మహిళా రెజర్లు ఎదుర్కొన్న అవమానాలు బీజేపీని ఓడిస్తాయి : మాజీ సీఎం

by Harish |
మహిళా రెజర్లు ఎదుర్కొన్న అవమానాలు బీజేపీని ఓడిస్తాయి : మాజీ సీఎం
X

దిశ, నేషనల్ బ్యూరో: హర్యానా మాజీ సీఎం భూపేందర్ సింగ్ హుడా బీజేపీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఒక మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన నిరుద్యోగం, ధరల పెరుగుదల, రైతుల నిరసనలు, మహిళా రెజర్లు ఎదుర్కొన్న అవమానాలు హర్యానాలో బీజేపీని ఓడిస్తాయని అన్నారు. గత పదేళ్లుగా బీజేపీ ప్రభుత్వాన్ని ప్రజలు చూశారు. తలసరి ఆదాయం, శాంతిభద్రతల పరిస్థితి, ఉపాధి, ధరల పెరుగుదల వంటి అన్ని అంశాలలో కూడా ప్రభుత్వం చేతకాని తనం అందరికీ తెలిసిపోయిందని అన్నారు.

బీజేపీ విధానాల వల్ల నిరుద్యోగంలో హర్యానా మొదటి స్థానంలో నిలిచింది. చిన్నపిల్లలు చదువులు మానేసి ఉద్యోగాల కోసం ఇళ్లను వదిలి వెళ్లాల్సి వస్తుంది. ఉద్యోగాలు లేకపోవడంతో రాష్ట్రంలో యువత నిరాశతో ఉంది. బీజేపీ హయాంలో తమకు భవిష్యత్తు లేదని యువతకు తెలిసిపోయింది. అందుకే అక్రమంగా నైనా విదేశాలకు వెళ్లాలని యువత కోరుకుంటున్నారని మాజీ సీఎం అన్నారు.

ఏడాదిపాటు రైతులు చేసిన ఆందోళనలను దేశం మర్చిపోలేదు. రైతులపై అన్యాయంగా దాడులు చేశారు.700 మందికి పైగా రైతులు ప్రాణాలు కోల్పోయారు. బీజేపీ ఎంపీ లైంగిక వేధింపులపై చర్యలు తీసుకోవాలని మహిళా రెజ్లర్లు న్యాయం కోసం రోజుల తరబడి ఢిల్లీలో కూర్చోవాల్సిన పరిస్థితిని ప్రజలు మరిచిపోలేదు. వారికి ఎదురైన పరాభవం హర్యానాలో బీజేపీకి ఖచ్చితంగా ఎదురవుతుందని ఆయన పేర్కొన్నారు..

2014లో, 2019లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైనందున ప్రజలు బీజేపీకి ఓట్లు వేయరు. వారు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేశారా? యువతకు ఉపాధి హామీ ఇచ్చారా? రైతులకు ఎంఎస్పీపై హామీ ఇచ్చారా ? హర్యానా అంతటా బలమైన మార్పు గాలి వీస్తోంది. రాష్ట్రంలో ప్రజలు ఈ ఎన్నికలను పంచాయతీ ఎన్నికల మాదిరిగానే చూస్తున్నారు. ఏ పని చేయని బీజేపీ ప్రభుత్వంతో వారు విసిగిపోయారు. మూడోసారి అధికారంలోకి వస్తే మన రాజ్యాంగాన్ని బీజేపీ నాశనం చేస్తుందని ప్రజలు అర్థం చేసుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనే కాకుండా, పట్టణ ప్రాంతాల్లోనూ బీజేపీ నేతలను కళ్లముందు చూస్తుంటే ప్రజల్లో ఆగ్రహం వెల్లువెత్తుతోందని భూపేందర్ సింగ్ హుడా బీజేపీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే, ఖాళీగా ఉన్న ప్రభుత్వ పోస్టులను భర్తీ చేస్తాము, ఇక్కడ మరిన్ని పరిశ్రమలు తీసుకొచ్చి స్థానిక యువతకు ఉపాధి, ఉద్యోగాలు అందిస్తాం. ఉపాధి కోసం యువత తమ మాతృభూమిని వదిలి వెళ్లని రాష్ట్రంగా హర్యానాను మార్చాలని కాంగ్రెస్ కోరుకుంటోందని మాజీ సీఎం తెలిపారు.

Next Story

Most Viewed