ఆలయం లేకున్నా ప్రాణప్రతిష్ఠ చేయొచ్చు.. ఎందుకో చెప్పిన శ్రీశ్రీ రవిశంకర్

by Dishanational4 |
ఆలయం లేకున్నా ప్రాణప్రతిష్ఠ చేయొచ్చు.. ఎందుకో చెప్పిన శ్రీశ్రీ రవిశంకర్
X

దిశ, నేషనల్ బ్యూరో : అయోధ్యలో నిర్మాణ దశలోని ఆలయంలో రాముడి విగ్రహాన్ని ప్రతిష్టిస్తున్నందున జనవరి 22న జరిగే కార్యక్రమానికి తాను వెళ్లలేనని జ్యోతిష్మఠ్ శంకరాచార్య అవిముక్తేశ్వరానంద సరస్వతి ఇటీవల చెప్పారు. ఈ వ్యాఖ్యపై ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు, ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్ తాజాగా స్పందించారు. స్వయంగా రాముడే.. ఆలయం లేకుండా శివలింగాన్ని ప్రతిష్ఠించిన సందర్భం గురించి పురాణాల్లో ప్రస్తావన ఉందని ఆయన గుర్తు చేశారు. దేవతామూర్తి ప్రాణ ప్రతిష్ఠ తర్వాత ఆలయాన్ని నిర్మించేందుకు అనుమతినిచ్చే నిబంధనలు కూడా శాస్త్రాల్లో ఉన్నాయన్నారు. తమిళనాడులోని రామేశ్వరంలో స్వయంగా రాముడే శివలింగానికి ప్రాణ ప్రతిష్ట చేశారని శ్రీశ్రీ రవిశంకర్ చెప్పారు. ఆ సమయానికి అక్కడ గుడి లేదన్నారు. ‘‘గుడి కట్టడానికి సమయం లేనందున.. ఆనాడు రామేశ్వరంలో నేరుగా శివలింగానికి శ్రీరాముడు ప్రాణ ప్రతిష్ట చేశారు. ఆ తర్వాత ఆలయ నిర్మాణం జరిగింది’’ అని ఆయన వివరించారు. ‘‘రామభక్తుల కల నిజమైంది. అయోధ్య రామమందిర నిర్మాణం కోసం ఐదు శతాబ్దాలుగా ప్రజలు ఎదురు చూస్తున్నారు. 500 ఏళ్ల క్రితం జరిగిన తప్పును ఇప్పుడు సరిదిద్దుతున్నారు. అందుకే దేశం మొత్తంలో పండుగ వాతావరణం నెలకొంది’’ అని ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు చెప్పారు.



Next Story