటిదార్ గాయం కారణంగా ఈ సీజన్‌కు దూరం కావడంతో వైశాక్‌ను ఫ్రాంచైజీ జట్టులోకి తీసుకుంది. యార్కర్లు, స్లో, నకుల్ బాల్స్‌ వేయడంలో అతను దిట్ట. నెట్స్‌లో విజయ్‌ కుమార్ తన బౌలింగ్‌తో కెప్టెన్ డుప్లెసిస్, విరాట్ కోహ్లీ దృష్టిని ఆకర్షించాడు. ఈ క్రమంలోనే ఆర్సీబీ మేనేజ్‌మెంట్ ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా తుది జట్టులోనే అవకాశం కల్పించింది. ఈ అవకాశాన్ని అద్భుతంగా అందిపుచ్చుకున్న వైశాక్ దుమ్ములేపాడు. దాంతో క్రికెట్ అభిమానులతోపాటు మాజీ క్రికెటర్లు సైతం అతనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.



Next Story