అయోధ్యపై సెర్చ్ 1806 శాతం పెరిగింది

by Dishanational4 |
అయోధ్యపై సెర్చ్ 1806 శాతం పెరిగింది
X

దిశ, నేషనల్ బ్యూరో : అయోధ్య రామమందిరం ప్రారంభమవడంతో ఉత్తర భారతదేశంలో పర్యాటకానికి మరో కొత్త తలుపు తెరుచుకుంది. ప్రముఖ ట్రావెల్ కంపెనీలు, ట్రావెల్ బుకింగ్ పోర్టల్‌లు, హోటల్ చైన్‌లు ఇప్పుడు అయోధ్యను కూడా తమ వ్యాపార ప్రణాళికలో చేర్చుకుంటున్నాయి. అయోధ్యకు పోటెత్తుతున్న భక్తజనం అండతో తమ వ్యాపారాలను పెంచుకునేందుకు సమాయత్తం అవుతున్నాయి. స్పిరిచ్యువల్ టూరిజానికి పెరుగుతున్న డిమాండ్ కూడా ఆయా సంస్థలకు ఊతమిస్తోంది. ప్రముఖ ట్రావెల్ పోర్టల్ ‘మేక్ మై ట్రిప్’‌లో తీర్థ యాత్ర ప్రదేశాల కోసం సెర్చ్ చేసే వారి సంఖ్య గత సంవత్సర కాలం వ్యవధిలో 97 శాతం పెరిగింది. 2023 మార్చి నుంచి 2024 జనవరి మధ్యకాలంలో మనదేశంలోని టాప్-10 తీర్థయాత్ర ప్రదేశాల జాబితాలో అయోధ్య నంబర్ 1 ప్లేస్‌లో నిలిచింది. ఈ జాబితాలో ఉజ్జయిని, బద్రీనాథ్, అమర్‌నాథ్, కేదార్‌నాథ్, మధుర కూడా ఉన్నాయి. రామమందిరం ప్రారంభమైన తర్వాత ‘మేక్ మై ట్రిప్’‌లో అయోధ్య కోసం సెర్చింగ్ చేయడం ఏకంగా 1806 శాతం పెరిగింది. అయోధ్యకు ఆదిలోనే ఇంతగా రద్దీ ఉంటే.. 2024 సంవత్సరం డిసెంబరు నాటికి రామమందిర నిర్మాణం పూర్తయ్యే సరికి ఇంకా ఎంతగా భక్తుల దర్శనాలు పెరుగుతాయో ఇట్టే ఊహించుకోవచ్చు. ప్రస్తుతం మందిరంలో గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే నిర్మితమైంది. మిగిలిన రెండు అంతస్తుల నిర్మాణ పనులు ఈ ఏడాది చివరికల్లా పూర్తవుతాయి. ఆలోగా అయోధ్య నగరం పరిసర ప్రాంతాల్లో ప్రముఖ హోటళ్లు ఏర్పాటయ్యే ఛాన్స్ ఉంది. ఇక అయోధ్యలోని మహర్షి వాల్మీకి విమానాశ్రయానికి కూడా రద్దీ పెరగనుంది. వెరసి టూరిజం రెక్కలు తొడగనుంది. దీనివల్ల ఎంతోమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కూడా లభిస్తుంది.

Next Story

Most Viewed