నెత్తురోడుతున్న మయన్మార్‌.. 38 మందిని పిట్టల్లా కాల్చిన ఆర్మీ

by  |
Myanmar military attack
X

దిశ, వెబ్ డెస్క్ : మన పొరుగుదేశం మయన్మార్ అట్టుడుకుతున్నది. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలదోసి.. పాలనా పగ్గాలను హస్తగతం చేసుకున్న మిలిటరీ ఆగడాలకు అంతేలేకుండా పోతున్నది. దీనిని నిరసిస్తూ ఆందోళన చేస్తున్న ఆందోళనకారులపై మయన్మార్ సైన్యం, పోలీసులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. దొరికినోళ్లను దొరికినట్టు పిట్టలను కాల్చినట్టు కాల్చి చంపారు. పలు అంతర్జాతీయ మీడియా కథనాల మేరకు బుధవారం ఒక్కరోజే 38 మందికి పైగా అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయారు. అయితే మృతుల సంఖ్య 50 దాటిందనీ, గాయపడిన వారి సంఖ్య వందల్లో ఉంటుందని రిపోర్టులు వెలువడుతున్నాయి.

మిలిటరీ నిరంకుశత్వాన్ని నిరసిస్తూ మయన్మార్‌లోని పలు ప్రాంతాల్లో పౌర సమాజం చేపట్టిన ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. నగరాల్లో ఆందోళనకారులు పెద్ద ఎత్తున చేరుకుని మిలిటరీ ఆగడాలను ప్రశ్నిస్తూ ర్యాలీలు తీశారు. యాంగాన్, మాండలే, మోన్యవా నగరాల్లో ర్యాలీ తీస్తున్న నిరసనకారులపై పోలీసులు టియర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్ల వర్షం కురిపించారు. కొద్దిసేపటికే ఆయా ప్రాంతాలకు చేరుకున్న ఆర్మీ.. వారిపై విచక్షణ లేకుండా కాల్పులు జరిపింది. గాయపడిన క్షతగాత్రులను కాపాడేందుకు వచ్చిన అంబులెన్స్ సిబ్బందిపైనా దాడులకు దిగింది. ఈ మారణహోమాన్ని కవర్ చేసేందుకు వెళ్లిన పాత్రికేయులపైనా కాల్పులకు దిగింది. కాగా.. ఈ దారుణాన్ని అంతర్జాతీయ సమాజం తీవ్రంగా ఖండిస్తున్నది. ఇదే విషయమై ఐక్యరాజ్యసమితిలో మయన్మార్ అధికార ప్రతినిధి క్రిస్టిన్ స్కారనర్ స్పందిస్తూ.. దీనిని ‘రక్తపాత దినం’గా అభివర్ణించారు.

ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ఆంగ్‌సాన్ సూకీని గతనెలలో నిర్బంధించిన ఆర్మీ.. అక్కడ సైనిక పాలన విధించింది. ఆమెను విడుదల చేయాలని అంతర్జాతీయంగా ఒత్తిళ్లు వస్తున్నా అందుకు ఆర్మీ ససేమిరా అంటున్నది. దీనిని నిరసిస్తూ పౌరులు ఆందోళనలు చేపడుతున్నారు.


Next Story

Most Viewed