దేశం మొత్తాన్ని కదిలించిన ఘటనకు నేటికి 35 ఏళ్లు

by  |
దేశం మొత్తాన్ని కదిలించిన ఘటనకు నేటికి 35 ఏళ్లు
X

దిశ, ఏపీ బ్యూరో: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకున్న దుర్ఘటన దేశంలోని దళితుల్లో చైతన్యం రగిలించి నేటికి 35 ఏళ్లవుతోంది. గుంటూరు జిల్లా కారంచేడులో 1985 జూలై 17న చోటుచేసుకున్న ఘటన ఎస్సీఎస్టీ అట్రాసిటీ చట్టం రూపకల్పనకు కారణమైంది. రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా కులం పోషిస్గున్న పాత్రతో పాటు దళితుల స్థితిగతులను చర్చనీయాంశంగా మార్చిన కారంచేడు ఘటన మరోసారి గుర్తు చేసుకుంటే… అప్పుడప్పుడే దళితుల్లో చైతన్య వంతులు తయారవుతున్నారు. సమాజంలో సమాన హక్కుల కోసం ఒకరిద్దరు ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే శూద్ర అగ్రకులంలోని వారిని ఒకట్రెండ్ సందర్భాల్లో ప్రశ్నించడాన్ని ఊరి పెద్దలు తట్టుకోలేకపోయారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి వియ్యంకుడి గ్రామంలో ధిక్కారమా? ఇదింకెత పాకుతుందో అంటూ మాదిగలపై మూకుమ్మడి దాడులకు తెగబడ్డారు. ఈ దాడుల్లో తేళ్ల మోషే, తేళ్ల ముత్తయ్య, తేళ్ల యెహోషువా, దుడ్డు వందనం, దుడ్డు రమేష్, దుడ్డు అబ్రహాం, దుడ్డ అలీసమ్మ బలయ్యారు. దీనిపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. కులాలు, మతాలకతీతంగా ఈ దారుణాన్ని వ్యతిరేకించారు. బాధితులకు న్యాయం జరగాలంటూ జరిగిన ఉద్యమంలో బొజ్జా తారకం, కత్తి పద్మారావు వంటి వారి నేతృత్వంలో దళిత మహాసభ పురుడు పోసుకుంది. ఈ కేసులో విచారణ జరిపిన సీబీసీఐడీ 9 సెక్షన్ల కింద 90 మందిని నిందితులుగా పేర్కొంటూ ఛార్జిషీట్ దాఖలు చేసింది. దీనికి 80 మందిని సాక్షులుగా పేర్కొంది.

అయితే, ప్రధాన నిందితుడయిన దగ్గుబాటి చెంచురామయ్య సహా మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో తేళ్ల జడ్సన్ ప్రైవేట్ పిటీషన్ వేశారు. ఈ కేసు తొలుత చీరాల మునిసిబ్ మెజిస్ట్రేట్ కోర్టులో దాఖలయ్యింది. ఈకేసులో 140 మందిని నిందితులుగా పేర్కొన్నారు. బొజ్జా తారకం, మట్టే వెంకట సుబ్బయ్య వంటి వారు న్యాయవాదులుగా పిటీషనర్ తరపున పనిచేశారు. ఆ తర్వాత కేసు పర్చూరుకి బదిలీ చేయడం పట్ల అభ్యంతరాలు రావడంతో చివరకు గుంటూరు కోర్టుకి బదిలీ చేశారు. అక్టోబర్ 30, 1994నాడు ఇచ్చిన తీర్పు ప్రకారం ఐదుగురికి యావజ్జీవ కారాగారశిక్ష, 65 ఏళ్ల వయసు పైబడిన నలుగురు వృద్ధ నేరస్థలకు 10 వేల రూపాయల చొప్పున జరిమానా విధించారు. 46 మందికి 3 ఏళ్ల చొప్పున జైలుశిక్ష పడింది.

శిక్షపడిన వారంతా హైకోర్టులో పిటీషన్ వేశారు. బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద 1998 జూలై 24న ఇచ్చిన తీర్పులో కింది కోర్టు విధించిన శిక్షలను హైకోర్టు కొట్టివేసింది. అయినప్పటికీ తేళ్ల జడ్సన్ వంటి వారు పట్టుదలతో ప్రయత్నం చేసి చివరకు 1998లో సుప్రీంకోర్ట్‌లో స్పెషల్ లీవ్ పిటీషన్ దాఖలు చేశారు. సరిగ్గా పదేళ్లకు అంటే 2008 డిసెంబర్ 19న సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. అప్పటికే పలువురు నిందితులు మరణించడంతో ఇక మిగిలిన వారిలో ప్రధాన నిందితుడు అంజయ్యకు జీవిత ఖైదు, మరో 29 మందికి మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ సామాజిక చరిత్రలో కీలక ఘట్టమైన కారంచేడు ఘటనపై ఆరు నెలల పాటు ఆందోళనలు జరిగాయి. బాధితులతో పాటు బాధితుల తరపున పోరాటం చేసిన వారు కూడా తీవ్ర అవమానాలకు గురయ్యారు. అయినప్పటికీ న్యాయస్థానం నుంచి ఊరట పొందారు.

Next Story

Most Viewed