ఐదు రోజుల్లో 50 శాతం బియ్యం పంపిణీ !

by  |
ఐదు రోజుల్లో 50 శాతం బియ్యం పంపిణీ !
X

దిశ, న్యూస్ బ్యూరో: ఈ నెలలో కేవలం 5 రోజుల్లోనే రికార్డు స్థాయిలో.. రాష్ట్రంలో 50 శాతం బియ్యం పంపిణీ చేశామని తెలంగాణ పౌర సరఫరాల కార్పొరేషన్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో బియ్యం పంపిణీని గడిచిన 3 రోజులుగా హైదరాబాద్‌, పౌర సరఫరాల భవన్‌లోని తన కార్యాలయం నుంచి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్టు చెప్పారు. ఆదివారం ఆయన హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌తో కలిసి ముషీరాబాద్ నియాజకవర్గంలోని రేషన్ షాపుల్లో బియ్యం పంపిణీ ప్రక్రియను పరిశీలించారు. షాప్ నెంబర్ 638‌లో లబ్దిదారులకు బియ్యం పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతి రేషన్ కార్డుదారుడికి రెండు, మూడు రోజుల్లో ఆన్‌లైన్ ద్వారా బ్యాంకు ఖాతాల్లో రూ. 1500 జమ చేస్తామన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో 2.80 కోట్ల మంది రేషన్ లబ్దిదారులకు ఉచితంగా 12 కిలోల బియ్యాన్ని పంపిణీ చేసే ప్రక్రియను ఈ నెల ఒకటో తేదీ నుంచి ప్రారంభించినట్టు తెలిపారు. తొలుత ఒకటి రెండు రోజుల పాటు సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయని, అయితే వాటిని వెంటనే పరిష్కరించినట్టు వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా బియ్యం పంపిణీ ప్రక్రియ సాఫీగా జరుగుతుందన్నారు. రాష్ట్రంలోని మొత్తం 87.55 లక్షల కుటుంబాలకు గాను 45 లక్షల కుటుంబాలకు 1.67 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఆదివారం వరకు పంపిణీ చేశామన్నారు. కాగా, ప్రతి నెల 1.67 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీకి 15 రోజులు పట్టేదని ఆయన గుర్తుచేశారు.

Tags: pds rice distribution, telangana, civil supplies chairman, cash transfer



Next Story